ప్రిన్స్ మహేష్ బాబును టార్గెట్ చేస్తూ దర్శకుడు తేజా చేసిన వివాదాస్పద వ్యాఖ్యలతో టాలీవుడ్ వేడెక్కిపోతోంది. తేజ చేసిన వ్యాఖ్యలకు మహేష్ అభిమానులే కాకుండా మహేష్ కూడ షాక్ అయినట్లు వార్తలు వస్తున్నాయి. రేపు విడుదల కాబోతున్న ‘హోరాహోరి’ సినిమాను ప్రమోట్ చేస్తూ తేజా ఈ వివాదాస్పద వ్యాఖ్యలు చేసాడు అన్న వార్తలు వినిపిస్తున్నాయి. 

ఈమధ్య టాలీవుడ్ స్టార్స్ గ్రామాలను దత్తత తీసుకునే కల్చర్ ను బాగా అనుసరిస్తున్నారు కదా? అని ఒక మీడియా ప్రతినిధి అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ ప్రస్తుతం టాలీవుడ్ స్టార్స్ అనుసరిస్తున్న ఈ పద్ధతి సమాజ సేవకోసం కాదనీ వారు పెద్ద మొత్తాలలో కట్టవలసిన ఆదాయపు పన్ను మినహాయింపు కోసం ఇటువంటి పనులు చేస్తున్నారని వ్యాఖ్యానిస్తూ డైరెక్ట్ గా మహేష్ పేరును ఉదహరిస్తూ మరో సంచలన వ్యాఖ్య చేసాడు తేజ. 

మహేష్ నిజంగా గ్రామాలను అభివృద్ధి చేయాలని అనుకుంటే అతడు నటించిన ‘శ్రీమంతుడు' ఘన విజయం వరకు ఆగనక్కరలేదని ఎన్నో సంవత్సరాల క్రితం సూపర్ హిట్ అయిన ‘ఒక్కడు’ సినిమా తరువాత ఈ పనిచేసి ఉంటే బాగుండేది కదా అంటూ మహేష్ పై సెటైర్లు వేసాడు తేజ. మహేష్ తో ‘నిజం’ లాంటి సంచలనాత్మక సినిమాను తీసి నటుడిగా నందీ అవార్డును తెప్పించిన తేజా ఇలా కామెంట్ చేయడం ఇప్పుడు అందర్నీ ఆశ్చర్య పరుస్తోంది. 

అయితే ఈ కామెంట్స్ విన్న చాలామంది ఇటువంటి వ్యాఖ్యలు తేజ మహేష్ పై చేయడం వెనుక ప్రస్తుతం అతడిని కెరియర్ కు సంబంధించి పీడిస్తున్న సినిమాల వరస పరాజయాలు ఇలా మాట్లాడించి ఉంటాయని అంటున్నారు. అంతేకాదు ‘ఒక్కడు’ సినిమా విడుదల అయిన సమయంలో మోడీ లేడు, తెలంగాణ గ్రామజ్యోతి లేదు, ఆంధ్రప్రదేశ్ లో గ్రామాల దత్తత స్కీము లేదు అన్న విషయాలు క్రియేటివ్ దర్శకుడు తేజాకు తెలియదా ? అంటూ చాలామంది కామెంట్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఏమైనా రేపటి తన సినిమా ‘హోరాహోరి’ విడుదలకు ముందు ఇలాంటి వివాదాలలో ఎందుకు తేజ చిక్కుకుంటున్నాడో అర్ధం కావడం లేదు..  


మరింత సమాచారం తెలుసుకోండి: