
ఇవీ ఇప్పుడు తెలంగాణ పొలిటికల్ సర్కిళ్లో వినిపిస్తున్న గుసగుసలు.. ఈటల రాజేందర్ కు ఇంక టీఆర్ఎస్‌లో స్థానం లేదు. ఆయన పార్టీ మారడమో.. పార్టీ పెట్టడమో తప్ప వేరే ఆప్షన్ లేదు. సొంత పార్టీ పెట్టి నెగ్గుకురాగలమా.. లేదా.. ఇప్పటికే ఉన్న జాతీయ పార్టీల్లో చేరడమా అన్న ఆప్షన్‌ను కూడా ఈటల సీరియస్‌గా పరిశీలిస్తున్నారు. ఆయన ఇప్పటికే అనేక పార్టీల పెద్దలతో చర్చలు జరిపారు. ఇలాంటి సమయంలో ఆయన ఏకంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితోనూ చర్చించారని.. బీజేపీలోకి చేరేందుకు రంగం సిద్ధమైందని.. జోరుగా ప్రచారం సాగుతోంది. ఈ మేరకు అన్ని టీవీ ఛానళ్లు ఉదయం నుంచి బ్రేకింగులు వేసి వేసి అలసిపోయాయి.
ఇక సాయంత్రం.. ఈ విషయంపై కిషన్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. ఆయన తాను ఇప్పటి వరకూ ఈటలను కలవలేదని చెప్పినా.. కలిస్తే మాత్రం తప్పేంటి అని ప్రశ్నించడం విశేషం. 15 ఏళ్లు కలిసి పని చేశామని.. అలాంటప్పడు ఈటలతో చర్చిస్తే తప్పేంటని కిషన్ రెడ్డి ఎదురు ప్రశ్నించారు. అయితే ఈటలతో పాటు కొందరు కాంగ్రెస్ నేతలు కూడా బీజేపీలోకి వెళ్తున్నట్టు ప్రచారం సాగుతోంది. తెలంగాణలో కేసీఆర్ వ్యతిరేక వర్గాలను ఏకం చేయడం ద్వారా పార్టీని బలోపేతం చేసుకోవాలన్న ఆలోచన బీజేపీకి ఉంది.
ఇప్పడు ఈటల వంటి నాయకుడు బీజేపీలోకి వస్తే.. ఆ ఊపు వేరేగా ఉంటుంది. ఈటల తెలంగాణ ఉద్యమ నాయకుడు. కేసీఆర్ అధికారంలోకి వచ్చాక అనేకమంది ఉద్యమ నాయకులను దూరం చేసుకున్నారు. అలాంటి వారినందరినీ ఏకం చేసే అవకాశం ఈటల ద్వారా బీజేపీకి లభిస్తుంది. మరి ఈ ప్రచారం నిజమే అయితే తెలంగాణలో రాజకీయం యమా రంజుగా ఉండటం మాత్రం ఖాయం.