ఒక చిత్రం బ్లాక్ బాస్టర్ హిట్ కావాలంటే.. మంచి కథతో పాటు కథకు తగ్గ సంగీతం కూడా అంతే స్థాయిలో అవసరం అని చెప్పుకోవచ్చు. సినిమా కథ ఎంత బాగున్నా సరైన సంగీతం లేకపోతే ఏదో వెలితిగా అనిపిస్తుంది. ఒక సన్నివేశాన్ని బాగా ఎలివేట్ చేయాలంటే మంచి సంగీతం అవసరం. అయితే అతడు సినిమాలోని సన్నివేశాలు ఎలివేట్ చేయడంలో మెలోడీ బ్రహ్మ మణిశర్మ సక్సెస్ అయ్యారని చెప్పుకోవచ్చు. ఆయన కారణంగానే "అతడు" సినిమా పాటలు ఎవర్ గ్రీన్ హిట్స్ అయ్యాయి. ఈ సినిమా సంగీతం ఎంత బాగుందో తెలుసుకోవాలంటే "అతడు" టైటిల్ సాంగ్ "అధరక బధులే" వింటే సరిపోతుంది. ఈ పాటకు వేమూరి విశ్వేశ్వర రావు "విశ్వ" సాహిత్యం అందించడమే కాదు ఆలపించారు కూడా.


ఇక మిగతా ఐదు పాటలన్నిటికీ సిరివెన్నెల సీతారామశాస్త్రి సాహిత్యం అందించారు. శ్రేయా ఘోషాల్ చాలా మధురంగా పాడిన "పిల్ల గాలి అల్లరి" పాటను మణిశర్మ ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోయేలా కంపోజ్ చేశారు. వర్షం ప్రారంభంకాగానే త్రిష తడుస్తూ నాట్యం చేస్తుంటే.. దానికి తగ్గ రమణీయమైన సంగీతం అందించారు. శ్రేయ ఘోషాల్ గానామృతానికి ఆయన చక్కటి సంగీతం అందించి "పిల్ల గాలి అల్లరి" పాటను సూపర్ హిట్ చేశారు. సునీత ఉపద్రష్ట, కె. కె ( కృష్ణ కుమార్ కున్నాథ్) పాడిన "అవును నిజం" పాట అద్వితీయమైన రాగాలతో ప్రారంభమవుతుంది. తర్వాత కూడా చాలా ప్రత్యేకమైన సంగీత స్వరాలతో అబ్బురపరుస్తుంది.



ఇక ఆయన స్వరపరిచిన "చందమామా.. చందమామా" పాట కూడా బాగా ఆకట్టుకుంది. చిత్ర, బాలసుబ్రహ్మణ్యం పాడిన "నీతో చెప్పనా" ఎవర్ గ్రీన్ హిట్ లిస్టులో చేరిపోయింది. ఇక కవితా కృష్ణమూర్తి, కార్తీక్ పాడిన "పిలిచినా రానంటావా" పాట మిగతా అన్ని పాటల కంటే ఉత్తమ పాట గా నిలిచింది. యూట్యూబ్ లో ఈ పాటకు దాదాపు కోటి వ్యూస్ వచ్చాయి. ఈ పాటలోని సంగీతం కూడా ప్రేక్షకుల మనసులను పులకరింప జేసేలా ఉంటుంది.



ఇక మణి శర్మ ఈ యాక్షన్ సినిమాలోని ప్రతి సన్నివేశాన్ని తన అద్భుతమైన సంగీతం తో ఎలివేట్ చేశారు. సినిమా మొత్తంలో ఆయన 36 డిఫరెంట్ బ్యాగ్రౌండ్ స్కోర్ అందించి వావ్ అనిపించారు. నంద(హీరో) మొదటి హత్య, పోలీస్ స్టేషన్ నుంచి తప్పించుకోవడం, పార్థు/నంద(మహేష్) డబ్బులు దొంగలించడం, పూరీ(త్రిష) ఇంట్రడక్షన్, నందు పార్థు గా మారి పూరీ ఇంటికి రావడం, పార్థు తాత తో మాట్లాడటం, పార్థు పూజారి ఇంట్లో లక్షల రూపాయలు వదిలేయటం వంటి ఎన్నో సన్నివేశాలకు పర్ఫెక్ట్ మ్యూజిక్ అందించి ప్రేక్షకులకు బ్రహ్మాండమైన అనుభూతిని కలిగించారు. అతడు సినిమా సూపర్ హిట్ కావడానికి మణిశర్మ సంగీతం కూడా కారణమని చెప్పుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: