హీరో అంటే కథానాయకుడు.. కథానాయకుడు సహజంగా కష్టాల్లో ఉన్న ప్రజలను ఆదుకుంటాడు. ఎవరికి కష్టం వచ్చినా ఆదుకునేందుకు ముందుంటాడు.. అందరి మంచి కోరుతాడు. ఈ లక్షణాలు ఉన్న హీరో మహేశ్ బాబు.. రీల్ లోనే కాదు.. రియల్ లైఫ్ లోనూ హీరో అనిపించుకుంటున్నాడు.


ఆయన తరచూ అవసరమైన వారికి సాయం చేస్తుంటారు. తాజాగా ఇద్దరు చిన్నారుల గుండె శస్ర్తచికిత్సలకు ఆర్ధిక సాయం చేశారు. ఆంధ్ర హాస్పటల్స్ లో చికిత్స పొందుతున్న చిన్నారులకు అవసరమైన ఆర్థిక సాయం మహేశ్ బాబు అందించారు.


ఈ ఆసుపత్రి ఆధ్వర్యంలో ప్రతీ ఏడాది చిన్నారులకు గుండె ఆపరేషన్లు నిర్వహిస్తారు . ఈసారి జరిగే ఆపరేషన్లలో మహేష్ బాబు తన అభిమాన సంఘాల ద్వారా ఇద్దరు పిల్లలకు అండగా నిలిచారు. ఆంధ్ర హాస్పటల్స్ , హీలింగ్ లిటిల్ హార్ట్స్ యుకె సంస్థ సంయుక్తంగా చిన్నారుల గుండె ఆపరేషన్లు నిర్వహిస్తున్నారు .


ఈ ఆపరేషన్లు నాలుగేళ్ల నుంచి జరుగుతున్నాయి . కొంతకాలం నుంచి హీరో మహేష్ బాబు ఈ కార్యక్రమానికి బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నారు. ఈ ఆసుపత్రి ఆధ్వర్యంలో ఈ ఏడాది 15 మందికి ఆపరేషన్లు చేస్తున్నారు. వీరిలో ఇద్దరు చిన్నారులకు మహేష్ బాబు ఆర్థిక సాయం అందించారు.


ఈ ఆపరేషన్లు చేయాలంటే.. ఒక్కొక్కరికి నాలుగు లక్షల రూపాయల వరకూ ఖర్చవుతుంది. చాలామంది రోగులు ఈ ఆపరేషన్లు చేయించుకునేంత స్థోమత ఉండదు. అలాంటి వారికి దాతల నుంచి సాయం తీసుకుంటారు ఈ ఆసుపత్రి వారు. సెలబ్రెటీల సాయం కూడా అందుకుంటారు. అందులో భాగంగానే మహేశ్ బాబు ఏటా కొంతమందికి సాయం చేస్తున్నారు. వారి ఆపరేషన్లకయ్యే ఖర్చును భరిస్తున్నారు. తన ఫ్యాన్స్ పేరు మీద ఈ కార్యక్రమాలు చేయడం మహేశ్ బాబుకు అలవాటు. మహేశ్ ఫ్యాన్స్ కూడా ఇలాంటి కార్యక్రమాలకు బాగా స్పందిస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: