ఏమీ తెలియని అసలు మాటలు కూడా సరిగ్గా రాని వయసు నుంచే పిల్లలకి స్మార్ట్ ఫోన్లు అలవాటు చేసే పెద్దలు ఇకనైనా అలాంటి పనులు చేయడం మానండి, మాన్పించండి. చిన్న పిల్లలకి స్మార్ట్ ఫోన్ ఇవ్వడమంటే వారి చేతికి ఒక గ్రాము కొకైన్ ఇస్తున్నట్లేనని మానసిక శాస్త్రవేత్తలు అంటున్నారు. ఓ సర్వేలో స్మార్ట్ ఫోన్లను ఎక్కువగా వినియోగిస్తున్న చిన్నారుల్లో ఆలోచన శక్తి క్రమంగా క్షీణిస్తున్నట్లు తేలింది. కొంతమంది తల్లిదండ్రులు, పెద్దలు.. తమ పిల్లలు వారి పనికి అడ్డు తగలకుండా, అల్లరి చేయకుండా ఒక చోట కూర్చోవాలనే ఉద్దేశ్యంతో స్మార్ట్ ఫోన్లను వారి చేతికి ఇస్తున్నట్లు తెలిసింది. దీనివల్ల పిల్లలు ఆటలకు దూరమై స్మార్ట్ ఫోన్లకు బానిసలవుతున్నారు. ఇది మానసిక సమస్యలనే కాకుండా శరీరక సమస్యలను కూడా ఏర్పరుస్తుందనే ఆందోళన వ్యక్తమవుతోంది.

హార్లే స్ట్రీట్ క్లీనిక్ డైరెక్టర్, అడిక్షన్ థెరపిస్ట్.. మ్యాండీ సలిగారీ చిన్నారుల స్మార్ట్ ఫోన్‌కు బానిసలు కావడంపై గురించి ఓ సదస్సులో వివరించారు. ‘‘పిల్లలకి స్మార్ట్ ఫోన్‌ ఇవ్వడమంటే ఒక మద్యం సీసా లేదా ఒక గ్రామ్ కొకైన్ వారికి ఇస్తున్నట్లే. ఎందుకంటే స్మార్ట్ ఫోన్‌ని ఎక్కువగా వినియోగించే చిన్నారుల మెదడు క్రమంగా మద్యం సేవించిన వారిలా మొద్దుబారిపోతుంది. సాధారణ కాంతి కంటే ఎక్కువగా లైటింగ్‌ను వెదజల్లే ఫోన్ వల్ల కంటి చూపు మందగిస్తోంది. స్మార్ ఫోన్‌ ఉపయోగించే పిల్లల ప్రవర్తన మొండిగా మారుతోందని, చివరికి వారిలో ధిక్కార స్వరం పెరుగుతూ వస్తోంది’’ అని స్పష్టం చేశారు. పిల్లలకు టెక్నాలజీని పరిచయం చేయడంలో తప్పులేదని, వాటికి బానిసలుగా మార్చితేనే ప్రమాదమని అంటున్నారు. వారు ఎక్కువ సేపు ఫోన్లతో గడపకుండా కనిపెట్టాలన్నారు. స్మార్ట్ ఫోన్ల వల్ల కలిగే నష్టాన్ని వారికి అర్థమయ్యేలా తల్లిదండ్రులు వివరించాలన్నారు.

ముఖ్యంగా 1 నుంచి 15 ఏళ్ల లోపు చిన్నారులు ఫోన్లతో గడపడం చాలా ప్రమాదకరమని తెలిపారు.కేవలం పిల్లలే కాదు.. 16 నుంచి 25 ఏళ్ల వయస్సు యువత కూడా మొబైళ్లకు బానిసలవుతున్నారు. వయస్సుకు మించిన పర్శనాలిటీతో సమస్యలు కొనితెచ్చుకుంటున్నారు. యుక్త వయస్సులోనే పోర్న్ చూడటం, సెక్స్‌టింగ్ చేయడం వంటి చెడు అలవాట్లను అలవరుచుకుని చదువులకు దూరమవుతున్నారని ఆయన వివరించారు. ఇదే విషయాన్ని బేలార్ యూనివర్శిటీ స్టడీ సైతం వెల్లడించింది. ఈ అధ్యయానికి నేతృత్వం వహించిన ప్రోఫెసర్ జేమ్స్ రాబర్ట్ మాట్లాడుతూ.. పిల్లలు లేదా టీనేజర్లు సెల్‌ఫోన్ వాడటమంటే డ్రగ్స్ తీసుకుంటున్నట్లే అని అన్నారు. అయితే, అది ఒక్కొక్కరిలో ఒక్కోలా పనిచేస్తుందని అన్నారు. కరోనా వైరస్ వల్ల నేడు.. పిల్లల చదువులంతా మొబైల్ ఫోన్లలోనే సాగుతున్నాయి. దీన్ని అదనుగా చేసుకుని పిల్లలు ఎక్కువ సేపు స్మార్ట్ ఫోన్లతో తమతో ఉంచుకుంటున్నారు. ఈ నేపథ్యంలో.. కేవలం ఆన్‌లైన్ క్లాసులు జరిగేంత వరకే ఫోన్ వారి వద్ద ఉండేలా చర్యలు తీసుకోండి. లేకపోతే.. పిల్లల కంటి చూపు నాశనం చేసేమనే బాధ జీవితాంతం వెంటాడుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: