ప్రముఖ తమిళ నటుడు పొన్నాంబళం మన తెలుగు ఆడియన్స్ కి కూడా ఎంతో సుపరిచితం అనే చెప్పాలి. అప్పట్లో పలువురు తమిళ నటుల సినిమాల్లో విలన్ గా పలు పాత్రలు చేసి ఆడియన్స్ నుండి మంచి పేరు దక్కించుకున్న పొన్నాంబళం, మన తెలుగులో అప్పట్లో చాలామంది స్టార్ హీరోలతో కలిసి నటించారు. ముఖ్యంగా బాలయ్య, చిరంజీవి, వెంకటేష్, నాగార్జున వంటి వారితో చాలా సినిమాలు చేసిన పొన్నాంబళం, ఆ తరువాత మహేష్ హీరోగా తెరకెక్కిన వంశీ మూవీలో కూడా ఒక చిన్న పాత్ర చేసారు.

అయితే ఆర్ధికంగా కూడా కొంత ఇబ్బందులు పడ్డ పొన్నాంబళం, ఇటీవల కొన్నాళ్లుగా కిడ్నీల వ్యాధితో ఎంతో సతమతం అవుతున్నారు. ఇటీవల చెన్నై లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో కిడ్నీల మార్పిడికి చికిత్స తీసుకుంటున్నారు. కాగా డబ్బు కోసం ఆయన ఎంతో ఇబ్బంది పడడంతో కొందరు తమిళ నటులు ఆయనకు సహాయం చేసారు. కాగా పొన్నాంబళం ఆరోగ్య పరిస్థితి తెలుసుకుని ఎంతో మధనపడ్డ మెగాస్టార్ తనవంతుగా నిన్న రెండు లక్షల రూపాయలు ఆర్ధిక సహాయాన్ని అందించడం జరిగింది. ఈ విషయాన్ని కొద్దిసేపటి క్రితం పొన్నాంబళం స్వయంగా ఒక వీడియో బైట్ ద్వారా తెలియచేసారు.

మొదటి నుండి తన తోటి నటుల్లో ఎవరికి ఎటువంటి సమస్య వచ్చినా మంచి మనసుతో ముందుకు వచ్చి వారికి తనవంతుగా తోడ్పాటునందించే మెగాస్టార్ చిరంజీవి అన్నయ్య నేడు తనకు ఈ సాయం చేయడం నిజంగా తాను ఇప్పటికే మరిచిపోలేనని, తనకు సాయం చేసిన అన్నయ్య మెగాస్టార్ కి ప్రత్యేకంగా ఫోన్ చేసి కృతజ్ఞతలు చెప్పాను అని అన్నారు పొన్నాంబళం. కాగా ప్రస్తుతం పొన్నాంబళం ఆరోగ్యం మెల్లగా కుదుటపడుతోందని, త్వరలోనే ఆయన పూర్తిగా కోలుకుంటారని ఆసుపత్రి వర్గాలు చెప్తున్నట్లు తెలుస్తోంది. ఆంజనేయ స్వామి ఆశీస్సులు అన్నయ్య చిరంజీవి పై ఎల్లప్పుడూ ఉండాలని కోరుతూ పొన్నాంబళం పోస్ట్ చేసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎంతో వైరల్ అవుతోంది..... !!

 

మరింత సమాచారం తెలుసుకోండి: