సినిమాల్లోనే కాదు.. బయట కూడా ఆయనే బాస్! మెగాస్టార్ చిరంజీవి అంటే కేవలం బాక్సాఫీస్ రికార్డులు మాత్రమే కాదు, గుండె నిండా మానవత్వం కూడా. తాజాగా ఒక చిన్నారి విషయంలో చిరంజీవి ప్రవర్తించిన తీరు చూశాక, అభిమానులు గర్వంతో కాలర్ ఎగరేస్తున్నారు. జీ తెలుగులో ప్రసారమవుతున్న ‘సరిగమప లిటిల్ చాంప్స్’ షోలో తన ముద్దు ముద్దు మాటలతో, అద్భుతమైన పాటలతో తెలుగు రాష్ట్రాల హృదయాలను గెలుచుకుంటున్న చిన్నారి వరుణవిని చిరంజీవి స్వయంగా కలిశారు. ఆ చిన్నారితో ఆయన గడిపిన క్షణాలు ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉన్నాయి.


వరుణవి వయసు చాలా తక్కువ, కానీ ఆమె టాలెంట్ మాత్రం ఆకాశమంత. కంటి సమస్యతో బాధపడుతున్నప్పటికీ, ఆ లోపాన్ని ఎప్పుడూ తన పాటకు అడ్డు రానివ్వలేదు. తన అద్భుతమైన గాత్రంతో జడ్జీలను సైతం కంటతడి పెట్టించిన సందర్భాలు అనేకం. ఈ షోకి జడ్జిగా వ్యవహరిస్తున్న డైరెక్టర్ అనిల్ రావిపూడి, చిరంజీవికి వరుణవి అంటే ఎంత ఇష్టమో గమనించారు. ఒక ఎపిసోడ్ లో “నిన్ను మెగాస్టార్ చిరంజీవి గారితో కలిపిస్తాను” అని వరుణవికి ప్రామిస్ చేశారు అనిల్.చెప్పిన మాట ప్రకారమే, తాజాగా జరిగిన ఒక షూటింగ్ లో వరుణవిని చిరంజీవి వద్దకు తీసుకెళ్లారు. ఆ చిన్నారిని చూడగానే చిరంజీవి ముఖంలో వెయ్యి ఓట్ల వెలుగు కనిపించింది.



చిరంజీవిని చూడగానే వరుణవి ఎంతో ఎగ్జైట్ అయ్యింది. చిరంజీవి కూడా ఏమాత్రం గర్వం లేకుండా ఆ చిన్నారిని తన ఒడిలో కూర్చోబెట్టుకున్నారు. వరుణవి చిరంజీవి సినిమాల్లోని ఫేమస్ డైలాగులు చెబుతుంటే, ఆయన ఆశ్చర్యంతో నోరెళ్లబెట్టారు. అంతేకాదు, వరుణవి చిరంజీవి సూపర్ హిట్ సాంగ్స్‌ను తనదైన స్టైల్‌లో పాడి వినిపించింది. అది చూసి మెగాస్టార్ మురిసిపోయారు.“ఈ చిన్నారిలో ఉన్న టాలెంట్ అద్భుతం. కంటి సమస్య ఉన్నా ఇంత ధైర్యంగా, ఇంత చక్కగా పాడుతుంటే చూస్తుంటే నాకు గర్వంగా ఉంది” అని చిరంజీవి ఎమోషనల్ అయ్యారు. ఆ చిన్నారితో ఆయన సరదాగా కబుర్లు చెబుతున్న వీడియో చూస్తుంటే, ఒక తాత తన మనవరాలితో ఆడుకుంటున్నట్లుగా చాలా ఆత్మీయంగా అనిపించింది.



కేవలం కలవడం, ఫోటోలు దిగడంతోనే చిరంజీవి ఆగిపోలేదు. వరుణవి కుటుంబ నేపథ్యం, ఆమె ఆరోగ్య సమస్య గురించి అడిగి తెలుసుకున్నారు. “వరుణవి భవిష్యత్తులో ఎదిగేందుకు, తన చదువుకు లేదా ఆరోగ్యానికి సంబంధించి ఎలాంటి సాయం కావాలన్నా నేను సిద్ధం. నీకు నేనున్నాను” అని ఆ చిన్నారికి, ఆమె తల్లిదండ్రులకు భరోసా ఇచ్చారు.ఇప్పటికే చిరంజీవి బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంక్ ద్వారా ఎంతోమంది ప్రాణాలు కాపాడారు. ఎందరో అభిమానులకు ఆర్థిక సాయం చేసి ఆదుకున్నారు. ఇప్పుడు వరుణవికి ఆయన ఇచ్చిన అభయం చూసి నెటిజన్లు “ఇది కదా మెగాస్టార్ అంటే.. అందుకే ఆయన అందరికీ అన్నయ్య అయ్యారు” అంటూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.



ఈ అద్భుతమైన కలయికకు కారణమైన దర్శకుడు అనిల్ రావిపూడిని ఫ్యాన్స్ అభినందిస్తున్నారు. “చిన్నపిల్లల కలలను నిజం చేయడంలో అనిల్ ఎప్పుడూ ముందుంటారు” అని కొనియాడుతున్నారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో చిరంజీవి నటిస్తున్న ‘మన శంకర వర ప్రసాద్ గారు’ సినిమా సంక్రాంతికి విడుదల కాబోతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా ప్రమోషన్ల హడావిడిలో ఉండి కూడా, ఒక చిన్నారి కోసం సమయాన్ని కేటాయించడం చిరంజీవి గొప్పతనానికి నిదర్శనం.సినిమాల్లో బాక్స్ ఆఫీస్ బొమ్మలు హిట్టవ్వచ్చు, ఫ్లాప్ అవ్వచ్చు.. కానీ మనిషిగా చిరంజీవి ఎప్పుడూ ‘బ్లాక్ బస్టర్’ హిట్టే! వరుణవి లాంటి చిన్నారికి ఆయన ఇచ్చిన గౌరవం, ప్రేమ.. కొన్ని కోట్లతో సమానం. ఆ చిన్నారి త్వరలోనే పూర్తి ఆరోగ్యంతో కోలుకుని, భవిష్యత్తులో పెద్ద సింగర్ అవ్వాలని మనందరం ఆశిద్దాం.



మరింత సమాచారం తెలుసుకోండి: