దేశంలో శరవేగంగా వ్యాప్తి చెందుతున్న కరోనా వైరస్ సినిమా, టీవీ రంగాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. వైరస్ భయం వల్ల సినిమా షూటింగులు ప్రారంభం కాలేదు. టీవీ షూటింగులు జరుగుతున్నా యూనిట్ లో ఎవరో ఒకరికి కరోనా నిర్ధారణ అవుతూ ఉండటంతో మధ్యలోనే బ్రేకులు పడుతున్నాయి. ఇలాంటి సమయంలో ప్రతి సంవత్సరం బుల్లితెర తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్న బిగ్ బాస్ షో ఈ సంవత్సరం ఉంటుందా...? లేదా...? అనే అనుమానాలు మొదలయ్యాయి.
అయితే స్టార్ మా ఛానెల్ ఇప్పటికే అనుమానాలకు తెర దించుతూ తాజాగా టీజర్ ను విడుదల చేసింది. ఇప్పటికే మూడు సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకున్న బిగ్ బాస్ నాలుగో సీజన్ అతి త్వరలో ప్రసారం కానుంది. అయితే వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో నిర్వాహకులు మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. బిగ్ బాస్ నిర్వాహకులు ఈ షోలో పాల్గొనే హౌస్ మేట్స్, సాంకేతిక నిపుణులు, వ్యాఖ్యాతలకు ప్రత్యేకంగా బీమా చేయించినట్లు తెలుస్తోంది.
బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లే వాళ్లకు ఆరోగ్య పరీక్షలు, కరోనా పరీక్షలు చేయడంతో పాటు షో ప్రారంభం కంటే 15 రోజుల ముందే క్వారంటైన్ కు తరలించనున్నారు. ఏ మాత్రం అజాగ్రత్తగా వ్యవహరించినా ప్రమాదమని భావించి నిర్వాహకులు తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. బిగ్ బాస్ సీజన్ 3 హోస్ట్ గా ఆకట్టుకున్న నాగార్జున సీజన్ 4కు కూడా హోస్ట్ గా వ్యవహరించనున్నారు.
హోస్ట్ నాగార్జున విషయంలో నిర్వాహకులు మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మేకప్ మ్యాన్ మినహా సీజన్ లో పాల్గొనే వాళ్లు, సాంకేతిక సిబ్బంది ఆయనను ప్రత్యేకంగా కలవరు. నిర్వాహకులు ప్రత్యేకంగా ఆరోగ్య బృందాలను నియమించి నిరంతరం వాళ్లు సెట్స్ లో ఉండి పర్యవేక్షించే ఏర్పట్లు చేస్తున్నట్టు తెలుస్తోంది. అయితే సీజన్ 4 ఎన్ని రోజులు ఉంటుంది....? ఈసారి షోకు ఎంపికయ్యే సెలబ్రిటీలు ఎవరు...? అనే విషయాలు తెలియాలంటే మాత్రం కొన్ని రోజులు ఆగాల్సిందే.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి