లాక్ డౌన్ ఎత్తివేసి ధియేటర్లు ఓపెన్ చేసినా ఎంతవరకు జనం ధియేటర్లకు వస్తారు అన్నవిషయమై అనేకసందేహాలు కొనసాగుతున్నాయి. కొందరు ఇండస్ట్రీ విశ్లేషకులు అయితే కరోనా నివారణకు వ్యాక్సిన్ కనుక్కునే వరకు జనం ధియేటర్లకు ధైర్యంగా రారని ఒకవేళ యూత్ సినిమాల పై వ్యామోహంతో ధియేటర్లకు వచ్చినా ఫ్యామిలీ ప్రేక్షకులు మాత్రం ఇప్పట్లో ధియేటర్ల వైపు చూసే పరిస్థితి లేదు అనిఅంటున్నారు.


ఇలాంటి పరిస్థితులలో భారీ బడ్జెట్ తో నిర్మాణం జరుపుకునే టాప్ హీరోల సినిమాలకు బయ్యర్ల నుండి ఇదివరకు లా భారీ మార్కెట్ రాదనీ అందువల్ల ఇక రానున్న రోజులలో భారీ సినిమాల హవా పూర్తిగా తగ్గిపోతుంది అన్నఅంచనాలు వస్తున్నాయి. ఇలాంటి పరిస్థితులలో కలవర పడుతున్న టాప్ హీరోలకు అల్లు అరవింద్ ఊహించని విధంగా పైలెట్ గా మారబోతు ఉండటం ఆశ్చర్యంగా మారింది. 


ప్రస్తుతం అనేక సినిమాల షూటింగ్ లు ఆగిపోవడంతో అనేక రంగాలకు ప్రభుత్వాలు ఈ లాక్ డౌన్ సమయంలో మినహాయింపులు ఇస్తున్న పరిస్థితులలో తమకు కూడ మినహాయింపులు ఇచ్చి షూటింగ్ లను తిరిగి మొదలుపెట్టుకోవడానికి అనుమతి ఇవ్వవలసిందిగా అనేకమంది ప్రముఖ నిర్మాతలు తెలంగాణ రాష్ట్రప్రభుత్వ పెద్దలతో ఇప్పటికే రాయబారాలు చేస్తున్నారు. తెలుస్తున్న సమాచారం మేరకు తెలంగాణ ప్రభుత్వం కేవలం 20 మంది యూనిట్ సభ్యులతో షూటింగ్ లు మొదలు పెడితే తమకు అభ్యంతరం లేదు అంటూ సంకేతాలు ఇస్తున్నట్లు తెలుస్తోంది.


అయితే ఇంత తక్కువ మంది సంఖ్యతో సినిమాలు షూట్ చేయడం సాధ్యం కానిపని అని నిర్మాతలు చేతులేత్తేస్తున్నట్లు తెలుస్తోంది. దీనితో రంగంలోకి దిగిన అల్లు అరవింద్ తాను ఒక మినీ వెబ్ సిరీస్ ను కేవలం 20 మంది యూనిట్ సభ్యులతో ఒకచిన్న అవుట్ డోర్ లొకేషన్ లో నిబంధనలు పాటిస్తూ షూట్ చేస్తానని దానిని అనుమతించమని కోరినట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు అరవింద్ అభ్యర్ధన పై చర్చలు జరుపుతున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన అధికారులు అరవింద్ మొదలు పెట్టబోయే ఈ మినీ వెబ్ సిరీస్ ను సినిమాల షూటింగ్ ప్రారంభానికి ఒక ట్రైల్ టెస్ట్ గా అనుమతిస్తే ఎలా ఉంటుంది అన్నఆలోచనలు చేస్తున్నట్లు టాక్..

మరింత సమాచారం తెలుసుకోండి: