బాల్యం.. ప్రతి మనిషి జీవితంలోనూ ఓ అందమైన వరం.. చిన్ననాటి మిత్రులు.. చిన్నప్పటి బడి జ్ఞాపకాలు.. ఎప్పటికీ మరిచిపోలేం. నిజామాబాద్‌ జిల్లాకు చెందిన ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి కూడా అంతే.. తన చిన్ననాటి పాఠశాల జ్ఞాపకాలు అప్పుడప్పుడు నెమరేసుకుంటాడు. అయితే తాను చిన్నప్పుడు చదువుకున్న పాఠశాల ఇప్పుడు పాడుబడిపోయిందని తెలిసి చాలా బాధపడ్డాడు. ఎంత ఖర్చు చేసైనా సరి తన పాఠశాలను అద్భుతంగా తీర్చిదిద్దాలనుకున్నాడు. ఏకంగా రూ.6 కోట్లు ఖర్చు చేసి మరీ తాను చదువుకున్న ప్రభుత్వ ఉన్నత పాఠశాల కోసం అద్భుతమైన భవంతి నిర్మించారు.


వివరాల్లోకి వెళ్తే.. తెలంగాణలోని కామారెడ్డి జిల్లా బీబీపేట మండలం జనగామకు చెందిన తిమ్మయ్యగారి సుభాష్‌రెడ్డి ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి. హైదరాబాద్‌లో స్థిరపడ్డారు. ఆయన చిన్నప్పుడు బీబీపేటలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యాబ్యాసం చేశారు. ఆయన చదువుకున్న పాఠశాల ఎప్పుడో దశాబ్దాల క్రితం నిర్మించింది. ప్రస్తుతం ఆ పాఠశాల భవనం శిథిలావస్థకు చేరుకుంది. విద్యార్థులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయం హైదరాబాద్‌లో ఉన్న సుభాష్ రెడ్డికి తెలిసింది.


అంతే.. తన పాఠశాలకు ఆధునిక వసతులతో కూడిన భవనం నిర్మించాలనుకున్నారు. జీ+1 పద్ధతిలో భారీ భవనం డిజైన్ చేయించి కట్టించారు. ఇప్పుడు తాను చదువుకున్న పాఠశాల స్థానంలో కార్పొరేట్‌ స్థాయిలో భవంతి నిర్మించారు. ఇది చూస్తే ప్రభుత్వ పాఠశాల భవనమేనా అని ఆశ్చర్యపోయేలా నిర్మించారు. ఈ నిర్మాణంలో మొత్తం 36 గదులు ఉన్నాయి. కేవలం బిల్డింగ్ కట్టివ్వడమే కాదు.. డిజిటల్‌ తరగతులు, సైన్స్‌ ల్యాబ్‌, గ్రంథాలయం, కంప్యూటర్‌ ల్యాబ్‌, మూత్రశాలలు ఏర్పాటు చేశారు.


బడిలో తాగునీరు సౌకర్యం , ఉపాధ్యాయులకు విశ్రాంతి గదులు.. ఇలా సకల సౌకర్యాలు ఏర్పాటు చేయించారు. ఇప్పుడు ఈ హైస్కూల్లో 650 మంది వరకూ చదువుతున్నారు. తన చిన్ననాటి బడి కోసం ఏకంగా రూ. 6 కోట్లు ఖర్చు చేసిన సుభాష్ రెడ్డిగారిని అభినందించకుండా ఉండగలమా..! ఇలా తాము చదువుకున్న పాఠశాలలను ఇప్పుడు చాలా మంది పూర్వ విద్యార్థులు అభివృద్ధి చేయిస్తున్నారు. ఇదో మంచి పరిణామం. ఈ స్ఫూర్తితో విద్యాలయాలు మళ్లీ కళకళలాడతాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: