కొంతమందికి వాతావరణం మారితే సీజనల్ వ్యాధులు చాలా ఇబ్బంది పెడతాయి.ఇక వర్షాకాలంలో అయితే ఈసమస్య మరీ ఎక్కువుగా ఉంటుంది. ఇటీవల అసలే వర్షాలు కూడా ఎక్కువుగా పడ్డాయి.మురికి నీరు చేరి.. దోమలు ఎక్కువ అవడానికి తోడు వాతావరణ మార్పులతో సీజనల్ వ్యాధులు అధికమవుతున్నాయి. వాతావరణం ఉన్నట్టుండి మారడంతో సీజనల్ వ్యాధులు వేగంగా వ్యాపిస్తాయి. దీంతో ఏపీ, తెలంగాణలో చాలా మంది సీజనల్ ఫీవర్స్ తో బాధపడుతున్నారు. దగ్గు, జలుబు, గొంతు నొప్పి, జ్వరం, కడుపు నొప్పి, వాంతులు, విరేచనాలు, శ్వాసకోశ సమస్యలు, తిన్న ఆహారం జీర్ణంకాక పోవడం వంటివి సీజనల్ వ్యాధుల కిందకి వస్తాయి. అంతేకాకుండా వర్షాకాలంలో వచ్చే మరి కొన్ని వ్యాధులు మలేరియా, డెంగ్యూ జ్వరం, టైఫాయిడ్ జ్వరంతో పాటు హెపటైటిస్- ఏ వంటివి సీజనల్ వ్యాధుల జాబితాలోకి వస్తాయి. అన్నీ వయసుల వారు ఈ వ్యాధుల బారిన పడుతుంటారు. ఈవ్యాధులు రావడానికి ప్రధానంగా కలుషిత ఆహరం, మురికి నీరు. ఎక్కవ కాలం ఒకే ప్రాంతంలో నిలిచి ఉన్న మురుకి నీరు.. వాటి పై వాలే దోమలు ఈ వ్యాధులకు ప్రధాన కారణం. ఈ సమయాల్లో చాలా మంది దగ్గుతూ ఉంటారు. ఇలా ఒకరి నుంచి మరోకరికి దగ్గు వ్యాప్తి చెందే అవకాశం ఉంది.దోమల వల్ల వ్యాపించే మలేరియా , డెంగ్యూ వంటి వ్యాధులు కొన్నిసార్లు మరింత ప్రమాదకరమైనవిగా మారుతాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.


అందుకే వాటిని ముందుగా గుర్తించి అశ్రద్ధ చేయకుండా.. చికిత్స చేయించుకోవాలని సూచిస్తున్నారు. సీజనల్ వ్యాధుల నివారణకు క్రింది చర్యలు తీసుకుంటే వాటి బారిన పడకుండా మనల్ని మనం కాపాడుకునే అవకాశం ఉంటుందని వైద్యులు సూచిస్తున్నారు.డెంగ్యూ, మలేరియాల జ్వరాలు సోకకుండా ఉండాలంటే దోమలు కుట్టకుండా దోమతెరలు, రిపెల్లెంట్లు ఉపయోగించాలి.ముఖ్యంగా మనం నివసిస్తున్న ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. చుట్టుపక్కలా ఎక్కడా మురుగు నీరు నిలిచిపోకుండా చూసుకోవాలి.సాధ్యమైనంత వరకు తాజా ఆహారాన్ని తీసుకోవడంతో పాటు కాచి చల్లార్చిన నీటిని తీసుకోవడం ద్వారా ఆరోగ్యంగా ఉండొచ్చు.పానీపూరీ, పండ్ల రసాలు, ఇతర జంక్ ఫుడ్‌కు దూరంగా ఉండాలి.చేతులను శుభ్రంగా కడుక్కోవడం అలవాటు చేసుకోవాలి. దీని ద్వారా అతిసార వ్యాధిని, ఇతర సీజనల్ వ్యాధుల బారిన పడకుండా కాపాడుకోవచ్చు.తీసుకునే ఆహారం, తాగే నీటి విషయంలో జాగ్రత్త వహించాలి. కలుషిత ఆహారం, కలుషిత నీటిని దూరంగా ఉంచడం వల్ల డయేరియా, టైఫాయిడ్ జ్వరం నుంచి రక్షణ పొందవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: