అఖండ 2 సినిమా గురించి ఫ్యాన్స్ లో ఉన్న అంచనాలు, ఆసక్తి అంతా ఇంతా కాదు. దర్శకుడు బోయపాటి శ్రీను, కథానాయకుడు బాలకృష్ణ కాంబినేషన్ లో వచ్చిన అఖండ సృష్టించిన ప్రభంజనం అలాంటిది మరి! ఈ ద్వయం మరోసారి కలిస్తే అది బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్గా నిలవడానికి అన్ని అర్హతలు ఉన్న సినిమా అవుతుందని ప్రేక్షకులు, ట్రేడ్ వర్గాలు బలంగా నమ్మారు. ఇటీవలే విడుదలైన ఆంధ్ర కింగ్ తాలూకా సినిమాల్లో కూడా ఫ్యాన్స్ తమ హీరోలను ఎంతగా అభిమానిస్తారో, వారి కోసం ఎంతగా తాపత్రయపడతారో స్పష్టంగా చూపించారు. అయితే, అఖండ 2 విషయంలో జరిగిన కొన్ని పరిణామాలు ఇప్పుడు తీవ్ర చర్చకు దారి తీస్తున్నాయి.
సినిమా విడుదలకు ముందు చిత్ర బృందం కావాలని చేయకపోయినా, చివరి నిమిషంలో జరిగిన గందరగోళం ఫ్యాన్స్ ఎమోషన్స్ తో ఆడుకోవడం కరెక్టేనా అనే ప్రశ్నలు ఇప్పుడు బలంగా తలెత్తుతున్నాయి. నిర్మాణ సంస్థకు ఆర్థికంగా, లేదా ఇతర ఇబ్బందులు ఏమైనా ఉంటే, వాటిని సినిమా విడుదలకు కనీసం రెండు వారాల ముందే పరిష్కరించుకోవాలి. ఒక భారీ బడ్జెట్ సినిమాకు సరైన ప్రణాళిక (ప్లానింగ్) లేకపోతే, అది సినిమాకు ఎంత పెద్ద నష్టమో మేకర్స్ కు తెలియనిది కాదు.
ఈ తరహా ఘటనల వల్ల భవిష్యత్తులో స్టార్ హీరోలు కూడా 14 రీల్స్ బ్యానర్ లో నటించాలంటే ఒకటికి రెండుసార్లు ఆలోచించాల్సిన పరిస్థితి నెలకొంది. నిర్మాతల యొక్క ఈ చెత్త ప్లానింగ్ వల్ల అభిమానులు పడిన బాధ అంతాఇంతా కాదు. ఫ్యాన్స్ బెనిఫిట్ షో కోసం ప్రత్యేకంగా ఎన్నో ఏర్పాట్లు చేసుకుని ఉంటారు. ఎంతో మంది అభిమానుల కలలు, ఆశలు ఈ నిర్ణయం వల్ల ఆవిరయ్యాయి. ఒక్క మాటలో చెప్పాలంటే, అఖండ 2 మేకర్స్ వారిని ఊరించి ఉసూరుమనిపించారు.
సినిమాకు సాంకేతిక సమస్యలు (టెక్నికల్ ఇష్యూస్) ఉన్నందున విడుదల కావడం లేదని మేకర్స్ చెబుతున్నప్పటికీ, ఆ మాటలు మాత్రం నమ్మేలా లేవని అనేక అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఫ్యాన్స్ ను నిరాశపరచడం, వారికి తీవ్ర అసంతృప్తి కలిగించడం ఎంత మాత్రం సమంజసం కాదు. భవిష్యత్తులోనైనా నిర్మాణ సంస్థలు సరైన ప్రణాళికతో ముందుకు వచ్చి, అభిమానుల ఆశలను నిలబెట్టాలని కోరుకుందాం.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి