ఆర్‌ కె రోజా.. ఈ పేరు ఎప్పుడూ ఓ సంచలనమే. ఆమె సినిమాల్లో ఉన్నా.. జబర్దస్త్‌లో ఉన్నా.. రాజకీయాల్లో ఉన్నా.. పదవిలో ఉన్నా.. రోజా ఎప్పుడూ ఓ సంచలనమే. అలాగని ఆమె ప్రస్థానం ఏమీ పూలపాన్పు కాదు. అడుగడుగునా ముళ్లు ఉన్నా.. ఆ రోజా ఎప్పుడూ వికసిస్తూ ఉంది. నల్లని మేని ఛాయతో ఉన్నా.. సినీ రంగంలో ప్రతికూలతలను అధిగమించి అందాల నవ్వుకు కేరాఫ్‌ అడ్రస్‌ అని నిరూపించుకుంది. సినిమాల తర్వాత రాజకీయాల్లో అడుగు పెట్టినా తన ప్రత్యేకత చాటుకుంటూనే ఉంది.


తెలుగు దేశం పార్టీతో రాజకీయ ప్రస్తానం ప్రారంభించిన రోజాపై మొదట్లో కొందరు ఐరెన్‌ లెగ్‌ అన్న ముద్ర వేయాలని ప్రయత్నించారు. కొన్నాళ్లు ఆ ముద్ర భరించింది కూడా. కానీ ఆమే ఆ తర్వాత కాలంలో తానో గోల్డెన్‌ లెగ్‌ అని నిరూపించుకుంది. కేవలం సినీ గ్లామర్‌తో రాజకీయాల్లో నెగ్గడం అంత ఈజీ కాదు. రాజకీయాల్లోకి అడుగు పెట్టిన వన్‌ టైమ్‌ వండర్‌గా మిగిలిపోయిన స్టార్స్ ఎందరో ఉన్నారు.. కానీ.. రోజా అలా కాదు.. మొదటి రెండు సార్లు నగరిలో ఓటమి వెక్కిరించినా  ఆమె కుంగిపోలేదు.


2014లో టీడీపీ నుంచి వైసీపీలోకి వచ్చాక.. మొదటిసారి గెలుపు రుచి చూసిన ఆమె.. 2019లోనూ విజయం సాధించారు. అయితే రోజాకు మొదటి నుంచి సొంత పార్టీలోనూ.. బయటి పార్టీలోనూ ఇబ్బందులు సృష్టించేవారున్నారు. అలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటూనే ఆమె విజయపథంలో పయనిస్తున్నారు. రెండోసారి ఎమ్మెల్యే అయ్యాక.. రెండో విడతలో ఆమె మంత్రి పదవి దక్కించుకున్నారు. అసలు ఆమెకు మంత్రి పదవి దక్కడం ఓ వండర్‌ అనే అనుకోవాలి.


అసలే రెడ్డి సామాజిక వర్గం.. అందులోనూ అదే జిల్లా నుంచి పెద్దిరెడ్డి మంత్రిగా ఉన్నారు.. ఇక రోజాకు ఛాన్స్‌ కష్టమే అనుకున్నా రోజా మంత్రిపదవి దక్కించుకున్నారు. మంత్రిగా ఎప్పుడూ సందడి చేస్తూ లైమ్‌లైట్‌లోనే ఉన్నారు. అయితే.. నగరిలో సొంత పార్టీలోనే ఆమెను వ్యతిరేకించేవారు ఎక్కువవుతున్నా.. ఆమె మాత్రం అన్నీ చక్కదిద్దూకుంటూ ఎప్పటికప్పుడు విజయాలు అందుకుంటున్నారు. మరి ఇప్పుడు విపక్షాన్ని.. సొంత పార్టీలోని అసమ్మతిని ఎదుర్కొని ముచ్చటగా మూడోసారి నగరి నుంచి గెలుపు సాధిస్తారా అన్నది ఆసక్తికరంగా మారింది.  

మరింత సమాచారం తెలుసుకోండి: