
చాలా కాలం తర్వాత మలయాళంలో 'జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ' అనే చిత్రంతో రీఎంట్రీ ఇస్తోంది అనుపమ. ఈ సినిమా ఆడియో వేడుకలో ఆమె మాట్లాడుతూ తీవ్ర భావోద్వేగానికి గురైంది. "మలయాళంలో చాలామంది నన్ను పక్కనపెట్టేశారు. నీకు నటించడం చేతకాదు అంటూ హేళన చేశారు. సోషల్ మీడియాలో కావాలనే నన్ను టార్గెట్ చేసి ఏడిపించారు. అయినా వాటన్నింటినీ పక్కనపెట్టి, ఈ చిత్ర దర్శకుడు ప్రవీణ్ నారాయణన్ నాపై నమ్మకం ఉంచి ఇంత పెద్ద బాధ్యత అప్పగించారు" అంటూ అనుపమ తన గుండెలోని భారాన్ని దించుకుంది.
అనుపమ మాటలకు, ఆమె కళ్లలో నీళ్లకు చలించిపోయిన ఆ చిత్ర హీరో, స్టార్ నటుడు సురేష్ గోపి ఒక్కసారిగా మైక్ అందుకున్నారు. అనుపమకు అండగా నిలుస్తూ, ఆమెను విమర్శించిన వారికి దిమ్మతిరిగేలా సమాధానమిచ్చారు. "ఒకప్పుడు సిమ్రాన్, నయనతార, అసిన్ లాంటి హీరోయిన్లను కూడా ఇక్కడి వాళ్లు మొదట్లో పట్టించుకోలేదు. వాళ్లు తర్వాత ఏ స్థాయికి వెళ్లారో అందరికీ తెలుసు. అనుపమ కూడా వాళ్లలాగే ఓ పెద్ద స్టార్ అవుతుంది, ఈ మాట రాసిపెట్టుకోండి" అని బల్లగుద్ది మరీ చెప్పారు.
అంతటితో ఆగకుండా, సురేష్ గోపి మరింత ఘాటుగా స్పందించారు. "ఈ రోజు అనుపమను వద్దనుకున్న మలయాళ దర్శకులంతా, రేపు ఆమె డేట్స్ కోసం వెంటపడతారు. ఆమె ఇంటి ముందు క్యూ కడతారు. ఆ రోజు ఎంతో దూరంలో లేదు" అంటూ సవాల్ విసిరారు. ఒక సీనియర్ నటుడు, ఎంపీ హోదాలో ఉన్న వ్యక్తి ఒక యంగ్ హీరోయిన్ కు ఇంత బలంగా మద్దతు ఇవ్వడం అందరినీ ఆశ్చర్యపరిచింది.
తెలుగు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్న ఒక హీరోయిన్ పై, సొంత ఇండస్ట్రీలోనే ఇలాంటి వివక్ష జరగడం నిజంగా బాధాకరం. అయితే సురేష్ గోపి లాంటి పెద్ద మనిషి మద్దతుతో అనుపమ ఇప్పుడు రెట్టించిన ఉత్సాహంతో తిరిగి తన సత్తా చాటడానికి సిద్ధమైంది. తనను వద్దన్న వాళ్లే తన కోసం వెంటపడేలా చేయాలన్న కసి ఆమెలో కనిపిస్తోంది.