దేశంలో కరోనా విజృంభణ వల్ల ఉపాధి అవకాశాలు తగ్గిపోయాయి. కొత్త ఉద్యోగాల సంగతి పక్కన పెడితే ఉన్న ఉద్యోగాలే ఉంటాయో ఊడతాయో తెలీని పరిస్థితి నెలకొంది. సాఫ్ట్ వేర్ రంగం మినహా ఇతర రంగాల ఉద్యోగులు పడుతున్న ఇబ్బందులు అన్నీఇన్నీ కావు. కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో దేశంలోని పలు కంపెనీలు మూతబడ్డాయి. ఇలాంటి సమయంలో అమెజాన్ కస్టమర్లకు శుభవార్త చెప్పింది. 
 
తమ కస్టమర్ సర్వీస్ వింగ్‌లో 20 వేల సీజనల్ ఉద్యోగాలను భర్తీ చేయబోతున్నట్టు అమెజాన్ నుంచి కీలక ప్రకటన వెలువడింది. దేశంలోని ప్రముఖ నగరాల్లో ఉద్యోగులను నియమించుకోబోతున్నట్టు సంస్థ పేర్కొంది. హైదరాబాద్, పుణె, కోయంబత్తూరు, నోయిడా, కోల్‌కతా, జైపూర్, చండీగఢ్, మంగళూరు, ఇండోర్, భోపాల్, లక్నో నగరాల్లో అమెజాన్ ఉద్యోగులను నియమించుకోనుంది. 
 
వర్చువల్ కస్టమర్ సర్వీస్ ప్రోగ్రాంలో భాగంగా ఈ ఉద్యోగాలలో మెజారిటీ ఉద్యోగాలు ఉంటాయని తెలుస్తోంది. ఈ ఉద్యోగాల్లో పలు ఉద్యోగాలకు వర్క్ ఫ్రం హోం ఆప్షన్ కూడా ఉందని అమెజాన్ చెబుతోంది. 12వ తరగతి చదివి ఇంగ్లిష్, హిందీ, తమిళం, తెలుగు, కన్నడ భాషలలో నైపుణ్యం ఉన్న వారు ఈ ఉద్యోగాలకు అర్హులని..... ఉద్యోగులు పని వేళల్లో సర్దుబాటు చేసుకునే అవకాశం కూడా తాము కల్పిస్తామని పేర్కొంది. 
 
అయితే భర్తీ చేయబోయే 20 వేల ఉద్యోగాలు తాత్కాలిక ఉద్యోగాలు కావడం గమనార్హం. ఏడాది చివరి నాటికి కంపెనీ వ్యాపార అవసరాలను బట్టి వారిని శాశ్వత ఉద్యోగులుగా తీసుకోవాలో లేదో నిర్ణయం తీసుకుంటామని అమెజాన్ చెబుతోంది. ఆసక్తిగల అభ్యర్థులు 18002089900 ఫోన్ చేయవచ్చని సంస్థ ప్రకటించింది. seasonalhiringindia@amazon.com కు మెయిల్ చేసి ఆసక్తి గల అభ్యర్థులు ఉద్యోగాలు పొందవచ్చని సంస్థ పేర్కొంది.                                

మరింత సమాచారం తెలుసుకోండి: