వేసవి అంటేనే జన సందోహాలు కోలాహలం. పిల్లలకు వేసవి సెలవులు కాబట్టి వినోదాలు, విహారాలకు అనువైన కాలం. అందుచేతనే సినిమాలు పోటా పోటీగా విడుదలై థియేటర్లు నిండుగా నడుస్తాయి. స్టార్ హీరోల చిత్రాలు, చిన్న బడ్జెట్ సినిమాలు, అనువాద చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వస్తుంటాయి. విద్యాసంస్థలు తెరిచే వరకు థియేటర్ల వద్దే సందడే సందడి.


వసూళ్ల పరంగా కూడా ఆయా సినిమాలు సరికొత్త రికార్డులు సృష్టిస్తూ ఫ్యాన్స్ ని ఖుషీ చేస్తుంటాయి. ఇదంతా ఒకప్పటి వైభవం. ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. ఈ సారి ప్రముఖ హీరీల సినిమాలు రాక.. పాత సినిమాల రీ రిలీజ్ లు కొనసాగాయి. రిలీజైన ,చిన్న సినిమాలకు ఆదరణ లభించడం లేదు. ఓ వైపు సార్వత్రిక ఎన్నికలు, మరోవైపు ఐపీఎల్ ఉండటంతో ఎక్కువ మంది వాటిలోనే లీనమైపోయారు. దీంతో పాటు పలు కారణాల చేత సినీ ప్రియులు థియేటర్ల వైపు కన్నెత్తి చూడటం లేదు.


వాస్తవంగా అయితే చిన్న సినిమా హీరోలైతే పాజిటివ్ టాక్ వస్తేనే జనాలు థియేటర్లకు వస్తారు. అదే అగ్ర హీరోలు అయితే తొలి ఆట నుంచే సినిమా హాళ్ల వద్ద సందడి నెలకొంటుంది. ఇక సినిమా హిట్ అయితే టికెట్ కౌంటర్ల ముందు హౌస్ ఫుల్ బోర్డు పెట్టేస్తుంటారు. కానీ ఇప్పుడా పరిస్థితి కనిపించడం లేదు. ఈ సమయంలో సింగిల్ స్ర్కీన్ నిర్వహాకుల కష్టాలు మరింత రెట్టింపయ్యాయి.


థియేటర్లు ప్రదర్శనలు రద్దు చేస్తే రూ.4 వేల నష్టం.. ఆట కొనసాగిస్తే రూ.6 వేల నష్టం వస్తుందని వాపోతుననారు. కరెంట్ ఛార్జీలు, నిర్వహణ వ్యయం ఇలా లెక్కలన్నీ వేసుకుంటే ఖర్చులు తడిసి మోపడవుతున్నాయంటున్నారు. ఇక థియేటర్లు ఫంక్షన్ హాల్ గా మారిపోతున్నాయి. ఏది ఏమైనా ప్రస్తుతం సినీ పరిశ్రమ సంక్షోభంలో ఉంది. దీనిని పరిష్కరించేందుకు చిరంజీవి అప్పట్లో అడుగులు వేశారు. ఆ తర్వాత ఏమైందో తెలియదు వెనకడుగు వేశారు. ప్రస్తుతం ఓటీటీ ప్లాట్ ఫామ్స్ వచ్చిన నేపథ్యంలో థియేటర్ల యజమానులు నష్టపోతున్నారు. అధిక ఆదాయం వస్తుందనే ఉద్దేశంతో సినీ నిర్మాతలు, హీరోలు కూడా ఓకే చెప్పేస్తున్నారు. ఇది క్రమంగా హీరోల సెలబ్రటీ ఇమేజ్ ని కూడా దెబ్బతీస్తుందని పలువురు హెచ్చరిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: