కరోనా మహమ్మారి కారణంగా సినిమా ప్రేక్షకులకు థియేటర్లు లేకుండా పోయాయి. అయినప్పటికి ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లు అందుబాటులో ఉండటంతో ప్రేక్షకులు థియేటర్లు లేవనే ఫీలింగ్‌లో లేకుండా ఉండగలిగారు. తెలుగు ప్రేక్షకుల విషయానికి వస్తే ఏ ఇద్దరు కలిసినా వారిద్దరూ ఏదో ఒక చిత్రం గురించి తప్పక మాట్లాడుకుంటారు. ఏ రెండు కుటుంబాలు కలిసినా సరే వారి మధ్య సినిమా టాపిక్ అయితే కచ్చితంగా వస్తుంది. అంతలా సినిమా అనేది తెలుగు ప్రజల కుటుంబాల్లో భాగమై పోయింది. ఇక లాక్ డౌన్ కారణంగా ఓటీటీ ప్లాట్ ఫామ్‌ల క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. అమెజాన్ ప్రైమ్, నెట్ ఫ్లిక్స్ వంటి ఓటీటీ ప్లాట్ ఫామ్‌లకు ప్రేక్షకులు బాగా అలవాటు పడిపోయారు.

అయితే ఆ ఓటీటీల్లో తెలుగు కంటెంట్ లేకపోవడం తెలుగు ప్రేక్షకుల్లో కొంత నిరాశ మిగిలింది. ఈ లోటును తీర్చేందుకు అల్లు అరవింద్ కరోనా మహమ్మారి రాక ముందే ఆహా అనే ఓటీటీ ప్లాట్ ఫామ్‌ను మొదలుపెట్టారు. అమెజాన్ ప్రైమ్, నెట్ ఫ్లిక్స్ వంటి అంతర్జాతీయ ప్లాట్ ఫామ్‌లతో పోటీ పడకపోయినా తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో మాత్రం ఆహా సక్సెస్ అవుతున్నట్టు కనిపిస్తోంది. ఆహా చూస్తే.. అందులో ఉన్న కంటెంట్ మొత్తం తెలుగు రాష్ట్రాల్లోని ప్రాంతాలకు చెందినదే ఉంటుంది. దీంతో తెలుగు ప్రేక్షకులు దీనికి వెంటనే కనెక్ట్ అయిపోతున్నారు.

ఇక ఓటీటీలో వెబ్ సిరీస్‌తో పాటు అల్లు అరవింద్ అమెజాన్ ప్రైమ్, నెట్ ఫ్లిక్స్‌లకు షాకిచ్చేలా ఇకపై భారీ చిత్రాలను కూడా కొనుగోలు చేయాలని డిసైడ్ అయ్యారట. ఇప్పటికే రవితేజ నటించిన క్రాక్ చిత్రాన్ని ఆహా ప్లాట్ ఫామ్ కొనేసింది. అంతేకాకుండా నాగ చైతన్య, శేఖర్ కమ్ముల కాంబినేషన్‌లో వస్తున్న లవ్ స్టోరీ ఓటీటీ రైట్స్ కూడా ఆహాకే దక్కాయి. ఈ విధంగా రానున్న రోజుల్లో స్టార్ హీరోల చిత్రాలు కూడా ఆహాలోనే ప్లే అయ్యేలా అల్లు అరవింద్ ప్రణాళికలు రూపొందిస్తున్నారు. మరి ఆయన బడా ప్లాట్ ఫామ్‌లుగా ఉన్న అమెజాన్ ప్రైమ్, నెట్ ఫ్లిక్స్‌కు ఏ విధమైన పోటీ ఇస్తారో ముందు ముందు చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: