ఏపీ రాజకీయాల్లో ప్రతిపక్ష టీడీపీ పరిస్తితి రోజురోజుకూ మెరుగుపడుతుందా? అంటే ప్రస్తుతానికైతే ఏమి చెప్పలేని పరిస్తితి ఉందని చెప్పొచ్చు. ఇప్పటికిప్పుడు టీడీపీ పుంజుకున్నట్లు కనిపించడం లేదు. పైగా అధికార వైసీపీ దెబ్బకు టీడీపీ నేతలకు చుక్కలు కనబడుతున్నాయి. ఇప్పటికే అన్నీ జిల్లాల్లో తిరుగులేని బలంతో ఉన్న వైసీపీ...టీడీపీ గెలిచిన నియోజకవర్గాలని కూడా కైవసం చేసుకునే పనిలో ఉందని తెలుస్తోంది.

ఈ క్రమంలోనే టీడీపీ ఎమ్మెల్యేలు ఉన్న కొన్ని నియోజకవర్గాల్లో వైసీపీ లీడ్‌లోకి వచ్చినట్లు కనిపిస్తోంది. టీడీపీ తరుపున గెలిచిన కొందరు ఎమ్మెల్యేలు డేంజర్ జోన్‌లో ఉన్నారని విశ్లేషణలు వస్తున్నాయి. గత ఎన్నికల్లో టీడీపీ తరుపున 23 మంది ఎమ్మెల్యేలు విజయం సాధించగా, అందులో నలుగురు ఎమ్మెల్యేలు వైసీపీ వైపుకు వెళ్లారు. అంటే ఇప్పుడు టీడీపీకి 19 మంది ఎమ్మెల్యేల బలం ఉంది.

ఈ 19 మందిలో సగం ఎమ్మెల్యేలు డేంజర్ జోన్‌లో ఉన్నారని తెలుస్తోంది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే వారు ఓడిపోయే పరిస్తితి కూడా ఉందని విశ్లేషకులు అంటున్నారు. అలా డేంజర్ జోన్‌లో ఉన్నవారిలో ఇచ్చాపురం ఎమ్మెల్యే బెందాళం అశోక్ ముందువరుసలో ఉన్నారని తెలుస్తోంది. వరుసగా రెండుసార్లు ఇచ్చాపురం నుంచి గెలిచిన అశోక్, ఎమ్మెల్యేగా మంచి పనితీరు కనబర్చడంలో వెనుకబడి ఉన్నారని అంటున్నారు. అలాగే అక్కడ వైసీపీ పుంజుకుందని తెలుస్తోంది.

అటు టీడీపీకి దూరంగా ఉంటున్న గంటా శ్రీనివాసరావు సైతం విశాఖ నార్త్‌లో చేతులెత్తేసారని చెబుతున్నారు. మళ్ళీ అక్కడ గంటాకు గెలిచే ఛాన్స్ కనబడటం లేదు. విశాఖ ఈస్ట్‌లో వెలగపూడి రామకృష్ణ, పెద్దాపురంలో చినరాజప్ప, ఉండిలో మంతెన రామరాజు పరిస్తితి కూడా అంత మెరుగుగా లేదని తెలుస్తోంది. అలాగే విజయవాడ ఈస్ట్‌లో గద్దె రామ్మోహన్‌కు వైసీపీ నేత దేవినేని అవినాష్ గట్టి పోటీ ఇస్తున్నారు. ఇక రేపల్లెలో అనగాని సత్యప్రసాద్, అద్దంకిలో గొట్టిపాటి రవికుమార్‌లకు అంత అనుకూల పరిస్తితులు కనిపించడం లేదు.  మొత్తానికైతే ఈ టీడీపీ ఎమ్మెల్యేలు డేంజర్ జోన్‌లో ఉన్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: