మెమరీ మేకర్స్ బ్యానర్ మీద హరికృష్ణ సోమిశెట్టి నిర్మించిన చిత్రం ‘ది రెడ్ బ్యాగ్’. ఈ మూవీకి రవి కుమార్ సీరపు దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో కబీర్ సింగ్, ప్రసాద్ బెహరా, రాధ్య, మోనిక, ఆకాంక్ష, ఈషాన్ శంకర్, అవినాష్ బాదల్, భార్గవి, రాశీ తదితరులు ముఖ్య పాత్రలను పోషించారు. ఇప్పటి వరకు రిలీజ్ చేసిన పోస్టర్లు, గ్లింప్స్, టీజర్, ట్రైలర్ అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ మూవీని ఆగస్ట్ 21న రిలీజ్ చేయనున్నారు. ఈక్రమంలో వేసిన ప్రీమియర్లకు మంచి స్పందన వచ్చింది. మరి ఈ మూవీ కథ ఏంటి? అన్నది చూద్దాం.

కథ
ఆరిజానాలోని ఓ పబ్‌లో విన్ని (రాధ్య) డ్యాన్సర్‌గా చేస్తుంటుంది. ఆ పబ్ ఓనర్ మైక్ (కబీర్ సింగ్) అతి క్రూరుడు. మైక్‌కి ఓ ఐలాండ్లో భారీ రిసార్ట్‌ని, పబ్‌ని పెట్టాలనే ధ్యేయంతో ఉంటాడు. అందుకోసమే పబ్‌లో అమ్మాయిల్ని పెట్టి వ్యాపారం నిర్వహిస్తుంటాడు. అలాంటి చీకటి లోకంలోకి ఈషా, ఈవ్, బేబ్ అని ముగ్గురు ఇండియన్స్ వచ్చి చేరతారు. అసలు విన్ని ఈ పనిలోకి ఎలా వచ్చింది? ఆ ముగ్గురు అసలు ఇండియా నుంచి ఆరిజానాకి ఎందుకు వస్తారు? మైక్ చేతిలో చిక్కిన వీరంతా బయటకు ఎలా వెళ్తారు? ఈ క్రమంలో రెడ్ బ్యాగ్ వల్ల కలిగిన లాభనష్టాలు ఏంటి? అసలు ఆ రెడ్ బ్యాగ్‌లో ఏముంది? చివరకు ఈ నలుగురు అమ్మాయిలు తమ తమ లక్ష్యాల్ని చేరుకున్నారా? లేదా? అన్నది కథ.

నటీనటులు
విన్ని పాత్రలో రాధ్య అందరినీ ఆకట్టుకుంటుంది. మిగతా ముగ్గురు హీరోయిన్లు తెరపై అందంగా కనిపిస్తారు.  మోడ్రన్‌గా కనిపించే లుక్‌లోనూ, ఎమోషన్స్ చూపించే సీన్లలోనూ నలుగురు భామలు ఆడియెన్స్‌ని మెప్పిస్తారు. కబీర్ సింగ్ విలనిజం ఓకే అనిపిస్తుంది. ప్రసాద్ బెహర ఉన్న సీన్లు నవ్వులు పుట్టిస్తాయి. గాయత్రి భార్గవి కనిపించే ఒకటి, రెండు సీన్లు ఎమోషనల్‌గా ఉంటాయి. రాశీ పాత్రకు నిడివి తక్కువే అయినా ఇంపాక్ట్ మాత్రం ఎక్కువగానే ఉంటుంది. సినిమాలో జాక్, దగ్లస్, గౌతమ్ కారెక్టర్స్ కూడా మెప్పిస్తాయి. ఇతర ఆర్టిస్టులు తమ పరిధి మేరకు ఆకట్టుకుంటారు.

రవి కుమార్ సీరపు ఈ రెడ్ బ్యాగ్ సినిమా కోసం పాత లైన్‌ను వాడుకున్నాడు. కానీ ఇప్పటి ట్రెండ్‌కి తగ్గట్టుగా మార్చుకున్నాడు, స్టైలీష్‌గా తెరకెక్కించాడు. మోడ్రన్ మదర్ థెరిస్సాలు, మోడ్రన్ ఝాన్సీ లక్ష్మీ భాయ్‌లను తెరపై చూపించాలని దర్శకుడు అనుకుని ఉండొచ్చు. హీరోయిన్ల కాస్ట్యూమ్స్ చూసి జనాలు ఏదో ఊహించి థియేటర్‌కు వచ్చే అవకాశం ఉంది. కానీ థియేటర్ నుంచి బయటకు వెళ్లేటప్పుడు మాత్రం తమ అభిప్రాయాల్ని మార్చుకుంటారు. స్ట్రీ శక్తి, అమ్మ గొప్పదనం మరోసారి తెలియజెప్పేలా దర్శకుడు తీసుకున్న పాయింట్, తెరకెక్కించిన విధానం బాగుంటుంది.

సినిమా ప్రారంభం కాస్త నెమ్మదిగా ఉంటుంది. విన్ని పాత్ర పరిచయం, రాశీ కారెక్టర్‌తో ఓపెన్ చేయించడం.. మెల్లిగా కథ ఫ్లాష్ బ్యాక్‌కి వెళ్లడం, పబ్‌ వాతావరణం, అక్కడి ఇల్లీగల్ పనులు ఇవన్నీ కూడా ఆసక్తికరంగా సాగుతుంటాయి. ముగ్గురు అమ్మాయిల పాత్రలు ఎంట్రీ ఇవ్వడం, వారి ఫ్లాష్ బ్యాక్ మాత్రం చాలా ఎమోషనల్‌గా ఉండటంతో కథ ఒక్కసారిగా మలుపు తిరుగుతుంది. ఈ కథకి బ్యాక్ అండ్ ఫోర్త్ స్క్రీన్ ప్లే ఇంట్రెస్టింగ్‌గా అనిపిస్తుంది. కాసేపు ప్రజెంట్, ఇంకాసేపు ఫ్లాష్ బ్యాక్ అంటూ తీసుకుపోయిన తీరు బాగుంటుంది. ఇంట్రవెల్‌కి మంచి ట్విస్ట్ పడుతుంది.

సెకండాఫ్‌లో విన్ని పాత్ర, గౌతమ్ కారెక్టర్‌ల ఫ్లాష్ బ్యాక్ సాదాసీదాగా అనిపిస్తుంది. ప్రసాద్ బెహరా, కబీర్ సింగ్ ద్వయం సీన్లు కొన్ని నవ్వులు పూయిస్తాయి. సెకండాఫ్‌లో ఛేజింగ్ సీన్స్, యాక్షన్ సీక్వెన్స్ బాగుంటాయి. క్లైమాక్స్‌కి వచ్చే సరికి మంచి ఎమోషనల్ టచ్‌తో ముగుస్తుంది. వేరే దారిలేక తప్పుడు దారిని ఎంచుకున్న తల్లి, ఆ తల్లిని సమాజం చూసే చిన్న చూపు ఇలాంటి అంశాల్ని దర్శకుడు ఎంతో సున్నితంగా స్పృశించాడు. హీరోయిన్లు తెరపై కాస్త బోల్డ్‌గా కనిపించినా.. ప్రవర్తించినా.. వారి లక్ష్యం, ధ్యేయం మాత్రం అందరినీ ఆకట్టుకునేలా ఉంటుంది. చివరకు నలుగురు ధీర వనితలు చేసిన యుద్దం, రాబిన్ హుడ్‌లా అందరికీ చేసిన సాయం మెప్పిస్తుంది.

టెక్నికల్‌గా ది రెడ్ బ్యాగ్ మూవీ గొప్పగా అనిపిస్తుంది. విజువల్స్ టాప్ నాచ్‌లో ఉంటుంది. కెమెరా వర్క్ మెప్పిస్తుంది. చాలా రిచ్‌గా కనిపిస్తుంది. పబ్ సాంగ్ బాగుంటుంది. చాలా సీన్లలో బీజీఎం అదిరిపోతుంది. మాటలు కొన్ని చోట్ల మనసుల్ని హత్తుకుంటాయి. మిగతా అన్ని డిపార్ట్స్మెంట్‌ల పని తీరు బాగుంటుంది. నిర్మాణ విలువలు ఉన్నతంగా అనిపిస్తాయి.

రేటింగ్ 3

మరింత సమాచారం తెలుసుకోండి: