గత ఏడేళ్ల నుంచి వాయిదా పడుతూ వస్తున్న నిర్భయ కేసులో నలుగురు దోషులకు ఉరి తీసిన విషయం తెలిసిందే. గురువారం పటియాల హౌస్ కోర్టు ఇచ్చిన తీర్పు మేరకు నిన్న ఉదయం ఐదున్నర గంటలకు  నిర్భయ కేసులో నలుగురు నిందితులకు ఉరిశిక్ష అమలు చేశారు తీహార్ జైలు అధికారులు. ఇక నిర్భయ కేసులో నలుగురు నిందితులకు ఉరిశిక్ష అమలు కావడంపై దేశం మొత్తం హర్షం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఆలస్యమైనా న్యాయమే గెలుస్తుంది అని మరోసారి నిరూపితం అయింది అంటూ  దేశ ప్రజలందరూ హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. అయితే తాజాగా నిర్భయ దోషులకు ఉరిశిక్ష అమలుపై అయేషా మీరా తల్లి  శంషాద్ బేగం స్పందించారు.

 

 

 నిర్భయ కేసులో నలుగురు దోషులకు ఉరిశిక్ష అమలు కావడం హర్షించదగ్గ విషయం అంటూ ఆమె అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇక తన కుమార్తె అయేషా మీరా కి  ఎప్పుడు న్యాయం ఆత్మ శాంతి కలుగుతుందో  అంటూ ఆవేదన వ్యక్తం చేశారు శంషాద్ బేగం. ఈ విషయంలో ప్రభుత్వమే సమాధానం చెప్పాలి అంటూ ఈ సందర్భంగా ఆమె డిమాండ్ చేశారు. గుంటూరు జిల్లా తెనాలిలో నిన్న మీడియా సమావేశం నిర్వహించిన అయేషా మీరా  తల్లి శంషాద్ బేగం ఈ వ్యాఖ్యలు చేశారు. నిర్భయ తల్లి న్యాయం కోసం చేసిన పోరాటం తమలాంటి వారికి స్ఫూర్తిదాయకం అంటూ తెలిపిన ఆమె నిర్భయ తల్లి ఆశ దేవి కి చేతులెత్తి మొక్కుతున్న అంటూ తెలిపారు. 

 

 

 తమ కుమార్తె అయేషా మీరా  కామాంధుల కోరలకు బలై 13 ఏళ్లు దాటిన.. కనీసం ఇప్పటి వరకు నిందితులను కూడా గుర్తించలేకపోయారు అంటూ ఆవేదన వ్యక్తం చేశారు శంషాద్ బేగం. అయితే దేశంలో ఆడపిల్లలపై అత్యాచారం చేస్తే శిక్షించడానికి నిర్భయ లాంటి బలమైన చట్టాలు ఉన్నప్పటికీ.. ఈ చట్టాలలో  రాజకీయ జోక్యం ఉంటే మాత్రం... ఏ కేసు పరిస్థితి అయినా ఇలాగే ఉంటుంది అంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ఢిల్లీలో జరిగిన నిర్భయ ఘటన తర్వాత తెలుగు రాష్ట్రాల్లో  ఇలాంటి దారుణమైన ఘటనలు ఎన్నో వెలుగులోకి వచ్చాయి అంటూ ఆమె గుర్తు చేశారు. దిశా లాంటి ఎన్నో కఠిన చట్టాలు తీసుకొచ్చినప్పటికీ వాటి అమలులో మాత్రం చిత్తశుద్ధి లేకపోతే.. అవన్నీ నీటిలో పోసిన  పన్నీరు లాగా వృధా అయిపోతాయి అంటూ తెలిపారు. నిర్భయ కేసులో ఏకంగా న్యాయానికి అండగా నిలబడాల్సిన న్యాయవాదులు నిర్భయ దోషులకు అండగా నిలబడడం సిగ్గుచేటు అంటూ వ్యాఖ్యానించిన శంషాద్ బేగం.. తాము మైనార్టీలను కావడం వల్లే ఇప్పుడు వరకు న్యాయం జరగలేదు అంటూ ఆరోపించారు. డబ్బున్న వాళ్ళకు చట్టాలు  చుట్టాలుగా మారిపోతాయని... అలాంటి వారు  నేరాలు చేసిన ఏం చేయవు అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: