తెలుగు చలనచిత్రసీమలో సువర్ణాక్షరాలతో లిఖించ దగిన దర్శకుల్లో విజయ నిర్మల కూడా ఒకరు. కేవలం నటిగానే కాకుండా దర్శకురాలిగాను అద్భుత ప్రేక్షకాదరణ పొందారు. మొదట బాలనటిగా సినీ రంగంలోకి అడుగు పెట్టిన విజయ నిర్మల ఆ తరువాత బీఎన్ రెడ్డి గారు తెరకెక్కించిన ‘రంగుల రాట్నం’ సినిమాతో హీరోయిన్‌గా తెలుగులోకి ఎంట్రీ ఇచ్చారు. ఈ సినిమాలో రెండో హీరోయిన్ పాత్రలో నటించిన విజయ నిర్మల మొదటి సినిమాతోనే అందరినీ మెప్పించారు. ఆ తరువాత హీరోయిన్‌గా వరుస సినిమాలు చేశారు. బాపు గారి దర్శకత్వంలో ‘సాక్షి’ సినిమాను చేస్తున్న సమయంలో దర్శకత్వంపై ఆసక్తి పెంచుకున్నారు. కానీ అప్పడు దర్శకురాలిగా కెరీర్ ప్రారంభించలేదు. హీరోయిన్‌గా 100 సినిమాలు పూర్తయిన తరువాత దర్శకత్వం వైపు తన తొలిఅడుగులు వేశారు.
అయితే విజయ నిర్మల తన తొలి దర్శకత్వ సినిమాను మలయాళంలో రూపొందించారు. కానీ మొదట విజయనిర్మల దర్శకత్వంలో సినిమాను నిర్మించేందుకు నిర్మాతలు ముందుకు రాకపోవడంతో ‘సంగం మూవీస్’ అనే  సొంత బ్యానర్‌ను స్థాపించారు. అదే బ్యానర్‌పై తన తొలి సినిమా ‘కవిత’ను తెరకెక్కించారు. ఈ సినిమా బాగా ఆడటంతో దర్శకురాలిగా కొనసాగారు. ఆ తరువాత తెలుగులో ఎంట్రీ ఇచ్చేందుకు సిద్దమయ్యారు. ఈ క్రమంలోనే యద్దనపూడి సులోచన రాణి గారు రచించిన నవల ‘మీనా’ను సినిమాగా తెరకెక్కించాలని భావించారు. అందుకోసం ఈ కథా హక్కులను దుక్కిపాటి మధుసూదనరావు గారి వద్ద తీసుకొని ‘మీనా’ సినిమాగా సూపర్ స్టార్ కృష్ణ హీరోగా తెరకెక్కించారు. ఈ సినిమా ప్రారంభంలో మహిళా దర్శకురాలని నటులెవ్వరూ పెద్దగా సహకరించలేదు. ఆ తరువాత విజయ నిర్మల పనితీరు చూసి అందరూ ఆశ్చర్యపోయి ఆమెకు పూర్తి సహకారాన్ని అందించారు. అంతేకాకుండా విజయ నిర్మలకు ‘పని రాక్షసి’ అంటూ గుమ్మడిగారు కితాబిచ్చారు.
సినిమా భారీహిట్‌గా నిలవడంతో తెలుగు చలనచిత్రసీమలో దర్శకురాలిగా విజయ నిర్మల గుర్తింపు పొందారు. ఆమె 44 సినిమాలకు దర్శకురాలిగా పనిచేశారు. ఓ మహిళా దర్శకురాలిగా అత్యధికంగా 44 సినిమాలకు పనిచేసిన విజయ నిర్మల ‘గిన్నీస్ బుక్ ఆఫ్ ది వరల్డ్ రికార్డు’ను సాధించారు. ఈ రికార్డును 2002లో అందుకున్నారు. ఈమె రఘుపతి వెంకయ్య పురస్కారానికి కూడా ఎంపికయ్యారు. విజయనిర్మల దర్శకురాలిగా చేసిన 44 సినిమాల్లో 1 మలయాళం, 1 తమిళం కాగా మిగతా వాటిలో 20 సొంత బ్యానర్‌పై తీయగా, 22 సినిమాలు బయట బ్యానర్‌లపై రూపొందించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: