" ప్రజలే దేవుళ్ళు, వారికోసమే మేము బతుకుతున్నాం. ఏది చేసినా వాళ్ళ కోసమే " ఇలాంటి కబుర్లు చెప్పని రాజకీయ నాయకుడు ఉంటాడా ? ఛాన్స్ లేదు . నిజానికి జనాలని పిచ్చోళ్లని ,వెర్రి వెంగళప్పలనీ చేసి ఆడుకోవడం లో సదరు రాజకీయనాయకుడిని మించినోడు ఉండనే ఉండదు. పైకి ప్రజలే దేవుళ్ళు అని చెబుతూ వారి గుడినే కూల్చేసే రకాలు అందరూ. రిజర్వేషన్ ల విషయం లో ఈ అసలైన నిజం బయటపడుతూ ఉంటుంది.



ఒకపక్క రిజర్వేషన్ లకి ఛాన్స్ ఉండదు, మరొక పక్క రిజర్వేషన్ ల ప్రకటనలకి మాత్రం అడ్డూ అదుపూ ఉండదు. అధికారంలో ఉన్నప్పుడు రిజర్వేషన్ లు కుదరవు, టైం పడుతుంది, ఇదెలా సాధ్యం అని మాట్లాడిన నాలిక. ప్రతిపక్షం లోనో, ఓట్ల కోసం రోడ్లమీద పడినప్పుడో మాత్రం ' మీకెందుకు రిజర్వేషన్ సంగతి నేను చూస్కుంటా కదా ' అంటుంది. దానికి ప్రత్యక్ష ఉదాహరణ ఆంద్ర ప్రదేశ్ లో కాపుల రిజర్వేషన్ అంశమే.కాపుల రిజర్వేషన్ వ్యవహారం లో చంద్రబాబు ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్న తీరు చూస్తూనే ఉన్నాం. ఓట్ల కోసం రోడ్లు ఎక్కినప్పుడు కాపులకి రిజర్వేషన్ చాలా ముఖ్యం అనీ వారు అది లేకపోతే మనుగడ సాగించడం కూడా కష్టం అనీ, కేవలం టీడీపీ పరిపాలన ఒస్తే గానీ ఈ కాపు రిజర్వేషన్ లు సాధ్యపడవు అనీ ఏవేవో కబుర్లు చెప్పి పీఠం దక్కించుకున్నారు బాబు గారు.



కుర్చీ ఎక్కిన రెండు సంవత్సరాల తరవాత కూడా మళ్ళీ ఆ విషయం గురించి ప్రస్తావన తీసుకుని రాలేదు ఆయన లేనిపోని ఆశలు కల్పించి దాన్ని ఓటు బ్యాంకుగా మార్చుకుని అధికారం పొంది ఇప్పుడు దానిగురించి పూర్తిగా విస్మరిస్తే జనం ఊరుకుంటారా ? ఊరుకోరు అందుకే దాని విషయం లో ఉద్యమం లేవదీసారు. తమకి ఇచ్చిన మాటని నిలబెట్టుకోవాలి అని కోరిన కాపు సామాజిక వర్గం మీద చంద్రబాబు కేసులు పెట్టి అల్లర్లు , గొడవలు చేస్తో ఊరుకునేది లేదు. కేసులు పెట్టి తీరతాం అంటూ వార్నింగ్ ఇచ్చారు గానీ కాపు రిజర్వేషన్ ల గురించి మాత్రం మనస్పూర్తిగా ఒక్క హామీ కూడా ఇచ్చిన పాపాన పోలేదు. గోదావరి జిల్లాలో గొడవలు జరిగితే అదంతా గోదావరి జిల్లా వాళ్ళది కాదు అని ఎక్కడి నుంచో ఒచ్చి ఆ రచ్చ చేసారు అనే గోదావరి జిల్లాకి చెందిన వాళ్ళంతా మంచోళ్ళు అంటూ సర్టిఫికేట్ ఇచ్చేసారు ఆయనే.




ఇదంతా చూస్తున్న పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ తానేమైనా తక్కువ తిన్నానా ? అనుకున్నారో ఏమో గానీ అధికారం వచ్చి రెండేళ్ళు అయినా ఆయన మాట ఇచ్చిన ముస్లిం రిజర్వేషన్ ల సంగతి ఎత్తను కూడా ఎత్తడం లేదు ఆయనగారు. ఈ వ్యవహారం లో పాడిన పాటే పాడుతున్నారు ముఖ్యమంత్రి. ముస్లిం లు కూడా విసిగి వేసారిపోయి ఉన్నారు ఇక వాళ్లు కూడా రోడ్లు ఎక్కి విధ్వంసాలు సృష్టిస్తే లేని పోనీ తలనొప్పి. ఒకవేళ వారు అలా చేసినా వారిని పల్లెత్తు మాట కూడా అనలేరు కెసిఆర్. ఏ కాంగ్రెస్ మీదనో మరెవరి మీదనో తోసేసి " అబ్బే ముస్లిం లు అలాంటి వారు కాదు " అని చెప్పుకోస్తారేమో.




కేసులు బనాయించి నెమ్మదిగా మాఫీ చేస్తారు. ఏపీ లో జరిగిన తంతే అక్కడ కూడా జరుగుతుంది. జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్ లు ఇస్తాను అంటున్నారు కెసిఆర్. అలా చూసుకుంటే జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు ఇవ్వాలంటే, ఒక్క ముస్లింలకేం ఖర్మ, సమాజంలోని అన్ని వర్గాలకీ రిజర్వేషన్లు ఇచ్చి తీరాల్సిందే. ఏం, సమాజంలో ఒక్కో పౌరుడిని ఒక్కోలా ఎందుకు చూడాలి.? 'మనది సమానత్వ భారతం' అని చెప్పుకుంటున్నప్పుడు, కొందరికి మాత్రమే ఎందుకు రిజర్వేషన్లు ఇవ్వాలి.? అన్న చర్చ సహజంగానే జరుగుతుంది. దీనికి ఎవ్వరూ సమాధానం చెప్పలేని పరిస్థితి ఉంది. ఈ పొలిటికల్ కహానీల విషయం లో జనం చాలా విసుగ్గా ఉన్నారు. ఈ రాజకీయ నాయకులు చెప్పింది వినీ వినీ వినీ అలసిపోయారు.ఎన్నికల వేళ చెప్పే మాటలకీ గెలిచి అధికారం చేపట్టిన తరవాత వారు ప్రవర్తించే తీరు కీ అస్సలు సంబంధమే ఉండదు. ఓట్ల పండగ ఒస్తే కాళ్ళు పట్టుకునే నాయకులు పండగ ముగిసాక అవే కాళ్ళు లాగేస్తున్నారు. వ్యవస్థ ఇంత ఇబ్బందికరంగా మారిన వేళ.. మళ్ళీ ఓట్ల పండగ ఒచ్చే వరకూ ఏపీ లో చంద్రబాబు గారు చెప్పే కహానీలు , తెలంగాణా లో కెసిఆర్ సారూ వినిపించే స్టోరీ లూ వినాల్సిందే మరి. 


మరింత సమాచారం తెలుసుకోండి: