రెబెల్ స్టార్ ప్రభాస్ నటించిన రాజా సాబ్ ట్రైలర్ కొద్దిసేపటి క్రితమే విడుదలైంది. ప్రభాస్ అభిమానులు ఈ ట్రైలర్ కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారని అందరికీ తెలిసిందే. ఇప్పటికే మేకర్స్ ఈ ట్రైలర్‌ను సెప్టెంబర్ 29 సాయంత్రం 6 గంటలకు రిలీజ్ చేస్తాం అని ప్రకటించగా, చెప్పిన సమయానికే అందించారు. మూడు నిమిషాల 34 సెకన్ల నిడివి ఉన్న ఈ ట్రైలర్ ప్రేక్షకులను ఒక వేరే ప్రపంచంలోకి తీసుకెళ్లింది. డైరెక్టర్ మారుతి తన స్టైల్‌లోనే కామెడీతో పాటు హర్రర్ ఎలిమెంట్స్‌ని జోడించి, ట్రైలర్‌ను ఎంటర్టైనింగ్‌గా తీర్చిదిద్దారు.ప్రభాస్ లుక్‌ ఫ్యాన్స్‌కి బాగా నచ్చింది.

ముఖ్యంగా బాహుబలి, సాహో వంటి సినిమాల్లో సీరియస్ యాంగిల్‌లో కనిపించిన ప్రభాస్, ఈ సారి కామెడీ యాంగిల్‌తో మరోసారి తన వెర్సటైలిటీని ప్రూవ్ చేశాడు. ట్రైలర్ చూసిన అభిమానులు “ఇలాంటివి కూడా ప్రభాస్ నుంచి రావచ్చు” అంటూ ఫుల్ ఫిదా అవుతున్నారు. ఈ ట్రైలర్ చూసిన తరువాత సినిమాపై భారీ అంచనాలు పెరిగిపోయాయి అనడంలో సందేహం లేదు. ట్రైలర్ స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు మారుతి మార్క్ కామెడీకి తోడు హర్రర్ ఎలిమెంట్స్ బాగా పనిచేశాయి. ముఖ్యంగా ప్రభాస్ కోటలోకి ఎంటర్ అయ్యాక భయపడుతూ, అదే సమయంలో భయపెడుతూ కామెడీ పండించడం ప్రేక్షకులని బాగా ఆకట్టుకుంది.

మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రభాస్ కెరీర్‌లో ఒక ప్రత్యేకమైన స్థానం సంపాదించుకునే అవకాశముంది. అయితే, కొంతమంది ఫ్యాన్స్ మాత్రం ప్రభాస్ లుక్స్ విషయంలో కాస్త నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు. ముఖ్యంగా ఆయన బ్లాక్ షర్ట్ వేసుకుని లుంగి కట్టుకుని హీరోయిన్స్‌తో మాట్లాడే సీన్‌లో లుక్ కాస్త వేరేలా కనిపించిందని.. ఎఫెక్ట్స్ వల్లా లేక ఎడిటింగ్ లోపాల వల్లా లుక్ అసలు షాట్స్‌కి మ్యాచ్ కాలేదని చెబుతున్నారు.ఇంకా గతంలో ప్రభాస్ రొమాన్స్ సీన్స్ అంతగా పనిచేయలేదని భావించిన ఫ్యాన్స్, ఈ సినిమా ట్రైలర్‌లో మాత్రం ఆయన రొమాంటిక్ సైడ్ బాగా కనెక్ట్ అయిందని అభిప్రాయపడుతున్నారు. సోషల్ మీడియాలో కొందరు అభిమానులు “ట్రైలర్ మొత్తం బాగానే ఉంది కానీ ఏదో మిస్సింగ్ ఫీలింగ్ ఉంది” అంటూ రియాక్ట్ అవుతుంటే, మరికొందరు “రెబల్ స్టార్ నుంచి ఇలాంటివి చూడాలని చాలా రోజులుగా ఎదురుచూస్తున్నాం” అని కామెంట్స్ చేస్తున్నారు. ఇక రాజా సాబ్ సినిమా జనవరి 9న గ్రాండ్‌గా థియేటర్స్‌లో విడుదల కాబోతుంది.



మరింత సమాచారం తెలుసుకోండి: