మన దేశంలో ఎన్నికలంటే పండుగ వాతావరణమే. ఎన్నికల సీజన్‌ మొదలైందంటే సందడి మొదలవుతుంది. రాజకీయ నాయకుడు ప్రచారం జోరుగా సాగుతుంది. హామీల వర్షం కురుస్తుంది. పార్టీల నేతల మాటల యుద్ధాలు మొదలవుతాయి. ఇక ప్రధాన నేతలు తమ యాత్రలతో ప్రచారాన్ని హోరెత్తిస్తారు. మీడియాలో ఎక్కడ చూసినా ఎన్నికల వార్తలే దర్శనమిస్తాయి. అయితే.. ఇదంతా నాణానికి ఒక వైపు మాత్రమే.


ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం మనది. దీనికి గుండెకాయ ఎన్నికలే.. కాదనలేం. కానీ ఈ ఎన్నికల సమరంలో సమిధిగా మారే సామాన్యుడి సంగతేంటి.. ఎన్నికలు వస్తే చాలు.. కోడ్‌ అమల్లోకి వచ్చేస్తుంది. ఇక ఎన్నికల ప్రక్రియ మొదలైన దగ్గర నుంచి ఫలితాలు వెలువడే వరకూ ఎన్నికల కోడ్‌ అమల్లోనే ఉంటుంది. ఒక్కసారి కోడ్‌ కూత కూసిందంటే.. ఇక ఎక్కడ అభివృద్ధి అక్కడ ఆగిపోయినట్టే.. ప్రభుత్వాలు నామమాత్రం అవుతాయి. అత్యవసర పనులు తప్ప మిగిలినవన్నీ పడకేస్తాయి.


ఎన్నికలకంటే గందరోగళం, గొడవలు. మరి ఇంత సుదీర్ఘ కాలం ఎన్నికల ప్రక్రియ అవసరమా?  ఎన్నికలు వచ్చాయంటే పనులన్నీ ఎక్కడివక్కడే ఆగిపోతాయి. సాధారణ జనజీవనం దాదాపుగా స్తంభించిపోతుంది. మరి ఎన్నికలు అవసరం లేదా.. అంటే ప్రజాస్వామ్యంలో ఎన్నికలు అవసరమే.. కానీ.. ఎన్నికల కోడ్‌లోనూ మార్పులు రావాల్సిన అవసరం ఉంది. పాతకాలం నాటి ఎన్నికల కోడ్‌ను సమీక్షించాల్సిన అవసరం ఉంది.  కోడ్‌లో చాలా కఠినమైన నిబంధనలు ఉంటాయి. ఉదాహరణకు ఏడాది పొడవునా సాధారణంగా ఉండే విగ్రహాలకు కూడా ఎన్నికలు రాగానే ముసుగులు తొడిగేస్తారు.. అంటే ఆ విగ్రహాలను చూసే ఓట్లు ఎటు వేయాలో జనం డిసైడ్‌ చేసుకుంటారా.. ఇలా ఉంటాయి కొన్ని కోడ్‌ నిబంధనలు.


ఎన్నికల రోజు ఓటు వేసి వచ్చి తన పని తాను చూసుకునే సామాన్యుడి జనజీవనాన్ని దెబ్బతీయకుండా ఎన్నికలు జరిగేలా మార్పులు రావాల్సిన అవసరం ఉంది. కోడ్‌ నిబంధనలతో పాటు పార్టీల తీరు కూడా మారాల్సిన అవసరం ఉంది. ఇంకా 1950ల నాటి ప్రచార పద్దతులు, బహిరంగ సభల తీరు మారాలి. కరోనా వచ్చాక మన జీవితాల్లో ఎన్నో మంచి మార్పులు కూడా వచ్చాయి. వాటిలో ముఖ్యమైంది డిజిటలైజేషన్.

ఈ డిజిటలైజేషన్‌ను పార్టీలు కూడా ఉపయోగించుకోవాలి. ఎన్నికల్లో అభ్యర్థులకు ప్రధానంగా ఖర్చయ్యేది ప్రచారం కోసం.. తాయిలాల పంపిణీ కోసమే. తాయిలాల సంగతి ఎలా ఉన్నా.. ప్రచారం కోసం మాత్రం భారీగా ఖర్చవుతుంది. ర్యాలీలు, ప్రదర్శనలు, బహిరంగ సభలు ఏర్పాటు చేయాలి. ఆ సభలకు భారీగా జనాన్ని తీసుకురావాలి. ఆ జనం రావాలంటే..డబ్బులు ఇవ్వాలి. వారికి బిర్యానీ ప్యాకెట్‌, మందు సరఫరా చేయాలి. రవాణా ఖర్చులు చూసుకోవాలి. ఇంత తతంగం ఉంటుంది. ఒక్క బహిరంగ సభకే 20-30 కోట్లు ఖర్చు చేయాల్సిన పరిస్థితి. మరి ఇలా ఖర్చు చేసే సొమ్మును గెలిచాక సదరు అభ్యర్థి వసూలు చేసుకోవాల్సిందే కదా. అది కూడా జనం నుంచే దండుకోవాల్సిందే కదా. ఈ డిజిటల్‌ యుగంలోనూ ఈ పాతకాలపు ఆర్భాటం అవసరమా.. పార్టీలు ఆలోచించాలి.


ఇంతా చేసి బహిరంగ సభ అంటే ఏం ఉంటుంది. ముగ్గురో, నలుగురో ప్రధాన నాయకుల  ప్రసంగాలే కదా. డిజిటల్‌ యుగంలో.. ఆన్‌లైన్‌ యుగంలో.. పిల్లల పాఠాలే ఆన్‌లైన్‌లో చెప్పేస్తున్నారు. అలాంటిది నేతలు ప్రసంగాలు ఆన్‌లైన్‌లో చేస్తే తప్పేంటి. దీనివల్ల బోలెడు ఖర్చు ఆదా అవుతుంది. అభ్యర్థుల ఖర్చు తగ్గుతుంది. తద్వారా ఆ నేత ఎన్నికయ్యాక చేసే దోపిడీ కూడా తగ్గుతుంది కదా. ఈ బహిరంగ సభల ద్వారా సామాన్యుడి జీవితం అతలాకుతలం అవుతుంది. ఆర్టీసీ బస్సులు సహా రవాణా సాధనాలన్నీ ఈ సభలకే వాడటం వల్ల సాధారణ జనం రవాణా సదుపాయాల్లేక ఇబ్బంది పడుతుండటం మనం చూస్తూనే ఉంటాం.


అంతే కాదు.. ఎన్నికల సీజన్‌లో శ్రామికులను ఎక్కువగా ఈ సభలకు తరలిస్తుంటారు. దీని వల్ల ఎన్నో చిన్న పరిశ్రమలు కుంటుపడతాయి. పల్లెల్లో వ్యవసాయ పనులు ఆగిపోతుంటాయి. ఇదంతా అవసరమా.. బహిరంగ సభలు బల ప్రదర్శనలకు తప్ప ఎందుకు పనికొస్తాయి.. ఎన్నికల్లో కావాల్సింది సిద్ధాంత పరమైన చర్చలు తప్ప.. అనవసరపు ఆర్భాటాలు కాదు కదా.


అంతేనా.. ఎన్నికలు ముగిసే వరకూ అనేక వ్యాపార రంగాలు కూడా స్తబ్దుగా ఉంటాయి. ప్రధానంగా రియల్‌ ఎస్టేట్‌ రంగం. ఎన్నికల సమయంలో ఈ రంగం దాదాపు స్తంభించిపోతుంది.  స్థలాలకు రేట్లు ఉండవు.. అమ్మే కొనే వాడు ఉండడు.. ఎన్నికలు అవసరమే కానీ.. జనం గురించి కూడా ఆలోచించాలి కదా. ఎన్నికల సమయంలో సామాన్యుడు ఇబ్బందిపడకుండా.. అభివృద్ధి ప్రక్రియ ఆగిపోకుండా ఏం చేయాలో జనం, పార్టీల నాయకులు సీరియస్‌గా ఆలోచించాలి.  

మరింత సమాచారం తెలుసుకోండి: