బెంగళూరులో నిత్యం ఏదో ఒకచోట రేవ్ పార్టీలు జరుగుతూనే ఉంటాయి. ఈక్రమంలోనే ఆ నగరంలోని ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలో ఉన్న జీఆర్ ఫామ్ హౌస్‌లో జరుగుతున్న రేవ్ పార్టీపై పోలీసులు, యాంటీ నార్కోటిక్స్ విభాగం అధికారులు సంయుక్తంగా దాడి చేశారు.అయితే ఆ రేవ్ పార్టీలో తెలుగు నటి హేమ కూడా పాల్గొన్నట్లు పోలీసులు గుర్తించారు. పార్టీలో పాల్గొన్న యువకులు డ్రగ్స్‌ను వాడుతున్నట్లు గుర్తించారు. ఎండీఎంఏ మాత్రలు, కొకైన్ పెద్దమొత్తంలో లభ్యమయ్యాయి. ఆంధ్రా, బెంగళూరుకు చెందిన 100 మందికి పైగా ఈ పార్టీలో పాల్గొన్నట్లు వెల్లడైంది. వీరిలో 25 మందికి పైగా యువతులే ఉన్నారు.రేవ్ పార్టీలో పాల్గొనాలని ఆహ్వానిస్తే హేమ వెళ్లారా ? డబ్బులు తీసుకుని రేవ్ పార్టీలో పాల్గొన్నారా ? అనే కోణంలో పోలీసులు తనిఖీలు చేస్తున్నారు. హేమతో పాటు ఇంకొందరు కొత్త తెలుగు యాక్టర్లు కూడా ఈ రేవ్ పార్టీలో పాల్గొన్నట్లు తెలుస్తోంది. ఆదివారం అర్థరాత్రి తర్వాత కూడా ఈ పార్టీ కొనసాగిందని విచారణలో తేలింది. ఆదివారం సాయంత్రం 5 గంటల నుంచి సోమవారం ఉదయం 6 గంటల వరకు ఈ రేవ్ పార్టీ నిర్వహించాలని ప్లాన్ చేశారు. అయితే అర్థరాత్రి తర్వాత పోలీసులు రంగ ప్రవేశం చేసి దీన్ని భగ్నం చేశారు. ఇలాంటి రేవ్ పార్టీల కోసం ఒక్కరోజుకు దాదాపు 30 లక్షల నుంచి 50 లక్షల రూపాయల దాకా ఖర్చు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ పార్టీలకు కొంతమంది మోడల్స్, హీరోయిన్లను ఆహ్వానిస్తుంటారు. ఇందుకుగానూ వారికి భారీగా పారితోషికం చెల్లిస్తుంటారు.

రేవ్ పార్టీకి చాలా మంది సెలబ్రిటీలు కూడా హాజరైనట్టు చెప్తున్నారు. టాలీవుడ్‌కి చెందిన కొందరిని పోలీసులు విచారిస్తున్నట్టు సమాచారం. కన్నడ మీడియాలో నటి హేమ పేరు సర్కులేట్ అవుతోంది. దీనిపై క్లారిటీ కోసం టీవీ9 రిపోర్టర్‌ హేమను కాంటాక్ట్ చేశారు. తాను హైదరాబాద్‌లోనే ఉన్నానని హేమ స్పష్టం చేశారు. రేవ్‌ పార్టీలో తాను ఉన్నట్టు కన్నడ ఛానెల్స్‌లో, మీడియాలో వచ్చిన వార్తల్ని ఖండించారు.2022 సంవత్సరం ఏప్రిల్‌లో హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ ర్యాడిసన్ డ్రగ్స్ పార్టీ వ్యవహారం కలకలం రేపింది. అప్పట్లోనూ ఆదివారం అర్ధరాత్రి టైంలోనే పుడింగ్ పబ్‌లో విచ్చల విడిగా డ్రగ్స్‌తో పాటు కొకైన్ తీసుకుంటున్నట్లు పక్కా సమాచారం రావడంతో మఫ్టీలో వెళ్లి టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడి చేశారు. పోలీసుల దాడిలో సుమారు 150 మందిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న టాస్క్‌ఫోర్స్ పోలీసులు బంజారాహిల్స్ పోలీసులకు అప్పగించారు. పట్టుబడిన వారిలో 39 మంది యువతులు ఉన్నారు. వారిలో కొందరు ప్రముఖుల పిల్లలు కూడా ఉన్నారు. పట్టుబడిన వారిలో ప్రముఖ సినీ నటుడి కుమార్తె, ఏపీకి చెందిన ఎంపీ కుమారుడు, మాజీ డీజీపీ కుమార్తె సహా పలువురు ఉన్నారు. కాగా, అప్పట్లో బంజారాహిల్స్ పోలీస్ స్టేష్లన్‌లో సినీ నటి హేమ హల్‌చల్ చేశారు. తనకు సంబంధం లేని డ్రగ్స్ కేసులో తాను ఉన్నట్లు పుకార్లు సృష్టించి, తన ప్రతిష్ట దిగజారేలా మీడియాలో కథనాలు రావడంతో ఆమె చిందులు వేశారు. నేను పబ్‌లో లేకపోయినా.. నా పేరు ఎందుకు బయటకు తెచ్చారంటూ సూటిగా నిలదీశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: