జబర్దస్త్ హాస్య నటుడు హైపర్ ఆది కేవలం మూడు సంవత్సరాల్లోనే తన పాపులారిటీని తారాస్థాయికి తీసుకెళ్ళాడు. కొన్ని నెలల వరకు బుల్లితెర కి మాత్రమే పరిమితమైన ఆది ప్రస్తుతం స్టార్ హీరోల సినిమాలలో ముఖ్యంగా మెగా ఫ్యామిలీ నుండి వచ్చిన హీరోల సినిమాలో కీలకమైన పాత్రలలో నటించే స్థాయికి ఎదిగాడు. బుల్లితెర పై దూసుకెళ్లినట్టు వెండితెరపై కూడా దూసుకెళ్తున్నాడు. అయితే కెరీర్ పీక్ స్టేజ్ లో ఉన్న ఆదికి పెళ్లి సంబంధాలు చూస్తున్నారు తన కుటుంబ సభ్యులు. ఆది కూడా తన జీవితంలో ఈ సమయంలోనే సెటిల్ కావాలని... మంచి అమ్మాయిని చూసుకొని పెళ్లి చేసుకోవాలని భావిస్తున్నాడట. ఈ విషయాలను ఆది ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ చెప్పుకొచ్చాడు.


ప్రేమ పెళ్లిళ్లు తనకి సూట్ కావని పెద్దలు కుదిర్చిన వివాహమే చేసుకుంటాను అని అతను కుండబద్దలు కొట్టి చెప్పాడు. మీ పెద్దలు మీకు ఏదైనా పెళ్లి సంబంధం కుదిర్చారా అని అడిగితే... ఇంకా లేదండి అని చెప్పాడు. మరి మీరు వచ్చే ఏడాది లోనే పెళ్లి చేసుకుంటానని చాలా సందర్భాల్లో చెబుతున్నారు కదా అని ప్రశ్నించగా... నా పెళ్లి గురించి ఎవరైనా అడిగితే ప్రతి సంవత్సరము వచ్చే సంవత్సరమే చేసుకుంటున్నానని చెబుతున్నాను అని సెటైర్ వేసాడు ఆది.


వరుణ్ తేజ్ హీరోగా నటించిన తొలిప్రేమ, సాయి ధరంతేజ్ హీరోగా నటించిన చిత్రలహరి, అల్లరి నరేష్ హీరోగా నటించిన మేడమీద అబ్బాయి, వెంకీ మామ సినిమాల్లో హైపర్ ఆది పాత్రలు అందరినీ బాగా మెప్పించాయి. కానీ ప్రస్తుతం అతనికి ఏ సినిమాలో నటించే అవకాశం రాకపోవడం గమనార్హం. ఇకపోతే రంగస్థలం సినిమాలో రామ్ చరణ్ కి స్నేహితుడి పాత్రలో నటించిన జబర్దస్త్ హాస్య నటుడు మహేష్ మొన్నీమధ్య పెళ్లి చేసుకున్నాడు. జబర్దస్త్ కార్యక్రమం లోని అందరిలో మోస్ట్ ఎలిజిబుల్ బాచిలర్ అయిన సుడిగాలి సుధీర్ ఎప్పుడు ఎవరిని పెళ్లి చేసుకుంటారనేది ఎప్పుడూ హాట్ టాపిక్ గా మారుతుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: