పెళ్లిళ్లు, శుభకార్యాలకు ఎక్కువగా బంగారాన్ని కొనుగోలు చేస్తుంటారు. లాక్‌డౌన్ నేపథ్యంలో అవి కూడా వాయిదా పడడమో, లేదంటే ఎటువంటి హంగు ఆర్భాటాలు లేకుండా పని కానిచ్చేయడంతో బంగారం ఊసే లేకుండా పోయింది.  బంగారం అనే మాటెత్తితేనే మధ్యతరగతి ప్రజల గుండెలు అదిరిపోయేలా కనిపిస్తోంది. గత కొంతకాలంగా పెరుగుతూ పోతున్న పసిడి ధర మధ్యతరగతి ప్రజల కొనుగోలు స్థాయిని దాటేస్తోంది. తాజాగా  బంగారం కొనుగోలు చేయలని ప్లాన్ చేస్తున్న వారికి   గుడ్ న్యూస్. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర తగ్గుదల కారణంగా దేశీ మార్కెట్‌లో కూడా పసిడి ధర దిగొచ్చిందని బులియన్ మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు.  హైదరాబాద్ మార్కెట్‌లో గురువారం బంగారం ధర తగ్గింది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.560 పడిపోయింది.

 

దీంతో ధర రూ.45,360కు తగ్గింది. అదేసమయంలో 24 క్యారెట్ల బంగారం ధర కూడా దిగొచ్చింది. 10 గ్రాముల బంగారం ధర రూ.590 తగ్గుదలతో రూ.48,400కు క్షీణించింది. కాకపోతే వెండి మాత్రం రూ.1340 మేర పైకి కదిలింది. దీంతో వెండి ధర రూ.49,000కు చేరింది. పరిశ్రమ యూనిట్లు, నాణేపు తయారీదారుల నుంచి డిమాండ్ పుంజుకోవడం ఇందుకు ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. దేశ రాజధాని ఢిల్లీ మార్కెట్‌లో కూడా పసిడి ధర తగ్గింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.360 దిగొచ్చింది.

 

రూ.46,200కు పడిపోయింది. అదేసమయంలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర కూడా ఇదే దారిలో నడిచింది. రూ.960 తగ్గుదలతో రూ.48,000కు దిగొచ్చింది. కేజీ వెండి ధర రూ.1430 పెరిగింది. దీంతో ధర రూ.49,000కు చేరింది.  ఇదిలా ఉంటే.. అమెరికా-చైనా మధ్య ఉద్రిక్త పరిస్థితులు, అమెరికా, జపాన్‌ దేశాల బలహీన ఎకనమిక్‌ డేటా ఇవన్నీ పసిడి ధరలపై ప్రభావం చూపుతున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో ఇన్వెస్టర్లు బంగారాన్నే నమ్ముకోవడం కూడా బంగారం ధరల పెరుగుదలకు కారణంగా తెలుస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: