రాజకీయాల్లో కష్టపడి పనిచేస్తే ఫలితం ఎప్పటికైనా వస్తుంది. అయితే ఒకోసారి ఆ ఫలితం త్వరగా వచ్చేయొచ్చు, ఒకోసారి ఆలస్యం అయిపోవచ్చు. అలా ఆలస్యంగా ఫలితం పొందిన నాయకుల్లో టీడీపీ సీనియర్ నేత నిమ్మకాయల చినరాజప్ప ముందువరుసలో ఉంటారు. టీడీపీ ద్వారా రాజకీయ జీవితం మొదలుపెట్టిన రాజప్ప, అంచలంచెలుగా ఎదుగుతూ వచ్చారు. అనేక ఏళ్ల పాటు తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షుడుగా పని చేసి, పార్టీని నిలబెట్టారు.

ఇక అలా పార్టీ కోసం పనిచేసిన రాజప్పకు, 2014 ఎన్నికల్లో చంద్రబాబు సీటు ఇచ్చారు. చినరాజప్ప పెద్దాపురం అసెంబ్లీ నుంచి పోటీ చేసి గెలిచారు. ఎమ్మెల్యేగా గెలిచిన రాజప్పకు తన కేబినెట్‌లో హోమ్ మంత్రి పదవి ఇచ్చారు. ఐదేళ్లు ఆయన హోమ్ మంత్రిగా ఎఫెక్టివ్‌గా పనిచేయకపోయినా, ఎమ్మెల్యేగా మాత్రం నియోజకవర్గంలో బాగానే పనిచేశారు. అందుకే 2019 ఎన్నికల్లో రాష్ట్రంలో జగన్ గాలి ఉన్నా సరే, రాజప్ప టీడీపీ తరుపున గెలిచారు.

మృదుస్వభావిగా పేరు తెచ్చుకున్న రాజప్ప ప్రతిపక్షంలోకి వచ్చాక, జగన్ ప్రభుత్వంపై దూకుడుగానే ఉంటున్నారు. అటు నియోజకవర్గంలో ప్రజలకు అండగా ఉంటున్నారు. తనకు సాధ్యమైన మేర పనులు చేస్తున్నారు. ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్నారు. ఇక పెద్దాపురంలో వైసీపీ ప్రభుత్వ పథకాలు కూడా బాగానే అమలవుతున్నాయి. పలు అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి.

అయితే మొన్న ఎన్నికల్లో వైసీపీ తరుపున ఓడిపోయిన తోట వాణి పార్టీలో యాక్టివ్‌గా లేరు. దీంతో వైసీపీ అధిష్టానం ఆమెని సైడ్ చేసేసి, దవులూరి దొరబాబుని నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌గా నియమించారు. అధికార నేతగా దొరబాబు నియోజకవర్గంలో బాగానే పనిచేస్తున్నారు. ప్రజల సమస్యల పరిష్కరించడంలో కూడా ముందుంటున్నారు. కాకపోతే ఇక్కడ రాజప్ప బలం పెద్దగా తగ్గినట్లు కనిపించడం లేదు. గతంలో ఆయన చేసిన అభివృద్ధి ఇంకా పెద్దాపురంలో కనిపిస్తోంది. పైగా వైసీపీ వచ్చాక పెద్దగా అభివృద్ధి జరిగినట్లు కనిపించడం లేదు. దీంతో పెద్దాపురం ప్రజలు ఇంకా రాజప్ప వైపే ఉన్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: