రాష్ట్రానికి గుండెకాయ వంటిది రాజధాని. మరి అలాంటి కీలకమైన అంశంలో నిర్ణయం తీసుకోవడమంటే చిన్న విషయం కాదు. అందులోనూ రాజధాని కోసం నగరాల మధ్య పోటీ విపరీతంగా ఉన్న సమయంలో అంతిమ నిర్ణయం తీసుకోవడం అంత సులువు కాదు. అంతిమంగా ఏం నిర్ణయం తీసుకున్నా.. ఆ ప్రక్రియ ప్రజాస్వామ్యయుతంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి ఈ విషయంలో చంద్రబాబు సర్కారు అనుసరిస్తున్న విధానం కరెక్టేనా..? రాజధాని ఎంపిక విషయంలో ప్రజల భాగస్వామ్యం ఎంత..? ప్రజాసంఘాలు, రాజకీయ పార్టీల భాగస్వామ్యం ఎంత..? ఈ ప్రశ్నలకు సంతృప్తికరమైన సమాధానాలు వచ్చే అవకాశం కనిపించడంలేదు. రాజధాని ఎంపికపై కేంద్రం ఏర్పాటు చేసిన శివరామకృష్ణ కమిటీ అన్నిప్రాంతాలు సరిగ్గా పర్యటించలేదు. అరకొరగానే పర్యటన చేసినట్టు అసంతృప్తులు కనిపిస్తున్నాయి. మరోవైపు.. చంద్రబాబు వేసిన రాజధాని రూపరేఖల కమిటీలోనూ అందరూ పారిశ్రామికవేత్తలు, టీడీపీ నేతలకే స్థానం దక్కింది కానీ..ఇతరులకు అందులో చోటులేదు. కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు కూడా రాజధాని రాష్ట్రం ఇష్టమంటూ చంద్రబాబుకే నిర్ణయం వదిలేశారు. ఏరకంగా చూసుకున్నా రాజధాని ఎంపికలో ప్రజల భాగస్వామ్యం, ప్రజాసంఘాలు, నిపుణుల అభిప్రాయం ప్రత్యక్షంగా గానీ... పరోక్షంగా గానీ తీసుకుంటున్న దాఖలాలు లేవు.. కనీసం ఈ అంశంపై సాధారణ ప్రజల సంగతి దేవుడెరుగు.. కనీసం రాజకీయ పార్టీలన్నింటినీ కూర్చోబెట్టి మాట్లాడే ప్రయత్నాలు కూడా జరగడం లేదు. కాంగ్రెస్ సీనియర్ నేత పాలడుగు వెంకట్రావు ఇదే విమర్శ చేశారు. పార్టీలను సంప్రదించాలని.. ఒంటెత్తు పోకడ సరికాదనే విమర్శలు వచ్చాయి. ప్రతిపక్షనేత జగన్.. ఎక్కడ భూములు ఉంటే.. అక్కడ రాజధాని పెట్టాలంటున్నారు.. ఆ విషయానికి ప్రాధాన్యత దక్కడం లేదు. చంద్రబాబు సర్కారు ఇలాగే వ్యవహరిస్తే.. రాజధాని ఎంపిక కూడా ఓ కుంభ కోణం తరహాలో జరిగిందని ప్రతిపక్షాలు ఆరోపించేదానికి ఆస్కారం కల్పించినట్టు అవుతుంది. ఇప్పటికే టీడీపీ నేతలు బెజవాడ-గుంటూరు చుట్టుపక్కల భూములు భారీగా కొన్నారని ప్రచారం సాగుతోంది. ఇలాంటి విమర్శలకు తావు ఇవ్వకుండా రాజధాని విషయంలో అందరినీ కలుపుకుపోతే బావుంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: