ప్రతిభగల దర్శకురాలు సుధా కొంగర దర్శకత్వం వహించిన స్పోర్ట్స్ డ్రామా "గురు" సినిమాలోని టైటిల్ రోల్ లో వెంకటేష్ నటించారు. ప్రధాన పాత్రలో రితికా సింగ్ అద్భుతంగా నటించి అందరి మన్ననలను పొందారు. ఈ చిత్రంలో వెంకటేష్ ఒక సూపర్ టాలెంటెడ్ బాక్సర్ కాగా.. క్రీడారంగంలోని రాజకీయాల వల్ల ఆయన ఇంటర్నేషనల్ స్థాయి పోటీలలో పాల్గొనే అవకాశం కోల్పోతారు. చాలా సంవత్సరాల తర్వాత ఆయన ఆడవారికి కోచింగ్ ఇవ్వడం ప్రారంభిస్తారు. అయితే ఆయన తన లాంటి మంచి బాక్సర్ కోసం వెతుకుతుంటారు. తనకున్న అనుభవంతో స్టూడెంట్స్ కి మంచి కోచింగ్ ఇచ్చి ఇంటర్నేషనల్ లెవల్లో గెలిపించాలని తపన పడుతుంటారు.

అప్పుడే ఆయనకు ఒక కూరగాయలు అమ్మే రామేశ్వరి అలియాస్ రాములు అనే అమ్మాయి కనిపిస్తుంది. రామేశ్వరి కి బాక్సింగ్ అంటే ఇష్టం లేకపోయినా ఆమెలోని టాలెంట్ ని గుర్తించి తన సొంత ఇంట్రెస్ట్ తో ఆమెకు బాక్సింగ్ నేర్పిస్తారు. మురికి వాడల్లో నివసించే రామేశ్వరి చివరకు "వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్షిప్" లో విజేతగా నిలుస్తుంది. దీంతో సినిమా ముగుస్తుంది. అయితే సినిమా ఆద్యంతం భావోద్వేగంగా కొనసాగుతుంది. ఈ సినిమాలో కామెడీకి కూడా కొదవ ఉండదు. ఒక ఇన్‌స్పిరేషనల్ ఎమోషనల్ స్పోర్ట్స్ డ్రామాకి కమర్షియల్ ఎలిమెంట్స్ జోడించి అన్ని వర్గాల సినీ ప్రేక్షకులను అలరించిన సుధా కొంగర కి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే.

ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా సరే ఓటమిని అంగీకరించకు అనే థీమ్ తో రూపొందిన ఈ చిత్రం ప్రతి ఒక్కరిలో ఎంతో స్ఫూర్తిని నింపింది. సినిమా క్లైమాక్స్ లో రాములు గెలిచినప్పుడు సాగే సన్నివేశాలు అందరినీ కంటతడి పెట్టిస్తాయి. ఒక మంచి గురువు దగ్గర శిక్షణ పొందితే.. సాధారణ వ్యక్తి కూడా ఉన్నత శిఖరాలకు ఎదుగుతారని "గురు" చిత్రం చాలా చక్కగా చూపించింది. జీవితంలో ఓడిపోయి నిరాశ, నిస్పృహల మధ్య కృంగిపోతున్న వారు గురు సినిమా చూస్తే ఖచ్చితంగా మోటివేషన్ లభిస్తుంది. దర్శకురాలు సుధా కొంగర ఏమాత్రం బోర్ కొట్టించకుండా సినిమాని రూపొందించారు కాబట్టి నిరాశ, నిరుత్సాహంతో బాధపడుతున్నప్పుడు గురు చిత్రాన్ని ఎన్నిసార్లైనా చూసి మోటివేట్ అవ్వచ్చు.

ఈ సినిమాలో సందర్భానుసారం స్వరపరిచిన పాటలు కూడా సూపర్ గా ఉన్నాయి. సంతోష్ నారాయణ్ అందించిన సంగీతం ఈ సినిమాకి మరింత బలాన్ని చేకూర్చింది నిస్సందేహంగా చెప్పుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: