షార్ట్‌ ఫిలిమ్స్‌, పలు సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేసుకుంటూ తనదైన మార్క్‌ పంచ్‌లతో 'పెళ్లిచూపులు' సినిమాతో కమెడియన్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు ప్రియదర్శి.టెర్రర్‌ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈయన 'పెళ్లిచూపులు' సినిమా ద్వారా ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు. మధ్యలో 'మల్లేశం' సినిమాతో తన నటనలో ఉన్న మరో కోణాన్ని చూపించి, కామెడీనే కాదు ఏ పాత్రలైనా చేస్తానని ప్రూవ్‌ చేసుకున్నాడు ప్రియదర్శి. ప్రస్తుతం వరుస చిత్రాలతో బిజీబిజీగా ఉన్నారు. ఇటీవల విడుదలైన 'ఒకే ఒక జీవితం' చిత్రం విజయవంతమైన సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో ఆయన పంచుకున్న పలు ఆసక్తికర విషయాలు..తెలుగు చిత్రపరిశ్రమలో తనదైన కామెడీ టైమింగ్‌.. పంచ్‌లు.. ప్రాసలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు కమెడియన్‌ ప్రియదర్శి. టెర్రర్‌ సినిమాతో సినీరంగ ప్రవేశం చేశారు. 'పెళ్లిచూపులు' చిత్రంలో చెప్పిన ఒకే ఒక్క డైలాగ్‌తో ఆయన క్రేజ్‌ మారిపోయింది. ఆ చిత్రంలో 'నా చావు నేను చస్తా అనే పుస్తకం రాస్తున్నా!' అంటూ ప్రియదర్శి చెప్పిన డైలాగ్‌ యూత్‌ను ఎంతగానో ఆకట్టుకుంది. ఆ తర్వాత 'అర్జున్‌రెడ్డి, జై లవకుశ, జాతి రత్నాలు, రాధేశ్యామ్‌, సీతారామం' వంటి హిట్‌ చిత్రాల్లో నటించి, మెప్పించారు. ఆ తర్వాత ఆయన ప్రధానపాత్రలో నటించిన మల్లేశం సినిమాకు ప్రేక్షకుల నుంచే కాదు.. సినీ విమర్శకుల నుంచీ ప్రశంసలు అందుకున్నారు. ఆ సినిమా తర్వాతే చాలామంది చేనేత కుటుంబాల గురించి తెలుసుకున్నానని.. అందులోని పాత్రను చూసి చాలామంది ప్రశంసించారని ప్రియదర్శి చెప్పుకొచ్చారు. ఇక ఇటీవల హీరో శర్వానంద్‌ ప్రధానపాత్రలో తెరకెక్కిన 'ఒకే ఒక జీవితం' సినిమాలో కనిపించారు. ఈ క్రమంలోనే తాజాగా 'చెప్పాలని ఉంది' కార్యక్రమంలో తన కెరీర్‌లో ఎదురైన సంఘటనలు.. సినిమాల గురించి ఆసక్తికర విషాయలను పంచుకున్నారు.నన్ను నేను ప్రోత్సహించుకునేవాడిని..

'నేను ఇండిస్టీలోకి రావడం ఇంట్లో వారికి ఏమాత్రం ఇష్టం లేదు. దీంతో సినిమాటోగ్రాఫర్‌ అవుదామని కెమెరా వర్క్‌ నేర్చుకున్నాను. అయితే ఇక్కడికి వచ్చాక నటుడిగా ఆడిషన్స్‌ ఇస్తున్న క్రమంలో ఘోరంగా అవమానించేవారు. ఇక 2014లో శ్రీకాంత్‌ హీరోగా నటించిన టెర్రర్‌ సినిమాకి ఆడిషన్స్‌ జరుగుతుంటే వెళ్లాను. ఆడిషన్స్‌కు వెళ్లినప్పుడు నల్లగా, సన్నగా ఉన్నానంటూ విమర్శించేవారు. మొటిమలు ఎక్కువగా ఉన్నాయని.. హీరో కంటే పొడుగ్గా ఉన్నానని కూడా నన్ను రిజెక్ట్‌ చేశారు. కానీ అవేవి నేను పట్టించుకోలేదు. అలా అన్నప్పుడల్లా నన్ను నేను ప్రొత్సహించుకునేవాడిని. సరిగ్గా ఆ సమయంలో ''టెర్రర్‌''లో ఓ పాత్రకు నేనే సరిగ్గా సరిపోతానని వారే నాకు ఫోన్‌ చేశారు' అని చెప్పుకొచ్చారు.

మేమేంటో నిరూపించుకోవాలని అనుకున్నాం..

''పెళ్లిచూపులు'' సమయంలో అందరం ఎలా అయినా మేమేంటో నిరూపించుకోవాలి అనే తపనతో ఉన్నాం. ఆ సినిమాతో నా కెరీర్‌లో చాలా మార్పు వచ్చింది. ''పెళ్లిచూపులు'' దర్శకుడు తరుణ్‌ భాస్కర్‌ మల్టీ టాలెంటెడ్‌పర్సన్‌. నేను తనకి ఎప్పుడు ఫోన్‌ చేసినా ఏం చేస్తున్నావ్‌? అని అడగను.. ఏం చేయట్లేదు అని అడుగుతాను. ఇక యాక్టింగ్‌ విషయానికొస్తే నాకు చిన్నప్పటి నుంచే భిక్షుగారు తెలుసు. మేము చేసిన ఓ షార్ట్‌ఫిల్మ్‌ ఆయనకు చూపించాను. ఆయన సింపుల్‌గా 'నువ్వు యాక్టింగ్‌ బాగా చేయట్లేదు' అని చెప్పేశారు. 'ఇంటికి రా నేను నేర్పిస్తాను' అన్నారు. అందరూ నా నటన బాగుందని మెచ్చుకుంటుంటే ఆయన అలా అన్నారేంటని ఆలోచించాను. కానీ ఆయన నాకు నటనలో చాలా నేర్పించారు. ఇక విజరు నాకు మంచి ఫ్రెండ్‌!' అని చెప్పారు.

కెరీర్‌ మొదలైందే షార్ట్‌ఫిల్మ్స్‌తో...

'నా కెరీర్‌ మొదలైంది షార్ట్‌ఫిల్మ్స్‌తోనే. నాకు ఓటీటీల పవర్‌ ఏంటో బాగా తెలుసు. సినిమా థియేటర్లకు ఏమాత్రం తీసిపోవని నాకు అప్పుడే అర్థమైంది. ఆ తర్వాత కోవిడ్‌ వచ్చింది. అందరూ ఇళ్లలో కూర్చొని ఓటీటీలను బాగా చూశారు. ఆ సమయంలో నాకు ''మల్లేశం'' సినిమా అవకాశం వచ్చింది. చాలా మంది పెద్ద హీరోలు కూడా కలిసినప్పుడు చాలా బాగా చేస్తున్నావు అని ప్రోత్సహిస్తారు. అయితేనేను ఇలాంటి పాత్రలే చేయాలని ప్రణాళికలు ఏవీ వేసుకోలేదు. ఎవరు ఏ పాత్ర ఇస్తే ఆ పాత్ర చేసుకుంటూ వెళిపోతున్నా అంతే. నిర్మాతలు, దర్శకులు, హీరోలు వాళ్లందరూ నన్ను నమ్మి, నాకు అవకాశం ఇస్తారు. నేనెప్పుడూ నా పరిధిని నిర్ణయించుకోలేదు. నేను ''పెళ్లిచూపులు'' సినిమా చేశాక రవివర్మ గారు ''నువ్వు కమెడియన్‌ అని నేను అనుకోను. నువ్వు మంచి టైమింగ్‌ ఉన్న నటుడివి'' అన్నారు. అది మర్చిపోలేని ప్రశంస!' అని అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: