టాలీవుడ్‌లో గత కొన్ని రోజులుగా సింగిల్ స్క్రీన్ థియేటర్ల యాజమాన్యాలు (ఎగ్జిబిటర్లు), నిర్మాతలు మరియు డిస్ట్రిబ్యూటర్ల మధ్య నడుస్తున్న పర్సంటేజీ వివాదం ఎట్టకేలకు ఒక కొలిక్కి వచ్చింది. ముఖ్యంగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన భారీ చిత్రం 'పెద్ది' విడుదలకు ఈ సమస్య పెద్ద అడ్డంకిగా మారుతుందేమోనన్న ఆందోళనలకు చెక్ పడింది. తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో డిస్ట్రిబ్యూటర్లు, ప్రొడ్యూసర్లు, ఎగ్జిబిటర్ల సెక్టార్ల నుంచి చెరో ఏడుగురు చొప్పున మొత్తం 21 మందితో ఏర్పాటైన ప్రత్యేక కమిటీ రెండోసారి సమావేశమై కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ మీటింగ్‌లో కుదిరిన అవగాహన ఒప్పందం ప్రకారం 'పెద్ది' సినిమా థియేట్రికల్ రిలీజ్‌కు ఎలాంటి ఆటంకాలు, అభ్యంతరాలు లేకుండా సజావుగా సహకరించడానికి అన్ని వర్గాలు ఏకగ్రీవంగా అంగీకరించాయి. దీంతో మెగా అభిమానుల్లోను, ట్రేడ్ వర్గాల్లోను ఉన్న ఉత్కంఠ పూర్తిగా తొలగిపోయింది.
ఈ కీలక సమావేశంలో కేవలం సినిమా విడుదలను క్లియర్ చేయడమే కాకుండా, థియేటర్ల ఆదాయ మార్గాలపై కూడా కమిటీ కొన్ని విధివిధానాలను ఖరారు చేసింది. ఆంధ్రప్రదేశ్‌లో 'పెద్ది' సినిమాకు ప్రభుత్వం గనుక టికెట్ రేట్లు పెంచితే, అందుకు ప్రతిఫలంగా ఎగ్జిబిటర్లకు 7.5 శాతం పర్సంటేజీ చెల్లించడానికి నిర్మాతలు-డిస్ట్రిబ్యూటర్లు ఒప్పుకున్నారు. ఒకవేళ తెలంగాణలో కూడా టికెట్ రేట్ల పెంపు ఉంటే ఇదే నిబంధన వర్తిస్తుంది. టికెట్ రేట్ల పెంపు లేని పక్షంలో, ఎగ్జిబిటర్లు మరియు డిస్ట్రిబ్యూటర్లు విడివిడిగా చర్చించుకొని ఎప్పట్లాగే పాత పద్ధతిలోనే ఒక ఒప్పందానికి రావాల్సి ఉంటుంది.
దీనితో పాటు పెద్ద సినిమాలకు వేసే ప్రీమియర్ షోల ఆదాయానికి సంబంధించి కూడా కమిటీ ఒక స్పష్టమైన నిర్ణయానికి వచ్చింది. 'పెద్ది' లాంటి పెద్ద సినిమాలకు ప్రీమియర్స్ ప్రదర్శించినప్పుడు ఎ-సెంటర్ ఎగ్జిబిటర్లకు పాతిక వేల రూపాయలు, బి-సెంటర్ ఎగ్జిబిటర్లకు 15 వేల రూపాయలు, అలాగే సి-సెంటర్ ఎగ్జిబిటర్లకు 10 వేల రూపాయల చొప్పున ఫిక్స్‌డ్ అమౌంట్ చెల్లించడానికి నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు అంగీకరించారు. దీనివల్ల చిన్న ముఠా కేంద్రాలలోని థియేటర్లకు కూడా మేలు జరుగుతుంది.
ఇక పరిశ్రమలో దీర్ఘకాలికంగా చర్చల్లో ఉన్న అసలు పర్సంటేజీ సిస్టమ్ అమలుపై ఈ కమిటీ ఒక డెడ్ లైన్ విధించుకుంది. ప్రస్తుతం ఎంత శాతం అనేది పూర్తిగా లాక్ చేయనప్పటికీ, ఈ విధానానికి అందరూ సూత్రప్రాయంగా ఓకే చెప్పారు. 'పెద్ది' సినిమా విడుదలైన మూడు వారాల లోపు లేదా దీని తర్వాత రాబోయే మరో పెద్ద సినిమా (ది ప్యారడైజ్) థియేటర్లలోకి వచ్చేలోగా సింగిల్ స్క్రీన్లకు ఎంత శాతం పర్సంటేజీ ఇవ్వాలనే తుది నిర్ణయాన్ని తేల్చేయనున్నారు. అలాగే ప్రస్తుతం ఇండస్ట్రీలో వైరల్ అవుతున్న 17 పెద్ద సినిమాల జాబితాపై కూడా కమిటీ చర్చించింది. ఇప్పటికే 70 శాతం షూటింగ్ పూర్తి చేసుకున్న సినిమాలకు మాత్రం ఒక ప్రత్యేక పర్సంటేజీని అమలు చేస్తారు. ఆయా ప్రాంతాలలోని థియేటర్ యాజమాన్యాలు లేదా లెస్సీలతో మాట్లాడి దీనిని ఫిక్స్ చేసుకోవచ్చు. అయితే ఈ డెడ్‌లైన్ తర్వాత వచ్చే మిగిలిన అన్ని కొత్త సినిమాలకు మాత్రం భవిష్యత్తులో కమిటీ ఖరారు చేయబోయే కొత్త పర్సంటేజ్ విధానాన్ని తప్పనిసరిగా అమలు చేయాల్సి ఉంటుంది. మొత్తం మీద ఫిల్మ్ ఛాంబర్ తీసుకున్న ఈ ముందడుగుతో 'పెద్ది' సినిమాకు ఉన్న అన్ని లైన్లు క్లియర్ అయిపోయాయి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి