పిల్లలు ఏది పడితే అది తినరు. అందులోను టీనేజర్లు మరీను. ఒక పక్క చదువు మరోపక్క లావు అవుతావేమో అన్న భయంతో సరిగా తిండి తినరు. వాళ్లు పుస్తకాలతో కుస్తీ పడుతుంటే, అమ్మలు వారికి ఎలాంటి ఆహారం పెట్టాలా అని తెగ టెన్షన్పడిపోతుంటారు. అయితే పరీక్షలప్పుడే పిల్లల ఆహారం విషయంలో తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉంటే సరిపోదు. తిండి విషయంలో మొదటి నుంచీ జాగ్రత్తగా వ్యవహరించాలి. పోషకవిలువలతో, ఖనిజాలతో కూడిన ఆహారం వాళ్లకి పెట్టాలి. అలా చేయడం వల్ల పిల్లలు చదువులో రాణించడమే కాదు ఎంతో ఆరోగ్యంగా కూడా ఉంటారు.చదువు కన్న ముందు పిల్లలు సరైన పోషక విలువలతో కూడిన ఆహారం తినాలి. అసలు చదవాలంటే ముందు శరీరంలో ఓపిక కావాలి కదా.. ఒక్క ఓపికనే కాదు జ్ఞాపక శక్తి కూడా బాగుండాలి.
శరీరం బలవర్థకంగా ఉండడానికి కొన్ని రకాలైన ఆహారాలు తప్పనిసరి. తిండి విషయంలో పిల్లల ఇష్టాలను పరిగణనలోకి తీసుకుంటూనే వాటిల్లో పోషకవిలువలు ఉండేలా తల్లిదండ్రులు జాగ్రత్తపడాలి. ఉదాహరణకు ఇడ్లీ, కిచిడి, ఓట్స్, ఉప్మాల్లాంటివి బ్రేక్‌ఫా్‌స్టగా పిల్లలకు పెడితే మంచిది. ఎందుకంటే ఇవి శరీరానికి కావలసిన గ్లూకోజ్‌ను అందిస్తాయి. అలాగే డ్రైఫ్రూట్స్ కూడా రోజూ పెడుతుండాలి. కొంతమంది పిల్లలకు ఒకేసారి పెద్ద మొత్తంలో ఆహారం తినే అలవాటు ఉంటుంది.
అలా కాకుండా రోజులో ఐదారుసార్లు కొద్ది కొద్దిగా ఆహారం తింటే పిల్లలకు మంచిది. పరీక్షల సమయంలో పిల్లలు తీవ్ర ఒత్తిడికి గురవుతుంటారు. దాన్ని అధిగమించడానికి కోడిగుడ్లు మంచి మందులా పనిచేస్తాయి. కూరగాయలు, ఆకుకూరలు, నట్స్, పండ్లు, చేపలు వంటివి ఎదిగే పిల్లలకు రోజూ పెట్టాలి. ఈ తరహా ఆహారపదార్థాలు పిల్లలకు కావలసిన విటమిన్లు, మినరల్స్, పోషకాలను పుష్కలంగా అందిస్తాయి. అంతేకాదు పండ్లలో, ఆకుకూరల్లో ఉండే యాంటాక్సిడెంట్లు పిల్లల్లోని మానసిక ఒత్తిడిని తగ్గిస్తాయి.అలాగే పిల్లలకి కావలిసిన జ్ఞాపక శక్తిని ఇస్తాయి..
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి