రీసెంట్ గా మలయాళంలో విడుదలై ఘన విజయం సాధించి రికార్డుల మీద రికార్డులు తిరగ రాస్తున్న సినిమా మంజుమ్మెల్ బాయ్స్. దాదాపు అంతా కొత్త వారితో రియల్‌గా జరిగిన ఇన్సిడెంట్ అధారంగా తెరకెక్కిన ఈ సినిమా మొదటి రోజు నుంచే బ్లాక్ బస్టర్ టాక్‌తో దూసుకుపోతుంది.కేరళలో సాలిడ్ వసూళ్లను రాబడుతూ మలయాళ ఇండస్ట్రీని షేక్ చేస్తుంది.ఇక ఇదిలా ఉండగా.. ఈ మంజుమ్మెల్ బాయ్స్  సినిమా డైరెక్ట్‌ మలయాళ  వెర్షన్‌ను తమిళనాడులో విడుదల చేయగా అక్కడ కూడా భాషతో సంబంధం లేకుండా ఈ సినిమాని జనం విరగపడి చూడడం గమనార్హం. ఇంకా చెప్పాలంటే కేరళలో కన్నా తమిళనాటే అంతకుమించి అనేలా కలెక్షన్ల సునామీ సృష్టిస్తూ ఈ సినిమా దూసుకెళుతోంది. ఈ రోజుకు కేవలం తమిళనాడులోనే 11 రోజుల్లో దాదాపు 221 థియేటర్లలో హౌజ్‌ఫుల్ గా నడుస్తూ.. ఈ సినిమా రూ.15 కోట్లు వసూళ్లు సాధించిందంటే ఈ సినిమాకు అక్కడి ప్రజలు ఎలా బ్రహ్మరథం పడుతున్నారో తెలిసిపోతుంది.


ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే.. కేరళలో ని మంజుమ్మెల్ ప్రాంతానికి చెందిన గ్రూప్ ఆఫ్ ప్రెండ్స్ దాదాపు ఓ పది మంది టూర్‌కు వెళ్లి తిరిగి వస్తుంటారు. ఈ క్రమంలో కమల్‌హసన్ నటించిన గుణ అనే సినిమా షూటింగ్ జరిగిన ఓ గుహను చూడడం మరిచిపోయామంటూ ఆ గుహ దగ్గరకు వారు వెళతారు. అయితే అప్పుడు అనుకోకుండా ఒకతను ఆ గుహాలో పడి పోతాడు. దీంతో అతనిని బయటకి తీసుకురావడానికి ఆ మిత్ర బృందం చేసిన సాహసం నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించారు.ఇకపోతే ఇప్పుడు ఈ సినిమా తెలుగు డబ్బింగ్ వర్షన్ రిలీజ్‌కు సిద్ధమైంది. మార్చి 15న ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీని అదే పేరుతో తెలుగులో భారీ ఎత్తున విడుదల చేస్తున్నారు. ఈ మేరకు మేకర్స్ అధికారికంగా ఓ ప్రకటన విడుదల చేశారు. అయితే.. ఇప్పటికే మన తెలుగు వాళ్లు కూడా ఈ సినిమాను మలయాళంలో కూడా చూస్తు ప్రశంసలు గుప్పిస్తుండడం విశేషం. కామెడీ, ఎమోషన్‌, సంగీతం, సస్పెన్స్‌, థ్రిల్లింగ్ ఇలా అన్ని రకాల భావోద్వేగాలతో ప్రేక్షకుడిని సీట్ ఎట్జ్‌లో కూర్చోబెట్టేలా రూపొందిన ఈ మూవీకి చిదంబరం దర్శకత్వం వహించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: