శ్రీలీల.. తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. వరుస సినిమాలతో తెలుగు ప్రేక్షకులను పలకరిస్తూ బిజీ హీరోయిన్‌ అయిపోయింది. 'శ్రీలీల పక్కన డ్యాన్స్‌ చేయడం అంటే తాట తెగిపోతుంది' ఈ మాటలు అన్నది ఎవరో కాదు.అగ్ర కథానాయకుడు మహేశ్‌బాబు. మూవీ పాటలకు తన డ్యాన్స్‌తో యువత మతి పోగొట్టే ఆమెలో ఓ క్లాసికల్ డ్యాన్సర్‌ కూడా ఉంది. ఇటీవల జరిగిన సమత కుంభ్‌-2024 వేడుకల్లో శ్రీలీల ఇచ్చిన ప్రదర్శన ఆహూతులను అలరించింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్నాయి. 'ఇప్పటివరకూ శ్రీలీలలో ఇంత టాలెంట్‌ ఉందనుకోలేదు', 'కళ్లు చెదిరిపోయాయి వర్మ..' అంటూ ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. గోదాదేవిగా ఆమె అభినయానికి వీక్షకులు ఫిదా అయిపోయారు. అమెరికాలో పుట్టిన శ్రీలీల చిన్నప్పటినుంచే క్లాసికల్‌ డ్యాన్స్‌ నేర్చుకున్న సంగతి తెలిసిందే..తాజా ప్రదర్శన గురించి ఇన్‌స్టా వేదికగా శ్రీలీల పోస్ట్‌ పెట్టింది ''మీకు తెలుసో లేదో చిన్నప్పుడే క్లాసికల్‌ డ్యాన్స్‌తో నా ప్రయాణం మొదలైంది. మా బృందంతో కలిసి ప్రదర్శనలు ఇవ్వడానికి నేను వెళ్తుండేదాన్ని. (ఎక్కువగా ఆలయాల్లోనే) మా బృందాన్ని 'బాల్లెట్స్‌' అని పిలిచేవారు. అప్పటి రోజులు నాకు ఎన్నో విషయాలను నేర్పాయి. అదే సమయంలో ప్రతి క్షణాన్నీ ఆస్వాదించా. నిజం చెప్పాలంటే అదొక హాబీగా మారిపోయింది. ఇన్నేళ్ల తర్వాత మళ్లీ ఇలాంటి ప్రదర్శన చేయడం వైవిధ్యంగా అనిపించినా, ఇప్పటికీ డ్యాన్స్‌ నాలో ఒక భాగమే అనిపిస్తోంది. నాలో మీరు చూస్తున్న మరొక కోణం ఇది. 'అభినయ', 'భావ' ఇలా అన్నీ డ్యాన్సే నాకు నేర్పింది. ఇంతకీ నేను చెప్పేది ఏంటంటే, దాదాపు 10-15ఏళ్ల తర్వాత నేను స్టేజ్‌పై ప్రదర్శన ఇవ్వడం ఇదే తొలిసారి. ప్రాక్టీస్‌ చేయడానికి నా వంతు నేను ప్రయత్నించా. గోదాదేవి అంటే మహిళల్లో రత్నంలాంటిది. ఆమె గాథ ఎంతో అందంగా ఉంటుంది. ఈ ప్రదర్శన ఇవ్వడానికి ప్రోత్సహించిన మంజు భార్గవి గారికి కృతజ్ఞతలు. నాకు ఈ ప్రదర్శన ఎంతో ప్రత్యేకంగా అనిపించింది. స్క్రిప్ట్‌లు చదవడం అంటే నాకు ఎంతో ఇష్టం. మీకు ఏదైనా ఆసక్తిగా అనిపిస్తే నాకు తెలియజేయండి. నాకు అనిపించింది మీతో పంచుకుంటా. ఇప్పటికే చాలా చెప్పేశాను. నా చిన్నప్పుడు ప్రదర్శనలిస్తున్న సమయంలో నా ప్రేక్షకులు కేవలం నా కుటుంబమే. ఇప్పుడు నాకు ఎంతో పెద్ద కుటుంబం (అభిమానులను ఉద్దేశించి) ఉంది'' - ప్రేమతో లీల అని పేర్కొంది. ఇంకెందుకు ఆలస్యం శ్రీలీల ఇచ్చిన నృత్య ప్రదర్శనను మీరూ చూసేయండి.

మరింత సమాచారం తెలుసుకోండి: