'అవ్వల్ నంబర్ ప్రొడక్షన్స్' బ్యానర్‌పై మాధవి రెడ్డి సోమ నిర్మించిన తొలి చిత్రం ‘అమీర్ లోగ్’. ఈ మూవీకి రమణా రెడ్డి సోమ దర్శకత్వం వహించారు. ఈ సినిమాకి మనోహర్ రెడ్డి మంచురి సహ నిర్మాతగా వ్యవహరించారు. ఈ చిత్రంలో MC హరి, మనోజ్, శశిధర్ ప్రధాన పాత్రల్లో నటించగా.. వేధా జలంధర్, రావణ్ నిట్టూరు, విశ్వేందర్ రెడ్డి, సాయోగి కీలక పాత్రలు పోషించారు. రానా దగ్గుబాటి సంస్థ 'స్పిరిట్ మీడియా' ఈ మూవీని తెలుగులో ఆగస్ట్ 21న గ్రాండ్‌గా రిలీజ్ చేశారు. మరి ఈ మూవీ ఎలా ఉందో ఓ సారి చూద్దాం.

కథ
శ్రీను (హరి), ఫరూక్ (మనోజ్), మల్లేశ్ (శశి) ముగ్గురూ కూడా బాల్య స్నేహితులు. ఈ బస్తీ కుర్రాళ్లు పనీ పాటా లేకుండా ఖాళీగా తిరుగుతుంటారు. బస్తీలో గొడవలు పెట్టుకోవడం, క్రికెట్ ఆడటం, తినడం, తిరగడం ఇదే పని. ఈ ముగ్గురికి ఎప్పుడూ మంచి మాటలు చెప్పి, మంచి మార్గంలో పెట్టాలని చూస్తుంటుంది అదే బస్తీలో ఉండే గీతక్క (వేద జలంధర్). ఇక ఈ వీరికి చాచా (విశ్వేందర్ రెడ్డి) పెద్ద దిక్కుగా ఉంటాడు. చాలా కుటుంబం అంతా దుబాయ్‌లోనే ఉంటుంది. చాచా ఒక్కడే ఉంటాడు. దీంతో చాచా చుట్టూనే ఈ ముగ్గురూ తిరుగుతుంటారు. పైగా చాచా చేసే చేతి బిర్యానీ అంటే మహా ఇష్టంగా తింటారు. ఇక క్రికెట్ ఆట వల్ల బస్తీలో వేరే బ్యాచ్‌తో ఈ బ్యాచ్‌కి పెద్ద గొడవ జరుగుతుంది. దీంతో ఇంట్లో వాళ్లంతా కూడా ఈ ముగ్గురిని తిడుతుంటారు. ఏదో ఒక పని చేసుకుందాం అని ఈ ముగ్గురూ ఫిక్స్ అవుతారు. హరికి గీతక్క తన ఆఫీసులోనే ఆఫీస్ బాయ్‌గా పని చూసి పెడుతుంది. మనోజ్ తన అన్న మెనికాన్‌ షాపులో పని చేస్తాడు. శశి కారు డ్రైవర్‌గా పనిలోకి వెళ్తాడు. ఇష్టం లేకపోయినా ఆ పనుల్ని చేస్తూ ఎవరి బిజీలో వాళ్లు ఉంటారు. ఆ తర్వాత ఈ ముగ్గురి జీవితాల్లో వచ్చిన మార్పులు ఏంటి? ఈ కథలో బిర్యానీ పాత్ర ఏంటి? ఈ ముగ్గురూ కలిసి చేసిన బిజినెస్ సక్సెస్ అవుతుందా? ఈ క్రమంలో చాచా చేసిన సాయం ఏంటి? చివరకు ఈ ముగ్గురూ జీవితంలో బాగు పడ్డారా? లేదా? ఈ కథలో రవి (రావణ్) పాత్ర ఏంటి? అన్నదే కథ.

నటీనటులు
హరి, మనోజ్, శశి పక్కింటి కుర్రాళ్లలా ఎంతో సహజంగా నటించారు. చాచా పాత్రలో నిజంగానే ఓ పెద్ద దిక్కులా ఓ గంభీరమైన పాత్రలో విశ్వేందర్ రెడ్డి కనిపిస్తాడు. గీతక్క అనే పాత్రలో వేదా జలంధర్ ఆకట్టుకుంటుంది. మిగిలిన అన్ని పాత్రలు కూడా కథకు ఆకర్షణగా ఉంటాయి. అందరూ చక్కగా నటించారు.

విశ్లేషణ
అమీర్ లోగ్ కథ మన జీవితాల్లోంచి వచ్చినట్టుగా, మన జీవితాలకు ప్రతిరూపంగా ఉంటుంది. ఇందులో స్టార్ హీరోలకు పడే ఎలివేషన్స్ ఉండవు. కానీ సాధారణ ప్రేక్షకుల్ని కదిలించే ఎమోషన్, కనెక్ట్ చేసే అంశాలు ఉంటాయి. ప్రతీ ఒక్కరూ ఇది తమ కథ, తమ బస్తీ కథే కదా అన్నట్టుగా ఉంటుంది. అంత సహజంగా, కనెక్ట్ అయ్యేలా రాసుకోవడంలో, తీయడంలో దర్శకుడు రమణా రెడ్డి సక్సెస్ అయ్యారని చెప్పుకోవచ్చు. ఎలాంటి పెద్ద పెద్ద ట్విస్టులు, పెద్ద సస్పెన్స్‌లు పెట్టకుండా, సింపుల్‌గా యూత్‌కి కావాల్సిన ఎమోషన్, మెసెజ్‌ను చూపించారు.

ఫస్ట్ హాఫ్‌లో ఈ కుర్రాళ్లు అల్లరిచిల్లరగా తిరగడం, ఆడుతూ పాడుతూ ఉండటం, బాధ్యతల్లేకుండా తిరిగే సీన్లతో సాఫీగా సాగుతుంది. వీరంతా ఓ దారిలో పడుతున్నట్టుగా ఇంటర్వెల్ బ్లాక్ నడుస్తుంది. ఇంటర్వెల్ ఎపిసోడ్‌లో వచ్చే క్రికెట్ మ్యాచ్ బాగుంటుంది. సెకండాఫ్‌లో కుర్రాళ్ల ఆలోచన తీరు మారడం, బాగు పడేందుకు కష్టపడటం, నిజాయితీగా పని చేయడం వంటి సీన్లతో సెకండాఫ్ సాగుతుంది. నమ్మిన బాటలో నిజాయితీగా నడిచే క్రమంలో ఏర్పడే సమస్యల్ని ప్రీ క్లైమాక్స్‌లో చూపిస్తాడు. క్లైమాక్స్ చూస్తే కడుపు నిండినట్టుగా, మనసు సంతృప్తి చెందినట్టుగా అనిపిస్తుంది.

టెక్నికల్‌గా ఈ చిత్రం ఓ డిఫరెంట్ ఎక్స్‌పీరియెన్స్ ఇస్తుంది. స్మరణ్ మ్యూజిక్, ఆర్ఆర్ సినిమాకి ప్రాణం. ప్రతీ పాట ఓ ఎమోషన్‌ను క్యారీ చేస్తుంది. ఎస్వీకే కెమెరా వర్క్ సహజంగా అనిపిస్తుంది. బస్తీలను, గల్లీలను అందంగా చూపించారు. ఎడిటర్ రోహిత్ అద్భుతంగా కట్ చేశారు. మొదటి ప్రొడక్షన్ అయినా కూడా నిర్మాత మాధవి గారు ఎక్కడా కాంప్రమైజ్ కాలేదు. ఇదొక గొప్ప ప్రయత్నం అని చెప్పుకోవచ్చు. నిర్మాణ విలువలు గొప్పగా అనిపిస్తాయి.

రేటింగ్ 3

మరింత సమాచారం తెలుసుకోండి: