రవికిషన్‌.. రేసుగుర్రం విలన్‌గా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడు. ఈయన ఎక్కువగా భోజ్‌పురి, హిందీ సినిమాలు చేశాడు. అయితే భోజ్‌పురి అనగానే చాలామంది అశ్లీలతే గుర్తొస్తుంది.అక్కడ సరైన సినిమాలే ఉండవని భావిస్తుంటారు. ఈ పరిస్థితులు మారాల్సిన అవసరం ఉందంటున్నాడు రవికిషన్‌. 'భోజ్‌పురి ఇండస్ట్రీ ముఖచిత్రాన్ని మార్చేందుకు ప్రయత్నించాను. భోజ్‌పురి సినిమాకుగానూ జాతీయ అవార్డు అందుకున్న వ్యక్తిగా ఆ మార్పు కోసం పూనుకున్నాను. కానీ ఇక్కడ రిలీజయ్యే ఆల్బమ్‌ సాంగ్స్‌, ప్రైవేట్‌ సాంగ్స్‌ ఇండస్ట్రీ గౌరవాన్ని దెబ్బతీస్తున్నాయి.నేను రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత దాని గురించి పట్టించుకోలేకపోయాను. ఇప్పుడు భోజ్‌పురిలో మహదేవ్‌ కా గోరఖ్‌పూర్‌ సినిమా చేస్తున్నాను. ఇది పాన్‌ ఇండియా చిత్రంగా రానుంది. ఈ సినిమాతో అందరి ఆలోచనలు మారిపోతాయి. నా జూనియర్లు కూడా కొత్త సినిమాలు తీసేందుకు ముందుకు వస్తారు. చీప్‌ సన్నివేశాలు, అసభ్య డైలాగులు, చెత్త పాటలు లేకుండా మంచి చిత్రాలు చేస్తారు. గత కొన్నేళ్లలో తెలుగు సినిమా ప్రపంచస్థాయిలో గుర్తింపు తెచ్చుకుంది.రాజమౌళి.. ఆర్‌ఆర్‌ఆర్‌, బాహుబలి 1, 2, అలాగే సుకుమార్‌ పుష్ప సినిమాలతో టాలీవుడ్‌ క్రేజ్‌ను ఎంతో ఎత్తుకు తీసుకెళ్లారు. ఈ విషయంలో భోజ్‌పురి ఇండస్ట్రీ రాజమౌళి నుంచి సలహాలు, సూచనలు తీసుకోవాలి. రాజ్‌కుమార్‌ బర్జాత్యా, యష్‌ చోప్రా ఎంతో అందమైన సినిమాలు తీస్తారు. వారి చిత్రాల్లో ఎలాంటి వల్గారిటీ ఉండదు. భోజ్‌పురి సినిమా మొట్టమొదటగా ఆ అసభ్యతను చూపించడం మానేయాలి. రచయితలకు మంచి పారితోషికం ఇవ్వాలి. హీరోలకు ఎక్కువ బడ్జెట్‌ పెట్టి రచయితలకు, టెక్నీషియన్లకు ఏదో మమ అనిపించకూడదు.చీప్‌ సినిమాలు తీస్తున్నారన్న విమర్శలు తెలుగు, మలయాళ ఇండస్ట్రీలో కూడా ఎప్పుడో ఒకసారి వినిపించే ఉంటాయి. కానీ వారు దాన్నుంచి ఎలా బయటపడ్డారు? ఎలా అగ్రగామిగా ఉన్నారనేది మనం నేర్చుకోవాలి. భోజ్‌పురి ఇండస్ట్రీ ముఖకవళికలు మార్చేందుకు ప్రయత్నిస్తున్నాను' అని చెప్పుకొచ్చాడు. రవికిషన్‌ నటించిన మామ్ల లీగల్‌ హై వెబ్‌ సిరీస్‌ మార్చి 1 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారం కానుంది. ఇందులో ఆయన త్యాగి అనే లాయర్‌గా కనిపించనున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: