గత మూడు రోజులుగా ఇండస్ట్రీ వర్గాలలో మారుమ్రోగిపోతున్న పేరు శేఖర్ కమ్ముల. గత కొన్ని నెలలుగా ధియేటర్లకు రావడం మానేసిన ప్రేక్షకులను క్యూ కట్టి తిరిగి ధియేటర్లకు వచ్చేలా ‘కుబేర’ తో రప్పించిన ఈ దర్శకుడి క్రేజ్ ఇండస్ట్రీలో తారా స్థాయిలో కొనసాగుతోంది.


ఇలాంటి బ్లాక్ బష్టర్ హిట్ మరొక దర్శకుడికి వచ్చి ఉంటే ఈపాటికి రెండు మూడు కొత్త సినిమాలు ఒప్పుకుని అడ్వాన్స్ లు తీసుకుంటాడు. అయితే ఈదర్శకుడు తీరు వేరు. ఒక సినిమా తీయడానికి కనీసం రెండు సంవత్సరాలు తీసుకుంటాడు. దీనితో ఈ దర్శకుడి నుంచి మరొక సినిమా రావడానికి ఎన్ని సంవత్సరాలు పడతాయి అన్నది ఆయనకే తెలియాలి. ‘కుబేర’ సక్సస్ మీట్ కు ముఖ్య అతిధిగా వచ్చిన చిరంజీవి శేఖర్ కమ్ముల గురించి ఒక ఆశక్తికర విషయం తెలియచేశాడు.


1988 ప్రాంతంలో హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్ ప్రాంతంలో చిరంజీవి అప్పట్లో నటించిన ‘స్టేట్ రౌడీ’ షూటింగ్ జరుగుతున్నప్పుడు వేలాదిగా జనం రావడంతో షూటింగ్ చేయడం సమస్యగా మారిందట. ఆజనం మధ్య పొడుగ్గా కనిపించిన శేఖర్ కమ్ములను చిరంజీవి దగ్గరకు పిలిచి ఏమి చేస్తూ ఉంటావు అని అడిగినప్పుడు తాను ఇంజనీరింగ్ చేస్తున్నానని సినిమాలు అంటే తనకు విపరీతమైన ఇష్టం అని అప్పట్లో ఆయన చెప్పిన విషయం తనకు ఇప్పటికీ గుర్తు అంటూ శేఖర్ కమ్ముల పై ప్రశంసలు కురిపించాడు.


అలాంటి వ్యక్తి ఇప్పుడు పాపులర్ డైరెక్టర్ గా మారడమే కాకుండా అతడి సినిమా సక్సస్ మీట్ కు చిరంజీవి అతిధిగా రావడం అనుకోని సంఘటన అనుకోవాలి. ఇదే సక్సస్ మీట్ లో శేఖర్ కమ్ముల తన కోరికను బయట పెట్టాడు. తనకు చిరంజీవితో సినిమా చేయాలని ఉందని చెప్పడం దానికి చిరంజీవి అంగీకరించడం జరిగి పోయాయి. అయితే సెన్సిబుల్ సినిమాలను తీసే శేఖర్ కమ్ముల మాస్ సినిమాలకు చిరునామాగా కొనసాగే చిరంజీవికి తగ్గట్టుగా కథ వ్రాయగలడా అన్నదే సందేహం.

మరింత సమాచారం తెలుసుకోండి: