తెలుగు చలనచిత్ర సీమలో పోలీస్ ఆధారిత కథలంటే ప్రత్యేక ఆసక్తి ఉంటుంది. అలాగని ఏ కథ పడితే ఆకథ హిట్ అవ్వదు. అదే తరహాలో భారీ తారాగణంతో వచ్చినప్పటికీ పర్వాలేదు అనిపించుకున్న సినిమా ఎస్‌పీ పరశురాం. ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా చేయగా అతిలోక సుందరి శ్రీదేవి హీరోయిన్‌గా నటించారు. ఈ సినిమాను రవిరాజా పినిశెట్టి దర్శకత్వంలో అల్లు అరవింద్, జీకే రెడ్డి, ముఖేష్ ఉదేషి సంయుక్తంగా నిర్మించారు. 1994లో వచ్చిన ఈసినిమాలో చిరంజీవి చాలా గ్లామర్‌గా కనిపించాడు. ఇందులో శ్రీదేవి నటన కూడా ఎంతో అద్భుతంగా ఉంటుంది. కానీ సినిమా పర్వాలేదు అనిపించుకోవడం మూవీ టీమ్‌ని షాక్‌కి గురిచేసింది.
ఈ సినిమాలో విధినిర్వహణ పరంగా ఎంతో కఠినంగా ఉండే పోలీస్ అధికారి పరశురాం పాత్రలో చిరంజీవి కనిపించగా ఓ చిన్న దొంగ పాత్రలో శ్రీదేవి ఆకట్టుకున్నారు. ఈ సినిమాలో నీలి చిత్రాల కేసును పరశురాం దర్యాప్తు చేస్తుంటాడు. అందులో తన తమ్ముడు కూడా ఉన్నాడని తెలిసిన పరశురాం తన తమ్ముడిని సైతం అరెస్టు చేసేందుకు వెనుకాడడు. అందులో రాణి పాత్రలో శ్రీదేవి నటించారు. ఈ పాత్ర కూడా ఈ కేసులో ఇరుక్కుంటుంది. ఆ తరువాత రాణి సాక్షిగా ఉండేందుకు ఒప్పుకుంటుంది. దాంతో ఆమెపై కొందరు దుండగులు దాడి చేస్తారు. అదే సమయంలో రాణి పాత్ర కళ్లు పోగొట్టుకుంటుంది. ఆ తరువాత పరశురాం ఆమెను వివాహమాడతాడు. విలన్స్ మాత్రం పరశురాం కుటుంబాన్ని నాశనం చేయాలని ప్రయత్నిస్తుంటారు. వారి నుంచి తన కుటుంబాన్ని ఎలా కాపాడుకున్నాడు, నేరస్థులను ఎలా పట్టుకున్నాడన్నదే మిగతా కథ.


అయితే ఈ సినిమా అంతా కూడా చాలా అద్భుతంగా వచ్చింది. కానీ ఈ సినిమా పర్వాలేదు అన్న టాక్ అందుకోవడానికి కొన్ని కారణాలను పరుచూరి గోపాలకృష్ణ తెలిపారు. ఈ సినిమాలో శ్రీదేవి కళ్ళు పోయినట్లు చూపించడం, శ్రీదేవి ఒక పిల్లాడి తల్లి పాత్రలో కనిపించడం అనేవి ప్రేక్షకులు జీర్ణించుకోలేక పోయారు. ఆమె ఎప్పటికీ వారికి అతిలోక సుందరి, కలల రాకుమారి అటువంటి శ్రీదేవికి కళ్లు పోయినట్లు, తల్లి పాత్రలో చూపించడం ఈ సినిమాపై భారీ ప్రభావం చూపాయని ఆయన చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి: