సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరోసారి తనదైన స్టైల్‌లో ఇండస్ట్రీపై ఘాటు వ్యాఖ్యలు చేసి చర్చకు తెరలేపారు. తాజాగా విడుదలైన ‘ధురం ధర్: ది రివెంజ్’ సినిమా బాక్సాఫీస్ వద్ద సృష్టిస్తున్న ప్రభంజనం చూస్తుంటే టాలీవుడ్, బాలీవుడ్ అనే తేడా లేకుండా పాత రికార్డులన్నీ చెరిగిపోతున్నాయని సినీ విశ్లేషకులు చెబుతున్నారు. ఆదిత్య ధర్ దర్శకత్వంలో, రణవీర్ సింగ్ హీరోగా వచ్చిన ఈ చిత్రం భారీ విజయాన్ని నమోదు చేయడంతో ప్రేక్షకుల్లోనే కాకుండా సినీ వర్గాల్లో కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
అయితే, ఇంతటి పెద్ద విజయాన్ని సాధించిన ఈ సినిమాపై ఇండస్ట్రీకి చెందిన కొంతమంది ప్రముఖులు స్పందించకపోవడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఈ నేపథ్యంలో రామ్ గోపాల్ వర్మ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. “ఆదిత్య ధర్ ఈ చిత్రంతో ఫిలిం ఇండస్ట్రీలో ఒక అటామిక్ బాంబ్ పేల్చినట్టే. కానీ మిగతా ఇండస్ట్రీ నుంచి వస్తున్న ఈ నిశ్శబ్దం నన్ను ఆశ్చర్యపరుస్తోంది” అని ఆయన అన్నారు.

ఇక ఈ మౌనం వెనుక ఉన్న కారణాలపై కూడా వర్మ ప్రశ్నలు లేవనెత్తారు. “ఈ సినిమా విజయం అందరినీ షాక్‌లోకి నెట్టేసిందా? అందుకే వారి స్పందనలు వినిపించడం లేదా? లేక ఇది కేవలం హైప్ మాత్రమే అనుకుంటూ పాత పద్ధతుల్లోనే సినిమాలు తీయాలని భావిస్తున్నారా?” అంటూ ఆయన సూటిగా ప్రశ్నించారు. ఇంత అద్భుతమైన సినిమాను చూసి కూడా చూడనట్టుగా వ్యవహరించడం మూర్ఖత్వమే అవుతుందని ఆయన హెచ్చరించారు.ఇండస్ట్రీలోని దర్శకులు, నిర్మాతలకు వర్మ గట్టిగా సూచనలు కూడా చేశారు. “దయచేసి ‘ధురం ధర్ 2’ను ఒక కొత్త కోర్సులా తీసుకుని అధ్యయనం చేయండి. సినిమా మేకింగ్‌లో కొత్త పద్ధతులు నేర్చుకోండి. లేదంటే 2026 మార్చి 19కు ముందు ఉన్న పాత సినిమాల సరసన మీరుకూడా మిగిలిపోతారు” అని స్పష్టం చేశారు. “ఒళ్లు దగ్గర పెట్టుకుని మేకింగ్ నేర్చుకోండి” అంటూ ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సినీ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీశాయి.మొత్తానికి, ఒక సినిమా విజయం ఎంతటి ప్రభావాన్ని చూపగలదో, అలాగే ఇండస్ట్రీలో మార్పు అవసరాన్ని గుర్తు చేసేలా వర్మ చేసిన ఈ వ్యాఖ్యలు మరోసారి ఆయన ప్రత్యేక దృష్టికోణాన్ని బయటపెట్టాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: