శరీరంలో ఎర్ర రక్త కణాలు లేదా హిమోగ్లోబిన్ శాతం తగ్గడాన్నే రక్తహీనత (Anemia) అంటాము. దీనివల్ల నీరసం, అలసట, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి సమస్యలు ఎదురవుతాయి. అయితే మన వంటింట్లో లభించే కొన్ని అద్భుతమైన ఆహారాలను రోజువారీ డైట్‌లో చేర్చుకోవడం ద్వారా ఈ సమస్యకు సులభంగా చెక్ పెట్టవచ్చు.
ముఖ్యంగా ఆకుకూరలు, అందులోనూ తోటకూర మరియు పాలకూరలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. వీటిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయిలు వేగంగా పెరుగుతాయి. అలాగే డ్రై ఫ్రూట్స్ విషయానికి వస్తే ఎండు ద్రాక్ష, ఖర్జూరం, అంజూర పండ్లు రక్తహీనతకు దివ్యౌషధంగా పనిచేస్తాయి. వీటిలో ఉండే ఇనుము మరియు విటమిన్ బి12 కొత్త రక్త కణాల ఉత్పత్తికి తోడ్పడతాయి.
పండ్ల విషయానికొస్తే దానిమ్మ పండు అత్యంత శక్తివంతమైనది. ఇందులో ఐరన్ మాత్రమే కాకుండా కాల్షియం, మెగ్నీషియం కూడా సమృద్ధిగా ఉంటాయి. ప్రతిరోజూ ఒక గ్లాసు దానిమ్మ రసం తాగడం వల్ల రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. అలాగే బీట్‌రూట్ కూడా రక్తహీనతను నివారించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఇది రక్త శుద్ధికి మరియు ఎర్ర రక్త కణాల పెరుగుదలకు సహాయపడుతుంది. వీటితో పాటు కోడిగుడ్లు, మాంసం, చేపలు వంటి ప్రోటీన్ అధికంగా ఉండే ఆహారాలు కూడా రక్తవృద్ధికి మేలు చేస్తాయి.
అయితే కేవలం ఐరన్ ఉన్న ఆహారాలు తీసుకోవడమే కాకుండా, ఆ ఐరన్‌ను శరీరం గ్రహించాలంటే విటమిన్-సి కూడా చాలా అవసరం. అందుకే భోజనం తర్వాత నిమ్మరసం లేదా నారింజ పండ్లు తీసుకోవడం వల్ల మనం తిన్న ఆహారంలోని పోషకాలు శరీరానికి బాగా అందుతాయి. అదేవిధంగా బెల్లం మరియు వేరుశనగ పప్పులతో చేసిన చిక్కీలు రక్తవృద్ధికి సహజమైన టానిక్‌లా పనిచేస్తాయి. ఇలాంటి సహజసిద్ధమైన ఆహారపు అలవాట్లను పాటిస్తే రక్తహీనత సమస్యను తరిమికొట్టి ఆరోగ్యంగా ఉండవచ్చు. రక్త హీనతతో బాధ పడేవాళ్ళు ఈ విషయాలను కచ్చితంగా గుర్తుంచుకోవాలి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి