ఎట్టకేలకు ఏపీ టీడీపీ అధ్యక్షుడుగా కింజరాపు అచ్చెన్నాయుడు బాధ్యతలు చేపట్టారు. ఈ‌ఎస్‌ఐ స్కామ్‌లో ఇటీవలే జైలు నుంచి వచ్చిన అచ్చెన్నకు అధ్యక్ష బాధ్యతలు అప్పగిస్తున్నారని ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతుంది. ఇక తాజాగా టీడీపీ అధిష్టానం నుంచి ప్రకటన వచ్చేసింది. అచ్చెన్నకు ఏపీ పగ్గాలు అప్పగించేశారు. ఇక టీడీపీ అధ్యక్షుడుగా ఉన్న అచ్చెన్న టెక్కలి ఎమ్మెల్యేగా ఎలా పనిచేస్తున్నారనే విషయం ఒక్కసారి చూస్తే...2019లో జగన్ గాలి ఉన్నా సరే అచ్చెన్న టెక్కలి నుంచి విజయం సాధించారు.

అయితే అచ్చెన్న తొలిసారిగా 1996 ఉపఎన్నికలో హరిశ్చంద్రపురం నియోజకవర్గం నుంచి పోటీ చేసి విజయం సాధించారు. ఆ తర్వాత అదే స్థానం నుంచి 1999, 2004 ఎన్నికల్లో గెలిచారు. ఇక నియోజకవర్గాల పునర్విభజన తర్వాత టెక్కలి నియోజకవర్గానికి మారి, 2009 ఎన్నికల్లో పోటీ చేసి స్వల్ప మెజారిటీతో ఓడిపోయారు. 2014 ఎన్నికల్లో టెక్కలి నియోజకవర్గం నుంచి విజయం సాధించడమే కాకుండా, చంద్రబాబు కేబినెట్ లో మంత్రిగా కూడా పనిచేశారు. 2019 ఎన్నికల్లో మరోసారి గెలిచి ప్రతిపక్షానికి పరిమితమయ్యారు.

ప్రతిపక్ష ఎమ్మెల్యేగా అచ్చెన్న దూకుడుగానే ఉన్నారు. చంద్రబాబుకు కుడి భుజంగా ఉంటూ, అటు అసెంబ్లీలో గానీ, ఇటు బయటగానీ అధికార వైసీపీకి ధీటుగా కౌంటర్లు ఇస్తున్నారు. చంద్రబాబు ఏ పోరాటానికి పిలుపునిచ్చిన చేయడానికి ముందుంటున్నారు. అయితే జైలు నుంచి వచ్చాక అచ్చెన్నలో దూకుడు తగ్గింది. మరి ఇప్పుడు ఏపీ టీడీపీ పగ్గాలు చేపట్టారు కాబట్టి ఎలా నడుచుకుంటారో చూడాలి.

అటు టెక్కలిలో వైసీపీ నేత పేరాడ తిలక్ అధికారాన్ని ఉపయోగించుకుని ప్రజలకు అండగా ఉంటున్నారు. ఏ సమస్యలు ఉన్నా వాటిని పరిష్కరించడంలో ముందుంటున్నారు. వచ్చే ఎన్నికల్లోనైనా అచ్చెన్నకు చెక్ పెట్టి వైసీపీ జెండా ఎగరవేయాలనే కసితో పనిచేస్తున్నారు. అయితే ఇక్కడ సమస్యలు కూడా ఎక్కువగానే ఉన్నాయి. టెక్కలి మండలంలో ప్రధాన సమస్యలు సాగు, తాగు నీరు. ఇదేకాకుండా ఈ ప్రాంతంలో రహదారులు, రోడ్లు అస్తవ్యస్తంగా ఉండటంతో రవాణా సౌకర్యాలు అధ్వాన్న స్థితిలో ఉన్నాయి. హరిశ్చంద్రపురం, కోటబొమ్మాళిల్లో రైల్వే హల్ట్‌ను పూర్తి స్థాయి స్టేషన్లుగా మార్చాలి. సంతబొమ్మాళి మండలంలో చేపల వేట లేక పోవడం వల్ల మత్స్యకారులు వలసలు ఎక్కువగా ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: