పీడిక రాజన్న దొర...దివంగత వైఎస్సార్‌కు వీర విధేయుడు. కాంగ్రెస్‌లో ఉండగా వైఎస్‌కు అండగా నిలిచిన రాజన్న...ఇప్పుడు వైఎస్ తనయుడు జగన్‌తో ముందుకెళుతున్నారు. కాంగ్రెస్‌లో రాజకీయ జీవితం మొదలుపెట్టిన రాజన్న... 2004 ఎన్నికల్లో విజయనగరం జిల్లా సాలూరు నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఇక 2009 ఎన్నికల్లో తిరిగి అదే స్థానం నుంచి పోటీ చేసి విజయం సాధించారు. కానీ అనూహ్యంగా వైఎస్సార్ మరణించడం, జగన్ వైసీపీ పెట్టడంతో అందులోకి వచ్చారు.

2014 ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేసి విజయం సాధించారు. అప్పుడు టీడీపీ ఆపరేషన్ ఆకర్ష్ చేపట్టిన కూడా రాజన్న మాత్రం జగన్‌ని వదల్లేదు. వైసీపీలోనే కొనసాగి 2019 ఎన్నికల్లో మళ్ళీ సాలూరు బరిలో విజయం సాధించారు. అయితే వైఎస్సార్ ఫ్యామిలీకి వీర విధేయుడుగా ఉండటంతో రాజన్నకు మంత్రి పదవి వస్తుందని అంతా భావించారు. కానీ అనూహ్యంగా బొత్స సత్యనారాయణ, రాజన్నకు పదవి రాకుండా అడ్డుకున్నారని,  మంత్రి పదవిని పుష్పశ్రీవాణికి దక్కేలా చేశారని జిల్లాలో టాక్.

గిరిజన మంత్రిగా, డిప్యూటీ సీఎంగా పుష్పశ్రీ వాణి ఉన్నారు. ఇక మంత్రి పదవి రాకపోయిన రాజన్న ప్రజలకు సేవ చేయడంలో ఏ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ...సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారు. అందరికీ ప్రభుత్వ పథకాలు అందేలా చూస్తున్నారు. అయితే నియోజకవర్గంలో పలు సమస్యలు కూడా ఉన్నాయి. నియోజకవర్గంలో రోడ్లు మరీ దారుణంగా ఉన్నాయి. గిరిజన ప్రాంతం కావడంతో కనీస వైద్య సదుపాయాలు లేవు. మక్కువ మండలంలో డిగ్రీ కాలేజ్ ఏర్పాటు చేయాల్సిన అవసరముంది. మెంటాడ మండలంలో ఆంధ్ర జలాశయం వల్ల 8 గ్రామాలకే లబ్ధి చేకూరుతుంది తప్పా, మిగిలిన గ్రామాలకు నీరు అందడం లేదు. సాలూరు మండలంలో  తాగునీటి సమస్య ఎక్కువగానే ఉంది.

రాజకీయంగా చూసుకుంటే సాలూరులో రాజన్న బలంగానే ఉన్నారు. ఇక వచ్చే విడతలో రాజన్నకు మంత్రి పదవి దక్కడం ఖాయంగా కనిపిస్తోంది. జగన్ అండ పుష్కలంగా ఉండటంతో ఈసారి పదవి రావడం పక్కా అని అర్ధమవుతుంది. బొత్సని దాటి ఈసారి మంత్రి అయ్యే అవకాశాలున్నాయి. అటు టీడీపీ విషయానికొస్తే సీనియర్ నేత రాజేంద్ర ప్రతాప్ భాంజ్...నియోజకవర్గంలో పెద్దగా యాక్టివ్‌గా లేరు. ప్రస్తుతానికైతే ఇక్కడ టీడీపీ వీక్‌గానే ఉంది. అందుకే స్థానిక సంస్థల ఎన్నికల్లో మెజారిటీ స్థానాలు వైసీపీ ఖాతాలో పడటం ఖాయం.

మరింత సమాచారం తెలుసుకోండి: