గచ్చిబౌలిలోని రాడిసన్‌ హోటల్‌లో శనివారం నాడు రాత్రి జరిగిన డ్రగ్‌ పార్టీలో ప్రముఖ సినీ దర్శకుడు క్రిష్‌ కూడా పాల్గొన్నట్లు మాదాపూర్‌ డీసీపీ వినీత్‌ కుమార్‌ తెలిపారు. అయితే కొకైన్‌ వాడారా? లేదా? అనేది ఇంకా తెలియాల్సి ఉందన్నారు. ఈ పార్టీ కోసం డ్రగ్‌ సరఫరా చేసిన (పెడ్లర్‌) సయ్యద్‌ అబ్బాస్‌ అలీ జెఫ్రీని కూడా అరెస్టు చేశామని చెప్పారు. రాడిసన్‌ హోటల్‌లో గజ్జల వివేకానంద్‌కు 10 సార్లు మాదకద్రవ్యాలు సప్లయ్‌ చేసినట్లుగా అబ్బాస్‌ తన వాంగ్మూలంలో పేర్కొన్నాడని ఆయన వివరించారు. ఇక చాలాసార్లు డ్రగ్‌ పార్టీలు చేసుకున్నట్లు చెప్పాడని మంగళవారం నాడు విలేకరులతో మాట్లాడుతూ డీసీపీ తెలిపారు.డైరెక్టర్ క్రిష్‌ రెండు రోజుల్లో విచారణకు వస్తారని, ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహిస్తామని డీసీపీ చెప్పారు. వివేకానంద్‌ను కలిసేందుకు మాత్రమే వచ్చినట్లు క్రిష్‌ చెబుతున్నాడని, వైద్య పరీక్షలు చేస్తేనే క్లారిటీ వచ్చే అవకాశం ఉందన్నారు. కేదార్, నిర్భయ్‌ అనే కామన్‌ ఫ్రెండ్స్‌ ద్వారా సినిమా వాళ్లు వివేకానంద్‌కు పరిచయమయ్యి ఉండవచ్చని తెలిపారు.ఆయన డ్రగ్‌కు బానిస కావడంతోనే తరచుగా పార్టీలు నిర్వహించి ఉండవచ్చని అన్నారు. ఈ డ్రగ్‌ హైదరాబాద్‌లోనే కొనుగోలు చేసినట్లు అబ్బాస్‌ చెబుతున్నాడని, అయితే ఎక్కడి నుంచి సరఫరా అయ్యిందో విచారణలో తేలుతుందని ఆయన చెప్పారు. కొకైన్‌ సరఫరా చేసిన ప్రతిసారీ రెండు నుంచి నాలుగు గ్రాములు వివేకానంద్‌కు కూడా అందించాడన్నారు. వివేకానంద్‌ ఎంత మొత్తంలో డబ్బులు చెల్లించాడో త్వరలో చెబుతామని ఆయన చెప్పారు.


ఇంకా కేసులో అనుమానితులుగా ఉన్న శ్వేత, సందీప్‌లు పరారీలో ఉండగా బెంగళూరులో ఉన్న చరణ్‌ మాత్రం అక్కడే విచారణకు వస్తున్నట్లు తెలిపారు. డ్రగ్‌ పార్టీ నిర్వహించిన వారితో పాటు హోటల్‌ నిర్వాహకులపై కూడా కేసులు నమోదు చేస్తామని డీసీపీ స్పష్టం చేశారు. ఆ హోటల్‌లో కొన్ని సీసీ కెమెరాలు పని చేయడం లేదని, శనివారం రాత్రి 12.30 గంటలకు వెళ్లే సరికే అందరూ పార్టీ నుంచి వెళ్లిపోవడం జరిగిందని వివరించారు. డ్రగ్‌ పార్టీలకు రెగ్యులర్‌గా ఎవరు వస్తున్నారు, డ్రగ్‌ సప్లయ్‌ చైన్‌ తదితర అంశాలపై విచారణని చేపడతామన్నారు.ఇప్పటికి ఆ పార్టీలో 10 మంది ఉన్నట్లు గుర్తించగా ముగ్గురికి డ్రగ్‌ పాజిటివ్‌గా వచ్చిందని, మిగిలిన వారిని కూడా విచారించి వైద్య పరీక్షలనేవి నిర్వహిస్తామని చెప్పారు. ఇక శ్వేత బెంగళూరు డ్రగ్‌ కేసులో కూడా నిందితురాలిగా ఉందంటూ మీడియా ప్రతినిధులు ప్రస్తావించగా, ఆ వివరాలు సేకరిస్తామని, గతంలో రాడిసన్‌ హోటల్‌ మేనేజర్‌ డ్రగ్‌తో పట్టుబడిన కేసు వివరాలు కూడా సేకరిస్తామని అన్నారు. సయ్యద్‌ అరెస్టుతో రాడిసన్‌ డ్రగ్‌ పార్టీ కేసులో ఇప్పటి దాకా నలుగురిని అరెస్టు చేసినట్లయ్యింది. ఇక ఈ డ్రగ్ కేసులో తెలుగు యూ ట్యూబర్లు లిషి గణేష్, ఖుషిత పేర్లు కూడా నమోదు అయ్యాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: