తెలుగు జానపదాలను నేటి తరం మరిచిపోతోంది. తియ్యటి తెలుగు భాష మాధుర్యం ఈ జానపదాల్లోనే ఉట్టిపడుతుంది. భాషే రమ్యం.. సేవే గమ్యం అని నినదించే ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ తాజాగా వెబినార్ ద్వారా జానపద కళకారులచే పల్లె పాటల కార్యక్రమాన్ని నిర్వహించింది. న్యూజెర్సీ నాట్స్ విభాగం ఆధ్వర్యంలో దాదాపు 20 మంది జానపద కళకారులు అనేక ప్రాంతాల నుంచి వెబినార్ ద్వారా అనుసంధానమై.. పల్లెపాటలను హోరెత్తించారు. అమెరికాలో ఉంటున్న తెలుగువారికి జానపదాన్ని గుర్తు చేసేందుకు.. నాట్స్ మాజీ అధ్యక్షుడు, బోర్డ్ డైరెక్టర్ మోహన కృష్ణ మన్నవ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయించారు. నాట్స్ న్యూ జెర్సీ చాప్టర్ సాంస్కృతిక సభ్యుడు శేషగిరిరావు(గిరి)కంభంమెట్టు దీనికి వ్యాఖ్యతగా వ్యవహారించారు. జూమ్‌లో జానపదం పేరుతో ప్రారంభమైన ఈ కార్యక్రమం దాదాపు మూడు గంటల పాటు  అమెరికాలో ఉంటున్న తెలుగువారికి తమ పల్లెలను గుర్తు చేసింది.

 

న్యూజెర్సీ నాట్స్ నాయకులు వంశీ వెనిగళ్ల, తదితర నాయకులు ఈ జానపద కార్యక్రమానికి సాంకేతిక సహకారాన్ని అందించారు. ప్రముఖ జానపద కళాకారులు డా.లింగా శ్రీనివాస్ ఈ కార్యక్రమానికి సమన్వయ కర్తగా వ్యవహారించి రాయలసీమ, తెలంగాణ, ఉత్తరాంధ్ర ఇలా అన్ని ప్రాంతాల జానపద కళాకారులను వెబినార్ ద్వారా అనుసంధానం చేశారు. వారి పల్లె పాటల మాధుర్యాన్ని వెబినార్ ద్వారా అందరూ పొందేలా చేశారు. వేలమంది అమెరికాలోని తెలుగువారు ఈ వెబినార్ ద్వారా కనెక్ట్ అయ్యి ఈ జానపద కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. వెబినార్ ద్వారా ఇంతమంది కళాకారులతో కార్యక్రమం నిర్వహించడం కూడా ఇదే ప్రథమం.

 

జానపద గాయకులను గుర్తించి పల్లె పాటలను ఆదరించేందుకు ఇలాంటి చక్కటి కార్యక్రమం చేపట్టినందుకు జానపద గాయకులంతా నాట్స్‌ను ప్రత్యేకంగా అభినందించారు. ఇది తమ పాటకు లభించిన అరుదైన గౌరవమని తెలిపారు. ఇలాంటి చక్కటి కార్యక్రమంలో తమను భాగస్వాములను చేసిన మోహనకృష్ణ మన్నవను వారు అభినందించారు. తెలుగు జానపదాన్ని కాపాడుకోవటానికి నాట్స్ ఎప్పుడూ ముందుంటుందని.. రేపటి తరానికి కూడా తెలుగు జానపదాన్ని పరిచయం చేయాలనే ఇలాంటి కార్యక్రమం చేపట్టినట్టు మోహన కృష్ణ మన్నవ తెలిపారు. ఈ కార్యక్రమ నిర్వహణలో పాలుపంచుకున్న ప్రతి ఒక్కరిని నాట్స్ బోర్డ్ ఛైర్మన్ శ్రీథర్ అప్పసాని, నాట్స్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ మంచికలపూడి అభినందించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: