నాగార్జున, ధనుష్ కాంబినేషన్లో వరుస విజయాల రష్మిక హీరోయిన్ గా శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో తెరకెక్కిన కుబేర సినిమా ఏకంగా 150 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో తెరకెక్కగా ఈ సినిమా నేడు థియేటర్లలో విడుదలైంది. 3 గంటల 2 నిమిషాల నిడివితో విడుదలైన ఈ సినిమాకు అడ్వాన్స్ బుకింగ్స్ సైతం భారీ స్థాయిలో ఉన్నాయి. ఫిదా, లవ్ స్టోరీ సినిమాలతో మ్యాజిక్ చేసిన శేఖర్ కమ్ముల ఈ సినిమాతో అంతకు మించిన మ్యాజిక్ చేశారు.

కథ:

అత్యంత ధనవంతుడికి,   ఏమీ లేని పేదవాడికి మధ్య జరిగే పోరాటమే కుబేర  కథాంశం.  వేర్వేరు వ్యాపారాల ద్వారా వేల  కోట్ల రూపాయలు సంపాదించిన  బిజినెస్ మెన్ (జిమ్షర్బ్)  తన సంపద మరింత పెరగాలనే ఆలోచనతో  దీపక్  (నాగార్జున)  సహాయంతో ఒక కుట్ర చేస్తాడు.  సీబీఐ ఆఫీసర్ గా పని చేస్తున్న  దీపక్ ఒక లక్ష్యం కొరకు కొంతమంది  బిచ్చగాళ్లను రిక్రూట్ చేసుకోగా వాళ్లలో దేవా (ధనుష్) కూడా ఒకరు.   అయితే దేవా  చేసిన ఒక పని వాళ్ళ దీపక్ కు  సమస్యలు ఎదురవుతాయి.  దేవా దీపక్ కు ఎలాంటి గుణపాఠం నేర్పాడు? ఒక స్కాండల్ లో భాగమైన దీపక్  బిచ్చగాళ్లను రిక్రూట్ చేసుకోవడం వెనుక కారణాలేంటి?  చివరకు కథ ఎలాంటి మలుపులు తిరిగింది అనే ప్రశ్నలకు సమాధానమే కుబేర.

విశ్లేషణ :

నాగార్జున, ధనుష్ లకు కుబేర సినిమాలో అభినయానికి ప్రాధాన్యత ఉన్న పాత్రలు దక్కాయి.  అయితే ఆ పాత్రలకు న్యాయం చేసే విషయంలో ఒకరితో ఒకరు పోటీ  పడ్డారనే చెప్పాలి.  ధనుష్ బిచ్చగాడి పాత్రలో నటించారు అని చెప్పే కంటే  జీవించారని చెప్పవచ్చు.  ఈ పాత్రలో ధనుష్ నటించకుండా మరో హీరో నటించి ఉంటే  ఈ స్థాయిలో పాత్రకు న్యాయం చేసేవారు కాదు.  ఈ సినిమా కోసం ధనుష్ చాలా కష్టపడ్డారు. తన కెరీర్ లో దేవా పాత్ర మెమరబుల్ పాత్రగా మిగిలిపోయేలా నటించారు.నాగార్జున సిబిఐ ఆఫీసర్ పాత్రలో అదరగొట్టారు.

ఈ మధ్య కాలంలో నాగ్ నటించిన బెస్ట్ సినిమాల్లో కుబేర ఒకటని చెప్పడంలో సందేహం అక్కర్లేదు.  రష్మిక పాత్ర సెకండాఫ్ లో ఉండగా ఆమె తన పాత్రకు న్యాయం చేశారు.  లక్ష కోట్ల రూపాయల స్కామ్  కథాంశంతో ఈ సినిమా తెరకెక్కగా ఆ సీన్లను పర్ఫెక్ట్ గా షూట్ చేసే విషయంలో శేఖర్ కమ్ముల సక్సెస్  అయ్యారు. గత సినిమాలకు  భిన్నమైన కథాంశాన్ని ఎంచుకున్న  శేఖర్ కమ్ముల సినిమాలో అద్భుతమైన సందేశం ఉండేలా జాగ్రత్త పడ్డారు. ఈ సినిమా దర్శకుడిగా శేఖర్ కమ్ముల స్థాయిని మరింత పెంచిందని చెప్పవచ్చు.

ఈ సినిమాలో సాంగ్స్, బీజీఎమ్ అదిరిపోయాయి. శేఖర్ కమ్ముల  సినిమాకు ఎలాంటి మ్యూజిక్ కావాలో దేవిశ్రీ ప్రసాద్  అలాంటి మ్యూజిక్ అందించారు.  కుబేర టైటిల్ కు న్యాయం జరిగేలా ఈ సినిమా ఉంది.  ప్రేక్షకులు  కోరుకున్న అన్ని అంశాలు సినిమాలో ఉన్నాయి.  భారీ అంచనాలతో వెళ్లినా ఈ సినిమా ప్రేక్షకులను నిరాశ పరచదు.  తక్కువ పాత్రలతోనే శేఖర్ కమ్ముల అద్భుతమైన ఔట్ ఫుట్ ను రాబట్టారు.

టెక్నీకల్ అంశాల విషయానికి వస్తే సన్నివేశాలకు అనుగుణంగా మ్యూజిక్,  బీజీఎమ్  అందించి కుబేర సినిమాను ఎన్నో మెట్లు పైకి ఎక్కించే విషయంలో ఈ సినిమా స్థాయి పెంచే విషయంలో  దేవిశ్రీ ప్రసాద్ సక్సెస్ అయ్యారు.  నికేత్  బొమ్మి సినిమాటోగ్రఫీ బాగుంది.  సినిమాలో కొన్ని విజువల్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ లో  ఉన్నాయి.   ఎడిటింగ్ విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకుని ఉంటే  ఈ సినిమా స్థాయి పెరిగేది.  ఎమోషనల్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది చెప్పడంలో సందేహం అక్కర్లేదు.

బలాలు :  ధనుష్, నాగార్జున నటన, శేఖర్ కమ్ముల డైరెక్షన్, మ్యూజిక్, ఎమోషనల్ సీన్స్, కథనం, ఇంటర్వెల్, క్లైమాక్స్

బలహీనతలు : కొన్ని సన్నివేశాల్లో ల్యాగ్,   మూడు  గంటల రన్  టైం

రేటింగ్ :  3.5/5.0


మరింత సమాచారం తెలుసుకోండి: