మెగా పొలిటికల్ హీరో ఏ బహిరంగ సమావేశంలో మాట్లాడినా, తమ అభిమానులంటే తమ మెగా కుటుంబానికి ఎనలేని అభిమానం అని, నిరంతరం తమ అభిమానుల గురించే తాము ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటామని, అలాగే తమ అభిమానులు కూడా తమ గౌరవాన్ని పెంచే విధంగా ఉండాలని హిత బోధ చేస్తూ ఉంటారు. అదే విధంగా మెగా అభిమానులు కూడా తమ హీరోల గురించి, తమ హీరోల సినిమాల గురించి ఎటువంటి త్యాగాలు చెయ్యడానికి అయినా సిద్ధంగా ఉంటారు. వారి అభిమాన హీరోల సినిమాల ప్రమోషన్ కు విపరీతంగా తమ సొంత డబ్బు ఖర్చు పెడతారు అన్న విషయం కూడా అనేక సందర్భాలలో రుజువు అయింది.
ప్రస్తుతం రామ్ చరణ్ ‘ఎవడు’,అలాగే పవన్ కళ్యాణ్ ‘అత్తారింటికి దారేది’ సినిమాలు అతి తక్కువ వ్యవధిలో ప్రేక్షకుల ముందుకు రాబోతుండడంతో ఈ సినిమాల పబ్లిసిటీ గురించి కట్ అవుట్స్, ఫ్లెక్స్ లు తమ సొంత ఖర్చుతో పెట్టి ఆనంద పడే అభిమానులకు ఈ రెండు సినిమాలు కొద్ది గ్యాప్ తో రావడం ఈ కరువు కాలంలో వారికి వరంగా మారిందని ఫిల్మ్ నగర్ లో మాటలు వినిపిస్తున్నాయి. దీనికి ప్రధాన కారణం రాజధాని లోని ఏ ప్రధాన కూడలిలోనైనా మెగా అభిమానులు 50x30 భారీ బ్యానర్ కట్టాలి అంటే ప్రస్తుతం దాదాపు 20 వేల దాకా ఖర్చు అవుతుందట. ఇంత భారీ స్థాయిలో బ్యానర్లు, ఫ్లెక్స్ లు పెట్టిన తరువాత మళ్ళి వెంటనే అదే కుటుంబానికి చెందిన మరో హీరో సినిమా వస్తే ఖర్చు రిత్యా మెగా అభిమానులకు కష్టంగా మారుతుంది.
కాబట్టి తమ అభిమానుల డబ్బును పొదుపు చెయ్యడానికే అటు చెర్రీ, ఇటు పవన్ లు అతి తక్కువ వ్యవధిలో తమ సినిమాలను మెగా అభిమానుల ముందుకు తీసుకువస్తున్నారని, దీనివల్ల ఒకే బ్యానర్ పై రెండు సినిమాల పబ్లిసిటీ చెయ్యడం ద్వారా తమ అభిమానుల డబ్బు వృధాగా ఖర్చుకాకుండా మెగా హీరోలు తమ మెగా అభిమానుల రుణం తీర్చుకుంటున్నారనే మాటలు ఫిల్మ్ నగర్ లో వినిపిస్తున్నాయి.