తమిళనాట నెలకొన్న రాజకీయ అనిశ్చితికి తెరదించే దిశగా రాజ్‌భవన్‌ అడుగులేస్తోంది. అన్నాడీఎంకేలో ఏర్పడ్డ చీలికతో శాసనసభ్యుల మద్దతు ఎవరికెంత అనేది స్పష్టం కాని పరిస్థితిల్లో.. ఈ అనిశ్చితికి తెరదించాలని గవర్నర్‌ విద్యాసాగర్‌రావు నిర్ణయించినట్లు తెలుస్తోంది. తమిళనాడులో రాజకీయ ప్రతిష్టంభన ఇంకా తొలగిపోలేదు. అన్నాడీఎంకే శాసనసభాపక్ష నేతగా ఎంపికైన పళనిస్వామి తనకు 128 మంది ఎమ్మెల్యేల మద్దతుందని, ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరిన మేర కాంపోజిట్ బలపరీక్ష నిర్వహించాలని నిపుణుల నుంచి గవర్నర్ విద్యాసాగర్ రావుకు సలహా అందినట్టు తెలుస్తోంది. 


వీడని ప్రతిష్టంభన

అటార్నీ జనరల్‌ ముకుల్‌ రోహత్గీ కూడా సోమవారం ఇదే సూచించిన విషయాన్ని ప్రస్తావిస్తున్నారు.మరోవైపు సీఎం పదవికై పోటా పోటీగా పావులు కదుపుతున్న పన్నీర్‌సెల్వం, పళనిస్వామి బుధవారం రాత్రి వేర్వేరుగా గవర్నర్‌ను కలిశారు. ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం కల్పించాల్సిందిగా పళనిస్వామి గవర్నర్‌ను కోరినట్లు సమాచారం. తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటుపై కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోదని, గవర్నర్‌ రాజ్యాంగం ప్రకారం నిర్ణయం తీసుకుంటారని కేంద్రమంత్రి అరుణ్‌జైట్లీ ప్రకటించారు.



బల నిరూపణకు అవకాశమిచ్చేలా గవర్నర్ నిర్ణయం తీసుకోవచ్చు. సభకు హాజరైన ఎమ్మెల్యేల్లో మెజారిటీ ఎవరికి ఉందో వారిని ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ ఆహ్వానిస్తారు. మూజువాణీ ఓటింగ్ లేదా డివిజన్ ఓట్ ద్వారా విజేతను నిర్ణయించవచ్చు. డివిజన్‌ ఓట్‌ కోరితే, బ్యాలెట్‌ లేదా ఈవీఎంల ద్వారా ఓటింగ్‌ నిర్వహించే అవకాశాలు ఉంటాయి. ఇద్దరిలో ఎవ్వరికీ మెజారిటీ దక్కని పక్షంలో స్పీకర్‌ ఓటు వేస్తారు. ఉత్తరప్రదేశ్‌లో కళ్యాణ్‌సింగ్, జగదాంబికాపాల్‌ ఇరువురూ ప్రభుత్వ ఏర్పాటు కోసం పోటీపడినప్పుడు కాంపోజిట్‌ బలపరీక్ష నిర్వహించాలని 1998లో సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. తమిళనాడులో కూడా ఇదే పద్ధతి అనుసరించాలని, వారంలోగా సభను సమావేశపరిచి బలపరీక్షకు అవకాశమివ్వాలని అటార్నీ జనరల్‌ ముకుల్‌ రోహత్గీ సోమవారం గవర్నర్‌కు సూచించిన విషయం తెలిసిందే.  

మరింత సమాచారం తెలుసుకోండి: