గోదావరి.. ఏపీకి జీవనాడి. ఈ పుణ్యనది మూడు, నాలుగు రాష్ట్రాల గూండా ప్రవహించి ఏపీకి చేరినా.. ఏపీలోనే ఎక్కువగా ప్రవహిస్తుంది. ఆంధ్రప్రదేశ్‌కే తన జలవనరులు అందిస్తుంది. అయితే.. ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోవడంలోనే ఆంధ్రప్రదేశ్‌ విఫలమవుతోంది. నదీతీరాలలోనే నాగరికత విలసిల్లిందన్నది చరిత్ర చెబుతున్నమాట. ఏపీలో వందల కిలోమీటర్ల కొద్దీ గోదావరి తీరం ఉన్నా.. దాని అభివృద్ధిలో మాత్రం ప్రభుత్వాలది ఆది నుంచి చిన్నచూపే.


గోదావ‌రి ప‌రివాహ‌క అభివృద్ది.. ఈ మాట ప్రతి ప్రభుత్వం చెబుతోంది. కానీ చేతల్లోనే ఆచరణ కరవవుతోంది. ఎప్పుడు ఏ ప్రభుత్వం వ‌చ్చినా.. తూర్పుగోదావ‌రిలోని గోదావ‌రి ప‌రివాహ‌క ప్రాంతాన్ని అభివృద్ధిచేస్తామ‌ని చెబుతున్నారు కానీ.. చేయ‌డం లేదు. కానీ గోదావరి తీర ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తే  ముంపు ప్రాంతాలు త‌గ్గడంతోపాటు.. ప‌ర్యాట‌క రంగం కూడా బాగా అభివృద్ధి చెందుతుంది. రాష్ట్రానికి ఆదాయం సమకూరుతుంది.


గోదావరి తీరంలో మన రాష్ట్రంలో ఎన్నో పట్టణాలు ఉన్నాయి. పాపికొండలు వంటి సుందర ప్రాంతాలు ఉన్నాయి. అంతేకాదు.. ఎన్నో ఆధ్యాత్మిక క్షేత్రాలు ఉన్నాయి. ఉమ్మడి మద్రాసు రాష్ట్రం నుంచి ఇప్పటి వరకూ గోదావరి తీరంలో ఎన్నో సినిమాలు షూటింగులు జరుపుకున్నాయి. సరిగ్గా ప్రోత్సహిస్తే.. రాజమండ్రి కేంద్రంగా సినీ పరిశ్రమ విస్తరణకూ అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. కావాల్సిందల్లా నేతల చొరవ మాత్రమే.


నదీ తీర ప్రాంతాలను అభివృద్ధి చేయకపోగా.. గోదావరి తీర ప్రాంతాలను కలుషితం చేయడంలో మాత్రం ముందున్నాం. తీర ప్రాంతాల్లో ఏర్పాటైన అనేక పరిశ్రమలు నేరుగా వ్యర్థాలను గోదావరిలో వదలుతూ కలుషితం చేస్తున్నాయి. వీటి ద్వారా అనేక జిల్లాలకు ప్రాణ నదిగా భావిస్తున్న సజీవ గోదావరి విష తుల్యం అవుతోంది. ఇప్పటికైనా ప్రభుత్వాలు చొరవ చూపితే.. గోదావరి తీర ప్రాంతం పర్యాటక పరంగానూ.. సినీ రంగం పరంగానూ ఎంతో అభివృద్ధికి నోచుకునే అవకాశం ఉంది. ఆ దిశగా ప్రభుత్వాలు అడుగు వేసేదెన్నడో.. గోదావరి పులకించేదెన్నడో..?

మరింత సమాచారం తెలుసుకోండి: