వైఎస్ వివేకా హత్య కేసు రెండేళ్లుగా జీడిపాకం సీరియల్‌ లా సాగిపోతోంది తప్ప.. ఇప్పటి వరకూ ఓ కొలిక్కి రాలేదు. అయితే కొన్ని రోజులుగా ఈ కేసులో జోరు పెరిగింది.. సునీల్ యాదవ్‌ అనే వ్యక్తిని సూత్రధారిగా అనుమానించి విచారణ సాగించారు. ఇంకేముంది.. సునీల్ యాదవ్ కీలక విషయాలు చెప్పాడు.. ఆయన చెప్పిన వివరాల ఆధారంగా ఆయుధాల కోసం అన్వేషణ కూడా సాగిందన్న ప్రచారం జోరుగా సాగింది. ఈ హడావిడి అంతూ చూసి ఇంకేముంది కేసు మిస్టరీ వీడిపోనుంది అని అంతా అనుకున్నారు.


ఇలాంటి సమయంలో సీబీఐ ఓ సంచలన ప్రకటన విడుదల చేసింది. అది కూడా పత్రికాముఖంగా ఈ ప్రకటన విడుదల చేసింది. అదేంటంటే.. వివేకా హత్య కేసుకు సంబంధించిన ఎలాంటి కీలకమైన సమాచారం సీబీఐకి ఇచ్చినా వారికి రూ. 5 లక్షల రూపాయలు బహుమతిగా ఇస్తామని ప్రకటించింది. అయితే ఆ సమాచారం కీలకమైంది, నమ్మదగినదిగా ఉండాలని ఆ ప్రకటనలో తేలింది. ఇప్పుడు ఇలా బహిరంగంగా ప్రకటన చేయడం అందరికీ ఆలోచింపజేస్తోంది.


ఈ ప్రకటన విడుదల చేసిన తీరు చూస్తే.. సీబీఐ పూర్తిగా చేతులెత్తేసినట్టే కనిపిస్తోంది. ఇన్నాళ్ల విచారణలో ఏమీ కనిపెట్టలేకపోయాం.. జనం ఏదైనా క్లూ ఇవ్వకపోతారా.. దాన్ని బట్టి కేసును ఓ కొలిక్కి తెస్తాం అన్నట్టుగా ఉంది ఈ ప్రకటన. సీబీఐ ఇంకా ఏమీ చేయలేక చివరి అస్త్రంగా ఈ ప్రకటన విడుదల చేసిందా.. లేక.. ఇప్పటి వరకూ తమకు దొరికిన ఆధారాలతో సరిపోల్చుకునేందుకు కానీ.. కన్‌ఫర్మేషన్‌ కోసం కానీ.. ఇలా ప్రకటన ఇచ్చిందా అన్నదానిపై స్పష్టత కనిపించడం లేదు.


ఓవైపు.. ఈ కేసులో వైఎస్‌ కుటుంబీకులు దోషులుగా తేలే అవకాశం ఉందని ప్రచారం జరిగింది. అలా జరిగితే సీఎం జగన్‌కు ఇబ్బందికరంగా మారుతుందన్న అంచనాలు కూడా ఉన్నాయి. ఈ సమయంలో సీబీఐ చేసిన ఈ ప్రకటనతో ఆ సంస్థ చేసేదేమీ పెద్దగా లేదన్న వాదనే వినిపిస్తోంది. చూడాలి ఏం జరుగుతుందో..?

మరింత సమాచారం తెలుసుకోండి: